బొత్స బాధ్యతలు ఆమెకు ?
విజయనగరం జిల్లాకు చెందిన బీసీ నేత బొత్స సత్యనారాయణ విషయంలో ఇపుడు ఒకటి ప్రచారంలో ఉంది.
విజయనగరం జిల్లాకు చెందిన బీసీ నేత బొత్స సత్యనారాయణ విషయంలో ఇపుడు ఒకటి ప్రచారంలో ఉంది. ఆయన రాజకీయాల నుంచి నెమ్మదిగా తప్పుకుంటారు అని అంటున్నారు. బొత్స వయసు కూడా దాదాపుగా ఏడు పదులకు చేరువ అవుతోంది. ఆయన అనారోగ్య సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్యనే ఆయన ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. బడ్జెట్ సెషన్ లో కూడా బొత్స శాసన మండలిలో మాట్లాడుతూ ఒక దశలో తూలిపడబోయిన సందర్భం కూడా అంతా చూశారు. దాంతో పాటుగా బొత్స కుటుంబీకులు అయితే ఆయనను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుతున్నారని అంటున్నారు.
బొత్సకు అయితే అలా :
ఇక బొత్స విషయం తీసుకుంటే ఆయనకు రాజకీయాలు అంటే ఇష్టం. కొనసాగాలనే ఉంది. పైగా తన వారసులను 2029 ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకోవాలని ఉందని అంటున్నారు. జిల్లా రాజకీయాలనే కాదు ఉత్తరాంధ్రాలోనే శాసించిన బీసీ నేతగా ఒక కీలకమైన నాయకుడిగా బొత్స కనిపిస్తారు. ఆయన కాంగ్రెస్ లో పుట్టి పెరిగారు. ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్ గా కూడా పనిచేశారు. ఇక విభజన తరువాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మంచి ఓట్లు సాధించారు. అయితే ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరారు. అలా 2019లో విజయనగరం జిల్లా మొత్తం వైసీపీ స్వీప్ చేసింది. దానికి బొత్స కృషి రాజకీయ వ్యూహాలు కారణం అని చెబుతారు.
ఏణ్ణర్థం పైగా పదవి :
బొత్స 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు చేతిలో ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత ఆయనకు విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్సీ అయ్యారు. ఆ వెంటనే శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడుగా కూడా అయ్యారు. ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 డిసెంబర్ దాకా ఉంది. అంతవరకూ ఆయన విపక్ష నేత హోదా కూడా ఉంది. అయితే ఆరోగ్య కారణాల వల్ల బొత్స ఆ పదవిని తాను నిర్వహించలేనని జగన్ కి చెప్పారని అంటున్నారు. అంతే కాదు ఆయనకు గోదావరి జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ గా పార్టీ బాధ్యతలు అప్పగించింది. వాటి విషయంలోనూ ఆయన చేయలేనని చెప్పారని అంటున్నారు.
ఉత్తరాంధ్రకే మళ్ళీ :
అయితే లండన్ నుంచి తిరిగి వచ్చిన జగన్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. పార్టీ నాయకులతో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన భేటీ అవుతున్నారు. వర్తమాన రాజకీయాల గురించి కూడా ఆయన వాకబు చేస్తూ అందరితోనూ చర్చలు జరుపుతున్నారు. ఆ మీదట ఆయన బొత్స సత్యనారాయణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. బొత్స ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందువల్ల శాసన మండలిలో ప్రతిపక్ష నాయక పదవిని అదే ప్రాంతానికి అదే బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేస్తోంది అని అంటున్నారు. అదే కనుక జరిగితే అనకాపల్లి జిల్లాకు చెందిన రాష్ట్ర వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణికి ఈ పదవిని ఇస్తారని అంటున్నారు. ఆమె శాసనమండలిలో అధికార పక్షాన్ని గట్టిగా నిలదీస్తున్నారు అని అంటున్నారు. దాంతో పాటుగా ఆమె పట్ల పార్టీ అధినాయకత్వం పూర్తి సుముఖంగా ఉందని చెబుతున్నారు. మొత్తం మీద బొత్స కనుక క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటే మాత్రం ఉత్తరాంధ్రాలో వైసీపీకి తీరని లోటుగానే చెప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు.