యాక్టివ్ గా లేవంటూ ముఖం మీద చెప్పిన బాబు ?
ఎందుకంటే వైసీపీ నుంచి బీసీ సామాజిక వర్గం మత్స్యకార వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ ఇంఛార్జిగా ఉన్నారు జనసేనలోనూ బీసీ నేత ఎమ్మెల్యేగా ఉన్నారు.
మొదట కాంగ్రెస్ లో ఉండి తరువాత వైసీపీలో చేరి ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఒక ఇంచార్జికి పదవీ గండం ఉందా అన్న చర్చ సాగుతోంది. చంద్రబాబు టీడీపీ అధినేతగా ఎంత జాగ్రత్తగా పరిశీలన చేస్తారు అన్నది కూడా ఈ సందర్భంగా తెలుస్తోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ పర్యటన చేసిన చంద్రబాబు ఇదే సందర్భంగా ఒక తమ్ముడికి తలంటారు అని అంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి అయిన సీతం రాజు సుధాకర్ పని తీరు మీద బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు అని అంటున్నారు.
బాబు మార్క్ క్లాస్ :
బాబు విశాఖ పర్యటనలో ఆయన అధికారిక కార్యక్రమాలు దక్షిణ నియోజకవర్గంలోనే కొనసాగాయి. ఈ సందర్భంగా తనను కలిసిన దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ సీతం రాజు సుధాకర్ ముఖం మీదనే యాక్టివ్ గా మీరు లేరు అని బాబు చెప్పేశారు. పార్టీ కార్యక్రమాల విషయంలో వెనుకబడ్డారు అని కూడా చెప్పేశారు అని అంటున్నారు. ఇలా అయితే ఎలా అని ఒకింత ఆగ్రహంగా అసహనంగా బాబు ప్రశ్నించడంతో సదరు ఇంచార్జి మౌనం దాల్చారు. ఇది మీడియా కంటబడి రికార్డు కూడా కావడంతో దక్షిణ నియోజకవర్గంలో ఆయనకు పదవీ గండం తప్పదని అంటున్నారు.
వైసీపీలో కీలకంగా :
ఇక చూస్తే గతంలో సీతం రాజు వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. ఆయన 2023 లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆయనకు వైసీపీలో కూడా నామినేటెడ్ పదవిగా బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల ముందు దక్షిణ నియోజకవర్గం సీటుని ఆశించిన ఆయన అది దక్కదని తెలిసి టీడీపీలోకి వెళ్ళారని చెబుతారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్ళిపోయింది దాంతో ఎన్నికల్లో పనిచేసిన ఆయనకు ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కార్పోరేషన్ చైర్మన్ పదవి దక్కింది. అలాగే ఇంచార్జిగా కూడా పార్టీ పదవిని ఇచ్చారు. అయితే రెండేళ్ళ కాలంలో ఆయన టీడీపీ పరంగా పెద్దగా చేసింది లేదని సొంత పార్టీ నేతల నుంచే ఫిర్యాదులు వెళ్ళడంతో పాటు మిత్ర పక్షంగా ఉన్న జనసేనతో కో ఆర్డినేషన్ చేసుకోలేకపోవడంతో ఆయన మీద హైకమాండ్ ఈ విధంగా ఘాటుగానే రియాక్ట్ అయింది అని అంటున్నారు.
మైనారిటీలకు చాన్స్ :
ఇదిలా ఉంటే మైనారిటీలకు ఈ ఇంచార్జి పదవి ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే వైసీపీ నుంచి బీసీ సామాజిక వర్గం మత్స్యకార వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ ఇంఛార్జిగా ఉన్నారు జనసేనలోనూ బీసీ నేత ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో మైనారిటీలు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారికి టీడీపీ ప్రాధాన్యత ఇవ్వవచ్చు అని అంటున్నారు. స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తమ్ముళ్ళు కోరుతున్న నేపధ్యంలో బాబు టూర్ లోనే సీతం రాజుకు క్లాస్ తీసుకున్నారు అన్న వార్తలతో మార్పు అనివార్యం అని పెద్ద ఎత్తున వినిపిస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.