బొబ్బిలిలో శంబంగి సత్తా చాటేనా.. మండలాల వారీ రిపోర్టు!
విజయనగరం జిల్లాలోని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న నాలుగు మండలాల్లో రాజకీయాలు ప్రధానంగా టీడీపీ కూటమి, వైసీపీ మధ్య హోరాహోరీగా సాగుతున్నాయి.
విజయనగరం జిల్లాలోని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న నాలుగు మండలాల్లో రాజకీయాలు ప్రధానంగా టీడీపీ కూటమి, వైసీపీ మధ్య హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడి రాజకీయ ముఖచిత్రం రోజుకో రకంగా మారుతోంది. ఎమ్మెల్యే బేబినాయనపై సానుకూలత ఉన్నా.. మండలాల స్థాయిలో కొంత తేడా కొడుతోంది. 2024 శాసనసభ ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసిన బొబ్బిలి సంస్థాన వారసుడు ఆర్.వీ.ఎస్.కే.కే. రంగారావు (బేబీ నాయన) భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో బొబ్బిలి పట్టణంపై ఆయన హవా కొనసాగుతోంది.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కూడా తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ, క్షేత్రస్థాయిలో వైసీపీ క్యాడర్ బలమైన పోటీని ఇచ్చేలా చేస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గం పరిధిలోకి ప్రధానంగా బొబ్బిలి, బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాలు వస్తాయి. గత స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ నాలుగు మండలాల్లోనూ వైసీపీ తన పట్టును నిరూపించుకుంది. దీంతో గ్రామ, మండల స్థాయిల్లో పాత వైసీపీ క్యాడర్ బలంగా ఉండగా, ప్రస్తుత అధికార కూటమి ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో ఆయా మండలాల్లో తమ పట్టును పెంచుకునేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది.
బొబ్బిలి రాజవంశీకుల (బొబ్బిలి కోట) ప్రభావం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నప్పటికీ, గ్రామీణ మండలాలైన బాడంగి, తెర్లాంలలో కుల సమీకరణాలు, స్థానిక సమస్యలు రాజకీయాలను బలంగా ఎదుర్కొనలేక పోతున్నారన్న టాక్ ఉంది. ఎమ్మెల్యే బేబీ నాయన నియోజకవర్గంలో పర్యటిస్తూ మండలాల వారీగా సమస్యలు, సీఎం సహాయ నిధి వంటి ప్రభుత్వ పథకాల దరఖాస్తులను వేగంగా పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అటు అధికార కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది.
ఇదేసమయంలో వైసీపీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా శంబంగి తన సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నారు. దీంతో నాలుగు కీలక మండలాల్లోనూ ఆయన రాజకీయాలు ప్రారంభించారు. కార్యకర్తలు ఎటూ బెసగకుండా చూసుకుంటున్నారు. ఇక, ఇతర నియోజకవర్గాల్లో మాదిరిగా.. రాజకీయ ప్రేరేపిత వివాదాలు ఇక్కడ లేకపోవడంతో శంబంగికి కొంత ఎడ్జ్ కనిపిస్తోందని స్థానికంగా చర్చ సాగుతోంది. అయితే.. అధికార కూటమి మాత్రం సంక్షేమం, అభివృద్ధి తమకు ప్లస్ అని చెబుతుండడం గమనార్హం.