బాబు మరీ ఇంత మెతకా... ఎందుకిలా ..!
టీడీపీ అధినేత చంద్రబాబు మాటంటే.. పార్టీ నాయకులకు శిరోధార్యం. ఆయన గీసిన గీత.. చెప్పిన మాట జవదాటాలంటే.. తమ్ముళ్లకు వణుకు.;
టీడీపీ అధినేత చంద్రబాబు మాటంటే.. పార్టీ నాయకులకు శిరోధార్యం. ఆయన గీసిన గీత.. చెప్పిన మాట జవదాటాలంటే.. తమ్ముళ్లకు వణుకు. అయితే.. ఇది ఒకప్పటి మాట. రాను రాను.. చంద్రబాబు గత పట్టును తమ్ముళ్లపై కోల్పోతున్నారన్నది వాస్తవం. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో అయితే.. ఆయన అసలు.. మరీ మెతకగా మారిపోయారన్న వాదన వినిపిస్తోంది. ఒక్కమాట చాలని ఒకప్పుడు బాబు గురించి ఉన్న ప్రచారం.. ఇప్పుడు మాయమైంది.
రాష్ట్ర వ్యాప్తంగా గత 16 మాసాల్లో .. తమ్ముళ్లు అనేక కోణాల్లో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇది ఎంత వరకు వచ్చిందంటే.. కూటమి కట్టేందుకు, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కూడా సాయం చేసిన జనసేనపైన, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పైనా తమ్ముళ్లు విమర్శలు చేసే స్థాయి వరకు .. తీసుకు వచ్చింది. మరో వైపు.. నకిలీ మద్యం కేసు.. దీనికి పరాకాష్ఠగా మారింది. జిల్లాల్లో కుటీర పరిశ్రమల మాదిరిగా నకిలీ మద్యం తయారీ పెరిగిపోయిందంటే.. ఈ తప్పు ఎవరి ఖాతాలో పడుతోందో అర్ధం అవుతుంది.
ఇక, ఇసుక, గనులు, మద్యం కమీషన్లు.. ఇలా అనేక వివాదాల్లో తమ్ముళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కూటమిలో కొరవడిన కలివిడికి కూడా వారే భాగస్వాములు అన్నది కూడా తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా.. సీఎంగా చంద్రబాబు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేక పోతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. నిజానికిఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. ఎవరైనా తప్పులు చేయాలంటే.. భయ పడే పరిస్థితి వచ్చింది. కానీ, ఇప్పుడు యథేచ్ఛగా చేస్తున్నారు. ఏం చేసినా.. ఏమీ కాదన్న ధైర్యమే దీనికి కారణం.
మరి ఇలా ఇప్పుడు ఎందుకు జరుగుతోంది? చంద్రబాబు చూసి కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కేవలం మాటలకే ఎందుకు పరిమితం అవుతున్నారన్నది ప్రశ్న. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయన్నది విశ్లేషకులు చెబుతున్నారు.
1) చర్యలు తీసుకుంటే.. తమ్ముళ్లు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నది ప్రధాన అంశం.
2) కీలక మైన పార్టీ నాయకులే ఈ వివాదాల్లో తలదూర్చడం మరింత ఇబ్బందిగా మారింది. ఈ రెండు అంశాలే చర్యల విషయంలో చంద్రబాబుకు ఇబ్బందిగా మారాయి. దీంతో కేవలం ఆయన హెచ్చరికలకు మాత్రమే పరిమితం అయ్యారని అంటున్నారు.