‘ఖజానా’ జువెలర్స్‌లో దోపిడీ వెనుక పెద్ద స్కెచ్.. వైరల్ వీడియో

పోలీసుల సమాచారం ప్రకారం, షాపు తెరిచిన కేవలం ఐదు నిమిషాల్లోనే ఆరుగురు దుండగులు లోపలికి ప్రవేశించారు.;

Update: 2025-08-13 08:15 GMT

హైదరాబాద్‌ నగరంలో సంచలనం సృష్టించిన చందానగర్ ‘ఖజానా’ జ్యువెలర్స్ దోపిడీ ఘటనకు సంబంధించిన కొత్త సీసీటీవీ ఫుటేజ్‌ బయటకు వచ్చింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ దోపిడీ అచ్చం సినిమాలా సాగింది. మాస్కులు ధరించిన దుండగులు తుపాకులు, పదునైన ఆయుధాలతో షాపులోకి దూసుకెళ్లి బంగారు, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు.

-ఐదు నిమిషాల్లో దోపిడీ

పోలీసుల సమాచారం ప్రకారం, షాపు తెరిచిన కేవలం ఐదు నిమిషాల్లోనే ఆరుగురు దుండగులు లోపలికి ప్రవేశించారు. మొదట సిబ్బందిని తుపాకులతో బెదిరించి భయాందోళనలకు గురిచేశారు. వెంటనే షాపులోని అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేసి, బంగారు ఆభరణాలను సంచుల్లో వేసుకున్నారు. నగదు బాక్సులను బద్దలు కొట్టి నోట్ల కట్టలను కూడా తీసుకెళ్లారు. ఈ ఘటనలో అసిస్టెంట్ మేనేజర్ కాలికి గాయమై చికిత్స పొందుతున్నారు.

-ముందే చేసిన రెక్కీ

ఈ దోపిడీ అప్పటికప్పుడు జరిగినది కాదని, దుండగులు ముందుగానే షాపును గమనించి, పక్కా ప్లాన్ వేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. సంఘటనకు ముందు పలు రోజుల పాటు షాపు చుట్టుపక్కల రెక్కీ నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం షాపు తెరచిన వెంటనే దాడి చేయడం కూడా ఈ ప్రణాళికలో భాగమే.

-పోలీసుల దర్యాప్తు వేగం

దొంగలను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దుండగుల కదలికలను సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా విశ్లేషిస్తున్నారు. అయితే ఎంత బంగారం, ఎంత నగదు పోయిందనే విషయాన్ని షాపు యాజమాన్యం ఇంకా వెల్లడించలేదు.

ఈ ఘటన నగరంలోని వ్యాపార వర్గాల్లో ఆందోళన రేపుతోంది. పోలీసులు త్వరితగతిన నిందితులను పట్టుకోవడమే కాకుండా, ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Full View
Tags:    

Similar News