విమానాశ్రయంలో భారత మహిళకు వేధింపులు.. ఊహించినట్లే చైనా రియాక్షన్!

అందులో తాను పుట్టిన రాష్ట్రం పేరు అరుణాచల్ ప్రదేశ్‌ అని ఉండటంతో.. అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు తన పాస్‌ పోర్ట్ చెల్లదని ప్రకటించారని ఆమె ఆరోపించారు.;

Update: 2025-11-25 20:30 GMT

అరుణాచల్ ప్రదేశ్ అంశంపై చైనాలోని షాంఘై ఎయిర్ పోర్ట్ లో భారత మహిళ వాంగ్ జోమ్ థాంగ్ డోక్ కు వేధింపులు ఎదురైన సంగతి తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ చైనా భూభాగం అంటూ చైనీస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను వేధించిన విషయం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై చాలామంది ఊహించట్లుగానే చైనా స్పందించింది. చేసిన పనిని సమర్ధించుకుంది.

అవును.. వాంగ్ జోమ్ థాంగ్ డోక్ అనే భారత మహిళకు చైనా లోని విమానాశ్రయంలో వేధింపులు ఎదురైన విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. ఇందులో భాగంగా... సదరు భారతీయ మహిళకు ఎలాంటి వేధింపులు, నిర్బంధ చర్యలు ఎదురుకాలేదని చెప్పుకొచ్చారు.

బోర్డర్ చెక్కింగ్స్ విధులు నిర్వహించే అధికారులు నిబంధనల ప్రకారమే మొత్తం ప్రక్రియను పూర్తి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఈ క్రమంలో సదరు ప్రయాణికురాలి హక్కులకు ఎలాంటి భంగం కలిగించలేదని ఆమె పేర్కొన్నారు. అనంతరం.. భారతదేశం చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన 'అరుణాచల్ ప్రదేశ్' అని పిలవబడే ప్రాంతాన్ని చైనా ఎప్పుడూ గుర్తించలేదని అన్నారు!

అసలేం జరిగింది?:

యూకేలో నివసిస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌ కు చెందిన వాంగ్ జోమ్ థాంగ్ డోక్ అనే మహిళ.. తన అనుభవాన్ని ఆన్‌ లైన్‌ లో వివరించిన తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె నవంబర్ 21న లండన్ నుండి జపాన్‌ కు ప్రయాణిస్తుండగా షాంఘైలో దిగినప్పుడు.. ఆమె పాస్‌ పోర్ట్ చెల్లదంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పినప్పుడు ఆమె ప్రయాణం బాధాకరంగా మారిందని పేర్కొన్నారు.

అందులో తాను పుట్టిన రాష్ట్రం పేరు అరుణాచల్ ప్రదేశ్‌ అని ఉండటంతో.. అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు తన పాస్‌ పోర్ట్ చెల్లదని ప్రకటించారని ఆమె ఆరోపించారు. అరుణాచల్ చైనాలో భాగమని వ్యాఖ్యలు చేయడంతో పాటు చైనీస్ పాస్‌ పోర్ట్‌ కు దరఖాస్తు చేసుకోమని హేళన చేశారని ఆమె వాపోయారు. కనీసం ఆహారం కొనేందుకు కూడా అనుమతించలేదని తెలిపారు.

చైనా ఈస్టర్న్ ఎయిర్‌ లైన్ సిబ్బందితో పాటు మరో ఇద్దరు ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి భాషలో మాట్లాడుతూ.. అరుణాచల్‌ ను ఎత్తి చూపుతూ, నవ్వుతూ.. అది భారత్ కాదు చైనా అని అన్నారని ఆమె తెలిపారు!

ఖండించిన భారత ప్రభుత్వం!:

ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికీ భారత్‌ లో భాగమేనని, ఆ రాష్ట్ర ప్రజలు భారత పాస్‌ పోర్ట్‌ ను కలిగి ఉండేందుకు, ప్రయాణించేందుకు పూర్తిగా అర్హులని స్పష్టం చేసింది. ఆ ఘటన జరిగిన రోజే చైనాతోపాటు ఢిల్లీలోని ఆ దేశ అధికారుల వద్ద భారత్‌ నిరసన వ్యక్తంచేసింది. ఇటువంటి చర్యలు ఇరుదేశాల మధ్య సంబంధాలకు అనవసరమైన అడ్డంకులను కలిగిస్తాయని పేర్కొంది!

స్పందించిన అరుణాచల్ సీఎం!:

ఇదే సమయంలో.. ఈ ఘటనపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు స్పందించారు. ఈ సందర్భంగా... అరుణాచల్ ప్రదేశ్‌ కు చెందిన గర్వించదగ్గ భారతీయ పౌరురాలు వాంగ్‌ జోమ్ థాంగ్‌ డోక్ పట్ల షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో చైనా ఇమ్మిగ్రేషన్ అధికారుల ఆమోదయోగ్యం కాని ప్రవర్తన తనను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని.. చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌ పోర్ట్ ఉన్నప్పటికీ ఆమెను అవమానించడం దారుణమని అన్నారు.

Tags:    

Similar News