ముసుగుతో వస్తే ఆభరణాల్ని చూపించం.. బిహార్ వ్యాపారుల నిర్ణయం ఎందుకు?

ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బిహార్ బంగారు వర్తకుల సంఘం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.;

Update: 2026-01-08 07:53 GMT

ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బిహార్ బంగారు వర్తకుల సంఘం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల కాలంలో షాపుల్లో పెరుగుతున్న చోరీల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మాస్కులు.. హిజాబ్.. హెల్మెట్ లాంటి వాటితో ముఖాల్ని కప్పుకొని షాపుల్లోకి వచ్చే కస్టమర్లకు ఆభరణాల్ని చూపించమని.. వారికి ఆభరణాల్ని అమ్మమని బిహార్ కు చెందిన ఆల్ ఇండియా జ్యువెల్లర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ ప్రకటన చేసింది.

2025లో భోజ్ పూర్ జిల్లాలో ఒక గోల్డ్ షాపులో చోటు చేసుకున్న భారీ చోరీలో రూ.25 కోట్ల విలువైన ఆభరణాల్ని దోచేశారు. ముఖానికి మాస్కులు పెట్టుకొని వచ్చిన వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇదే తరహా ఉదంతాలు ఇటీవల కాలంలో పెరిగిపోవటంతో వ్యాపారుల సంఘం కీలకనిర్ణయాన్ని తీసుకుంది.

తోటి కస్టమర్లు.. జ్యువెల్లరీ యజమానుల భద్రతను పరిగణలోకి తీసుకొని తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వారు చెబుతున్నారు. ముఖాలు కనిపించకుండా షాపుల్లోకి వచ్చి.. బంగారు ఆభరణాలను చూపించమని అడిగితే ఇకపై కుదరదని.. కచ్ఛితంగా షాపుల్లోకి వచ్చే వారు ముఖాలు స్పష్టంగా కనిపించేలా రావాలని చెబుతున్నారు. ముఖాన్ని కవర్ చేసుకొని వస్తున్న దొంగల్ని పోలీసులు పట్టుకోవటం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. బిహార్ లో మొదలైన ఈ నిర్ణయాన్ని రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాలకు చెందిన జ్యువెలరీసంఘాలు ఫాలో అవుతాయన్న మాట బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News