100 కోట్లు ఖ‌ర్చు పెట్టాం.. ఇప్పుడేం చేద్దాం: బీఆర్ఎస్ కు మ‌రో ఆయుధం!

ఒక‌వైపు ఆర్థిక స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. క‌నీస అవ‌స‌రాల‌కు కూడా ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు.;

Update: 2025-10-23 17:38 GMT

ఒక‌వైపు ఆర్థిక స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. క‌నీస అవ‌స‌రాల‌కు కూడా ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటి స‌మ‌యంలో స‌ర్కారు సొమ్మును జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. కొంద‌రు అధికారుల అత్యుత్సాహం నేప‌థ్యంలో సొమ్ముల‌కు రెక్క‌లు వ‌చ్చాయి. అంతేకాదు.. స‌ద‌రు సొమ్మును ఒక ల‌క్ష్యం కోసం ఖ‌ర్చు చేసినా.. ఆ ల‌క్ష్యాన్ని మాత్రం అధికారులు.. ప్ర‌భుత్వం కూడా చేరుకోలేక పోయాయి. ఎన్నిక‌ల‌కు ముందు ఈ విష‌యాన్ని బీఆర్ ఎస్ ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు రెడీ అవుతోంది.

విష‌యం ఏంటి?

గ‌త నెల‌లో శ‌ర‌న్న‌వ‌రాత్రులు జ‌రిగాయి. ఈ స‌మ‌యంలో తెలంగాణ సంప్ర‌దాయం మేర‌కు బ‌తుక‌మ్మ పండుగ‌ను నిర్వ‌హిస్తారు. ఇది పూర్తిగా మ‌హిళ‌ల‌కు సంబంధించిన పండుగ కావ‌డంతో గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం వారిని మ‌చ్చిక చేసుకునేందుకు బ‌తుక‌మ్మ పండుగ సంద‌ర్భంగా చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఇక‌, కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా.. తొలిసారీ ఈ పండుగ‌కు మ‌హిళ‌ల‌ను మెప్పించే దిశ‌గా అడుగులు వేసింది. దీనిలో భాగంగా రెండు ద‌ఫాలుగా 100 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసి.. చీర‌లు కొనుగోలు చేశారు.

ఆయా చీర‌లు.. జిల్లా కేంద్రాల‌కు కూడా చేరాయి. వీటిని గోడౌన్ల‌లో భ‌ద్ర ప‌రిచారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ జ‌రుగుతుంద‌ని.. ఆ త‌ర్వాత జిల్లాల్లో మంత్రుల చేతుల మీదుగా వాటిని పంపిణీ చేయాల‌ని భావించారు. అయితే.. హైద‌రాబాద్‌లో తొలిద‌శ‌లో 5 ల‌క్ష‌ల చీర‌లే తీసుకున్నారు. కానీ, చుట్టుప‌క్క‌ల ఉన్న ప్రాంతాల్లోని మ‌హిళ‌ల‌ను లెక్కించుకున్నాక ఈ సంఖ్య 12 ల‌క్ష‌ల‌కు పెరిగింది. దీంతో మ‌రో 12 ల‌క్ష‌ల రూపాయ‌ల చీర‌ల‌కు ఆర్డ‌ర్లు ఇచ్చి తెప్పించే వ‌ర‌కు వాటి పంపిణీని వాయిదా వేశారు.

ఇంత‌లో జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల కోడ్ రావ‌డంతో పంప‌కాల‌కు బ్రేక్ ప‌డింది. వెర‌సి మొత్తంగా ఈ బతుక‌మ్మ చీర‌లు ప్ర‌స్తుతం గోడౌన్ల‌కే ప‌రిమితం అయ్యాయి. మ‌రోవైపు దీపావ‌ళి కూడా అయిపోయింది. దీంతో ఇప్పుడు వీటిని ఏం చేయాల‌న్న విష‌యంపై మంత్రి వ‌ర్గం స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. వ‌చ్చే సంక్రాంతి వ‌ర‌కు వేచి ఉండి.. అప్పుడు పంపిణీ చేయాల‌ని ప‌లువురు మంత్రులు సూచించిన‌ట్టు తెలిసింది. కాగా.. జూబ్లీహిల్స్ ఎన్నిక ల‌వేళ బీఆర్ ఎస్ దీనిని కూడా ప్ర‌స్తావిస్తోంది. త‌మ హ‌యాంలో బ‌తుక‌మ్మ చీర‌లు ఇచ్చి మ‌హిళ‌ల‌ను గౌర‌వించామ‌ని.. ఇప్పుడున్న ప్ర‌భుత్వం వారిని అవ‌మానిస్తోంద‌ని నాయ‌కులు చెబుతున్నారు. ఇదీ.. సంగ‌తి!.

Tags:    

Similar News