ఏపీకి వారం పాటు దూరంగా బాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి దాదాపుగా వారం రోజుల పాటు దూరంగా ఉండనున్నారు. ఆయన దావోస్ పర్యటన చేపడుతున్నారు.;

Update: 2026-01-18 03:22 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి దాదాపుగా వారం రోజుల పాటు దూరంగా ఉండనున్నారు. ఆయన దావోస్ పర్యటన చేపడుతున్నారు. దావోస్ లో జరిగే అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అక్కడ ప్రపంచ దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో బాబు వరుస భేటీలు నిర్వహించనున్నారు. అంతే కాదు ఏపీకి పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ఈ టూర్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

18న చలో దావోస్‌ :

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక ఆయన అక్కడ 19 తేదీన రాత్రి 1.45 గంటలకు బయలుదేరి ఆ రోజున ఉదయం జ్యూరిచ్ విమానాశ్రయానికి నేరుగా చేరుకుంటారు. ఇక జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్విట్జర్లాండ్‌ భారతీయ రాయబారి మృదుల్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. ఆ మీదట బాబు వరుస భేటీలు మొదలవుతాయి.

ఫుల్ బిజీ బిజీగా :

ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో పూర్తిగా బిజీగా గడపనున్నారు. ఆయన ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలర్ మేర్క్స్ సంస్థల సీఈఓలతో చర్చలు జరుపుతారు. అదే విధంగా స్విట్జర్లాండ్, యూఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక బాబు పర్యటన షెడ్యూల్ చూస్తే తొలి రోజు అంటే 19న 20 దేశాలకు చెందిన ఎన్నార్టీలతో తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొంటారు అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.

కీలక మీటింగులు :

చంద్రబాబు దావోస్ టూర్ అంతా కీలక భేటీలు మీటింగులతో సాగనుంది. దావోస్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్ధిక, పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో భేటీతో పాటు టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తో కూడా బాబు భేటీ అవుతారు. అలాగే సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా దావోస్ వేదికగా సీఎంతో సమావేశం అవుతారు. విదేశీ మీడియా సంస్థ పొలిటికోకు ముఖ్యమంత్రి ప్రత్యేక ఇంటర్యూని ఈ సందర్భంగా ఇస్తారని తెలుస్తోంది.

ప్రముఖులతో చర్చలు :

ఈ పర్యటనలో స్విట్జర్లాండ్ ఆర్ధిక వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ హెలెన్ బడ్లిజెర్ అర్టెడా, రాయబారి ఆండ్రియా రౌబర్‌తో బాబు చర్చలు జరుపుతారు. అలాగే స్విట్జర్లాండ్ పార్లమెంటు సభ్యుడు భారత- స్విస్ ఫ్రెండ్ షిప్ గ్రూప్ అధ్యక్షుడు నిక్ గుగ్గర్ సహా ఇతరులతో సమావేశం కానున్నారు.ఎన్విడియా ఉపాధ్యక్షుడు కాలిస్టా రెడ్మండ్‌తో, ఇజ్రాయెల్ ఆర్ధిక పారిశ్రామిక విభాగం మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్, స్విట్జర్లాండ్‌లో ఇజ్రాయెల్ ఎకనామిక్ ట్రేడ్ మిన్ హెడ్ షిర్ స్లడ్జ్కీ తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరపనున్నారని అధికార వర్గాలు పెర్కొన్నాయి.

తిరుగు ప్రయాణం :

ఇక వరసగా నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ వేదిక మీద జరిగే పలు కార్యక్రమాలలో పాలుపంచుకున్న అనంతరం ముఖ్యమంత్రి ఈ నెల 22 తేదీన దావోస్ నుంచి జ్యూరిచ్ కు చేరుకుని స్విడ్జర్లాండ్ కాలమానం ప్రకారం 2.35 గంటలకు భారత్ కి బయల్దేరి రానున్నారని చెబుతున్నారు. ఆయన 23వ తేదీ ఉదయం 8.25 గంటలకు నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు పర్యటన దాదాపుగా వారం పాటు సాగనుంది. బాబు పర్యటనలో ఐటీ మంత్రి నారా లోకేష్, అలాగే పరిశ్రమల మంత్రి టీజీ భరత్ కూడా భాగస్వాములు కానున్నారు. సీఎం లేని వారం రోజులు ఏపీ అనుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే బాబు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే మోనిటరింగ్ చేస్తారు. పాలన అంతా సజావుగా నడిపిస్తారు అన్నది తెలిసిందే.

Tags:    

Similar News