50 ఏళ్ల చంద్రబాబు అనుభవానికి పవన్ పరీక్ష.. 40 శాతం లెక్క ఇదే..!

స్థానిక ఎన్నికలలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సరికొత్త రాజకీయానికి తెరతీస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Update: 2026-10-14 13:17 GMT

స్థానిక ఎన్నికలలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సరికొత్త రాజకీయానికి తెరతీస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థత, సహనాన్ని పరీక్షించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యవహార శైలి ఉందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కోసం తాము తగ్గామని చెబుతున్న పవన్.. ఇప్పుడు టీడీపీ ఆ మేరకు తగ్గాల్సిందేనని సంకేతాలు పంపుతున్నట్లుగా చెబుతున్నారు. జనసేన బలాబలాలతో సంబంధం లేకుండా మొత్తం పదవుల్లో 40 శాతం వాటా అడగడం, ఆ విషయాన్ని బహిర్గతం చేయడం ద్వారా అవసరమైతే ఒంటరి పోటీకి రెడీ అన్నట్లుగా జనసేన వైఖరి ఉందని అంటున్నారు. దీంతో కూటమిలో పొత్తు లెక్కలు క్షణక్షణానికి ఉత్కంఠ పెంచేస్తున్నాయని అంటున్నారు.

స్థానిక ఎన్నికల్లో తమకు 40 శాతం సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్న జనసేన, 40 శాతం వాటా తమ హక్కుగా భావిస్తోందని చెబుతున్నారు. దీంతో ఒక్కసీటు తగ్గినా కుదరదు అన్నట్లుగా జనసేన అధినేత సంకేతాలు పంపుతున్నారని అంటున్నారు. ఈ కారణంగా సీట్ల పంచాయితీపై పీటముడి ఉత్కంఠకు గురిచేస్తోందని చెబుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఒత్తిడికి గురిచేసి తన మాట నెగ్గించుకునేలా పవన్ ఆలోచన ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి సైతం మిత్రపక్షంపై మెతక వైఖరితో ఉండటం వల్ల టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయని అంటున్నారు. 40 శాతం వాటా సీట్లు అడుగుతున్న జనసేన మళ్లీ ఆయా సీట్లలో పోటీకి తమ పార్టీ నేతలనే తీసుకోవడం ఏం రాజకీయమో కూడా అర్థం కావడం లేదని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ముఖ్యమంత్రిని ఒత్తిడిక గురిచేసి..

సీట్ల సర్దుబాటులో తన మాట నెగ్గించుకోవడమనే ఏకైక లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ పావులు కదుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుపైనే తన అస్త్రాలు ప్రయోగిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. పవన్ విషయంలో టీడీపీ అగ్రనేత చంద్రబాబుతోపాటు యువనేత లోకేశ్ కృతజ్ఞతాభావంతో ఉండటాన్ని పవన్ తనకు అనుకూలంగా మలుచుకున్నారని అంటున్నారు. అందుకే తాను కోరుతున్న సీట్ల విషయాన్ని బయటపెట్టి కూటమిలో ఇతర పక్షాలను ఒత్తిడికి లోను చేశారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కోసం తగ్గినట్లు చెబుతున్న పవన్, తన పార్టీకి ఉన్న వాస్తవ బలాన్ని ఇప్పుడు పరిగణనలోకి తీసుకోకపోవడంపైనే అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ అడిగిన అన్ని సీట్లు ఇచ్చినా, కొన్నిచోట్ల సమర్థులైన నేతలు లేక తమ పార్టీ నుంచి నాయకులను చేర్చుకుని పోటీకి పెట్టిన విషయాన్ని మరచిపోకూడదని కొందరు టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. కానీ, పవన్ మాత్రం ఇప్పుడు గతాన్ని వదిలేసి అదే పద్ధతిలో ఎక్కువ సీట్లు తీసుకోవడమే కాకుండా, తమ పార్టీ నేతలను దిగుమతి చేసుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని చెబుతున్నారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో తన పార్టీని బలోపేతం చేసుకోవడంతోపాటు స్థానిక సంస్థల్లో జన సేన భాగస్వామ్యం పెంచుకోవాలనే ఎత్తుగడను అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి కూటమిగా ఉన్నప్పుడు పార్టీల ఓట్ల శాతం ఆధారంగా సీట్ల పంపిణీ ఉంటుందని అంటున్నారు. కానీ, జనసేన మాత్రం తమ పార్టీ ఓటింగుతో సంబంధం లేకుండా బలంగా ఉన్నామని, కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీతో సమానంగా వాటా కావాలని కోరుకోవడంపైనే పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కూటమిగా చర్చలకు కూర్చొన్న సమయంలో ఎక్కడో ఒక చోట ఏకాభిప్రాయానికి రావాల్సివుండగా, పవన్ మాత్రం మొండి పట్టుదలతో తాడోపేడో తేల్చేసుకుందాం.. అన్న స్థాయికి చర్చల వాతావరణాన్ని తీసుకువెళ్లడం కూడా రాజకీయంగా వేడిపుట్టిస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా, 6 మేయర్, 38 మున్సిపల్ చైర్మన్ పదవులను కోరుతున్న జనసేన ఒక్క స్థానం కూడా వదులుకోలేమని చెప్పడం ద్వారా ధృడమైన వైఖరి తీసుకున్నట్లుగా సంకేతాలు పంపుతోందని అంటున్నారు. ఈ విషయమై టీడీపీలోనూ అంతర్గతంగా భారీగా చర్చ జరుగుతున్నట్లు చెబుతున్నారు. జనసేనకు వాస్తవ బలం ఉన్న చోట సీట్లు ఇవ్వడంలో ఎవరికీ అభ్యంతరం లేకపోయినా, 40 శాతం వాటా అంటూ ఎక్కువ సీట్లు అడగడంపై ఆ పార్టీలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ పొలిట్ బ్యూరో వరకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కు భయపడి ఎవరూ ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News