జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఆంథ్రోపిక్ సీఈవో కుటుంబానికి సంబంధాలు? క్లార్క్ పాత వ్యాపార ప్రయత్నాలపై కలకలం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఆంథ్రోపిక్ సీఈవో దారియో అమోడీ భార్య క్యామీ క్లార్క్‌ పేరు తాజాగా ఒక వివాదంలోకి వచ్చింది.

Update: 2026-08-16 17:49 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఆంథ్రోపిక్ సీఈవో దారియో అమోడీ భార్య క్యామీ క్లార్క్‌ పేరు తాజాగా ఒక వివాదంలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో క్లార్క్‌ గత వ్యాపార ప్రయత్నాలకు సంబంధించిన ఈమెయిల్స్ వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె ‘లగ్జరీ పో*ర్న్’గా పేర్కొన్న ఒక వ్యాపార ప్రాజెక్ట్‌ కోసం ఎప్‌స్టీన్‌ను పెట్టుబడి కోరినట్లు పలు పాశ్చాత్య మీడియా కథనాలు వెల్లడించాయి.

ఎప్‌స్టీన్‌కు పంపిన ఈమెయిల్ వివరాలు

వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. క్యామీ క్లార్క్‌ 2012లో జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు ఒక ఈమెయిల్ పంపారు. గతంలో ఒక టెడ్ సమావేశంలో వారిద్దరికీ పరిచయం ఏర్పడిందని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ‘ఇడ్డీస్’ పేరుతో మహిళలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఒక లగ్జరీ అడల్ట్ కంటెంట్ వ్యాపార ఆలోచనను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కేవలం ఆలోచనను పంచుకోవడమే కాకుండా ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు, సమ్మరీ, స్క్రిప్ట్స్‌ తదితర సమాచారాన్ని కూడా పంపినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు పెట్టుబడి పెట్టాలని ఆమె కోరినప్పటికీ ఎప్‌స్టీన్ దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదని.. అందువల్ల ఎటువంటి పెట్టుబడి పెట్టలేదని సమాచారం.

ఇప్పుడు ఈ విషయం ఎందుకు చర్చనీయాంశమైంది?

క్యామీ క్లార్క్‌ ప్రస్తుతం ఆంథ్రోపిక్ సంస్థతో ముడిపడి ఉండటమే ఈ పాత వ్యవహారం మళ్లీ వెలుగులోకి రావడానికి కారణం. ఆంథ్రోపిక్ సీఈవో దారియో అమోడీకి ఆమె భార్య మాత్రమే కాకుండా సంస్థ ప్రారంభ రోజుల్లో కీలక సలహాదారుగా వ్యవహరించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఆంథ్రోపిక్‌లో ఆమెకు అధికారిక హోదా లేకపోయినప్పటికీ పెట్టుబడిదారులు, టెక్ రంగానికి చెందిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పరచడంలో ఆమె పాత్ర ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో క్లార్క్‌ పలు వ్యాపార ప్రయత్నాలు చేశారు. మహిళల కోసం రూపొందించిన అడల్ట్ కంటెంట్ ప్రాజెక్ట్‌తో పాటు, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్‌టెక్ స్టార్టప్‌లను కూడా ఆమె ప్రారంభించారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్ – నిజానిజాలు

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఒకరి పేరు ఉన్నంత మాత్రాన, వారు ఆయన చేసిన చట్టవిరుద్ధమైన లేదా నేరపూరిత చర్యల్లో భాగస్వాములని భావించకూడదు. ప్రస్తుతం బయటకు వచ్చిన ఆధారాల ప్రకారం క్లార్క్‌ కేవలం తన వ్యాపారం కోసం పెట్టుబడి సేకరించే ప్రయత్నంలో భాగంగానే ఎప్‌స్టీన్‌ను సంప్రదించారు. ఆ వ్యాపారంలో ఎప్‌స్టీన్ భాగస్వామిగా మారినట్లు గానీ పెట్టుబడి పెట్టినట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవు.

ఏదేమైనప్పటికీ సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఏఐని అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకునే ఆంథ్రోపిక్ వంటి అగ్రగామి సంస్థ సీఈవో కుటుంబానికి సంబంధించిన పాత పరిచయాలు బయటపడటం ప్రస్తుతం టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Tags:    

Similar News