ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. హస్తం పార్టీలో ఆ నిశ్శబ్దం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి?

ఎన్నికల నగారా మోగిందా పార్టీలు, కార్యకర్తలు నాయకుల్లో ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు. దేశమంతా రాజకీయ వేడి రాజుకుంటుంది.;

Update: 2026-03-23 05:51 GMT

ఎన్నికల నగారా మోగిందా పార్టీలు, కార్యకర్తలు నాయకుల్లో ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు. దేశమంతా రాజకీయ వేడి రాజుకుంటుంది. ఎన్నికల పండుగను పార్టీల అధినాయకుల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు సంబురంగా జరుపుకుంటారు. ఇంత కోలాహలం మధ్య ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ, దేశంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో కనిపిస్తున్న ‘'స్తబ్దత’ రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో ఎక్కడ ఎన్నికలు ఉన్నా రాహుల్ గాంధీ పర్యటనలు, భారీ బహిరంగ సభలతో హోరెత్తించే హస్తం పార్టీ, ఇప్పుడు కేవలం రాష్ట్ర స్థాయి నాయకులకే బాధ్యతలు అప్పగించి మిన్నకుండిపోవడం వెనుక వ్యూహం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. బెంగాల్ నుంచి కేరళ వరకు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆ పార్టీలో కనిపిస్తున్న ఈ అసాధారణ నిశ్శబ్దాన్ని పరిశీలిస్తే..

అసోంలో హిమంత బిశ్వ శర్మను ఢీకొనేదెలా?

అసోం రాజకీయాల్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యూహాలను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ చతికిలబడుతోంది. ఈసారి పొత్తులు కుదరకపోవడం కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బగా మారింది. గతంలో ఉన్న మిత్రపక్షాలు దూరం కావడం, బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడంతో ప్రచారంలో జోరు కనిపించడం లేదు. అధిష్టానం నుంచి సరైన దిశానిర్ధేశం లేకపోవడంతో అసోం శ్రేణులు అయోమయంలో పడ్డాయి.

డీఎంకేతో సీట్ల సర్దుబాటు రగడ!

తమిళనాడులో అధికార డీఎంకేతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, కాంగ్రెస్‌కు దక్కిన సీట్లు ఆ పార్టీ గౌరవానికి తక్కువగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం 240 స్థానాల్లో కేవలం 36 సీట్లు మాత్రమే దక్కించుకోవడంపై స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. రాజ్యసభ సీట్ల కోసం అసెంబ్లీ స్థానాలను త్యాగం చేశారన్న ఆరోపణలకు అధిష్టానం సమాధానం చెప్పలేకపోతోంది. దీనివల్ల ప్రచారంలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు, కేవలం స్థానిక నేతలే బాధ్యతలు మోస్తున్నారు.

బీజేపీ vs మమత పోరులో మాయం!

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసినప్పటికీ, ఈసారి పొత్తులపై క్లారిటీ లేకపోవడంతో అభ్యర్థుల ఎంపికలో వెనుకబడింది. అటు బీజేపీ ఇప్పటికే దూకుడుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంటే, కాంగ్రెస్ ఇంకా సీట్ల సర్దుబాటులోనే కొట్టుమిట్టాడుతోంది. బెంగాల్‌లో ప్రధాన పోటీ మమతా బెనర్జీ, బీజేపీ మధ్యే ఉండడంతో, కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

కేరళ, పుదుచ్చేరి - అంతర్గత విభేదాల సెగ!

కాంగ్రెస్‌కు పట్టున్న కేరళలో కూడా ఐక్యత లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పైకి 100 సీట్లు గెలుస్తామని నేతలు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో గ్రూపు రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు సీఎం పినరాయి విజయన్ పట్ల ప్రజల్లో సానుకూలత పెరగడం కాంగ్రెస్‌కు ఆందోళన కలిగించే అంశం. పుదుచ్చేరిలో కూడా డీఎంకేతో సమన్వయం లోపించడం వల్ల బీజేపీ కూటమికి అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయని సర్వేలు కోడై కూస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో రాహుల్ గాంధీ ప్రచారంలో యాక్టివ్‌గా లేకపోవడం కార్యకర్తల్లో నిరాశను నింపుతోంది.

కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్న ఈ ‘చడీ చప్పుడు లేని’ వాతావరణం వెనుక ఏదైనా పెద్ద వ్యూహం ఉందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఎన్నికల వేళ స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగకపోవడం ప్రత్యర్థులకు కలిసొచ్చే అంశం. రాష్ట్రాల నాయకులపైనే భారం వేయడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన హస్తం శ్రేణుల్లో ఉంది. నోటిఫికేషన్లు వచ్చాకైనా కాంగ్రెస్ తన దూకుడు పెంచుతుందో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News