భాగ్యనగరం కోసం కాషాయ వ్యూహం
తెలంగాణాకు గుండె కాయ లాంటిది హైదరాబాద్. భాగ్య నగరంగా కూడా దీనిని చెప్పుకోవాలి. తెలంగాణా బడ్జెట్ లో సగానికి పైగా హైదరాబాద్ నుంచే వస్తుంది.;
తెలంగాణాకు గుండె కాయ లాంటిది హైదరాబాద్. భాగ్య నగరంగా కూడా దీనిని చెప్పుకోవాలి. తెలంగాణా బడ్జెట్ లో సగానికి పైగా హైదరాబాద్ నుంచే వస్తుంది. అలా ఎంతో ప్రాముఖ్యత ఆర్థికంగా రాజకీయంగా హైదరాబాద్ కి ఉంది. అందువల్ల గ్రేటర్ హైదరాబాద్ ని గెలుచుకుంటే తెలంగాణలో రాజకీయం మరింత సులువు అవుతుందని బీజేపీ భావిస్తోంది. తెలంగాణా పాలిటిక్స్ కి గేట్ వే లాంటిది హైదరాబాద్ అని ప్రత్యేకంగా చెప్పాల్సినది లేదు. ఇటీవలనే కేరళలోని తిరువనంతపురం కార్పోరేషన్ ని బీజేపీ గెలుచుకుంది. తిరువంతపురం కేరళ రాజధానిగా ఉంది. అలాగే తెలంగాణా రాజధాని ప్రాంతంలోనే పాగా వేయాలని కమలం పార్టీ గట్టి వ్యూహ రచన చేస్తోంది.
ఎన్నికలకు రెడీ :
గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు మరి కొద్ది నెలలలో జరగనున్నాయి. దాంతో బీజేపీ ఇప్పటి నుంచే తగిన సరకూ సరంజామాతో సిద్ధం అవుతోంది అని అంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ హైదరాబాద్ లో ఏకంగా 40కి పైగా కార్పోరేటర్లతో బలమైన స్థానంలో నిలిచింది. ఈసారి ఏకంగా అధికారమే అందుకుందామని ఉత్సాహం చూపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు వందల దాకా వార్డులు ఉన్నాయి. వీటిని మూడు కార్పోరేషన్లుగా చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ మూడింటిలో కమల వికాసం జరగాలని బీజేపీ పట్టుదలగా ఉంది. వీటిలో మేయర్ పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. బీజేపీ ఈసారి తమ బలం పెరుగుతుందని భావిస్తోంది. అందుకే సూపర్ స్పీడ్ తో రంగంలోకి దిగిపోతోంది.
గెలుపు ధీమాతో :
బీజేపీకి మొదటి నుంచి పట్టణాలలో మంచి పట్టు ఉంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉండడం, 2024 ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలను గెలుచుకోవడం, అలాగే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉండడంతో తమ బలాన్ని ఈసారి ఇంకా పెద్ద ఎత్తున విస్తరించుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ కి కూడా గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు అయితే గతంలో లేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వరసగా ఈ ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుచుకుంటూ వస్తోంది దాంతో బీఆర్ఎస్ కూడా ఇబ్బది పడుతోంది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.
మోడీతోనే బోణీ :
ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎనికల ప్రచారం అయి బయటకు చెప్పకపోయినా ప్రధాని నరేంద్ర మోడీతోనే తొలి బోణీ కొట్టాలని ఆ పార్టీ చూస్తోంది ఏప్రిల్ నెలలో మోడీ హైదరాబాద్ రానున్నారు. అయితే మొదటి వారంలో మోడీ పర్యటిస్తారు అని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే మోడీతో ఒక భారీ బహిరంగ సభను హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. ఈ మీటింగ్ నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా అదిరిపోవాలని చూస్తున్నారు ఈ బహిరంగ సభకు మొత్తం 300 డివిజన్ల పరిధిలోని జనాలను తరలించాలని చూస్తున్నారు దాంతో మోడీ సభతోనే ఎన్నికల రంగంలోకి దిగిపోవాలని బీజేపీ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి పెట్టుకుంది అని అంటున్నారు.