మావోయిస్టుల కథ మొత్తం క్లోజ్.. విజయవాడలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు అరెస్టు!

ఈ రోజు ఉదయం మారేడుమిల్లి ఎన్ కౌంటరులో పార్టీ కీలక నేత హిడ్మాను అంతం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కాకినాడ, విజయవాడల్లో తలదాచుకున్న 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు.;

Update: 2025-11-18 13:00 GMT

మావోయిస్టు పార్టీని ఏపీ పోలీసులు తీవ్రంగా దెబ్బతీశారు. ఈ రోజు ఉదయం మారేడుమిల్లి ఎన్ కౌంటరులో పార్టీ కీలక నేత హిడ్మాను అంతం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కాకినాడ, విజయవాడల్లో తలదాచుకున్న 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. వీరిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు 9 మంది ఉన్నారనే సమచారం సంచలనంగా మారింది. ఈ అరెస్టుతో మావోయిస్టు పార్టీ మొత్తం క్లోజ్ అయినట్లేనన్న చర్చ జరుగుతోంది. 2004లో సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భవించేటప్పుడు కేంద్ర కమిటీలో మొత్తం 42 మంది సభ్యులు ఉండేవారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎన్ కౌంటర్లు, లొంగుబాట్ల కారణంగా ఈ సంఖ్య 16కి తగ్గిందని గతంలో వార్తలు వచ్చాయి.

గత రెండు నెలలుగా జరిగిన పరిణామాలు, ప్రస్తుత అరెస్టులతో మొత్తం కేంద్ర కమిటీలో 10 నుంచి 12 మంది వరకు మాత్రమే పరిమితమైందన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఈ రోజు కాకినాడ, విజయవాడ్లో జరిగిన అరెస్టులతో 9 మందిని అరెస్టు చేయడంతో ఇక మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఎవరూ బయట లేరని అనుమానిస్తున్నారు. అయితే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల అరెస్టుపై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఈ రోజు విజయవాడ శివార్లలోని కానూరు న్యూ ఆటోనగర్ లో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ ను విజయవంతంగా లీడ్ చేసిన కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ, మావోయిస్టుల అరెస్టును ధృవీకరించారు. అయితే పట్టుబడిన వారిలో ఎవరెవరు ఉన్నారనేది ప్రస్తుతానికి తమకు తెలియదని చెప్పారు.

ఈ రోజు విచారణలో తమ అదుపులో ఉన్నది ఎవరెవరు? అన్న విషయాలను బుధవారం మీడియాకు తెలియజేస్తామని ఎస్పీ ప్రకటించారు. ఈ ఆపరేషన్ ను ఏపీ పోలీసుల విజయంగా ఎస్పీ అభివర్ణించారు. కాగా, ఏపీలో మావోయిస్టుల అలజడి ఒక్కసారిగా కలకలం రేపింది. అరెస్టు అయిన మొత్తం మావోయిస్టులు చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన వారే.. అక్కడి నుంచి పదుల సంఖ్యలో ఎందుకు వచ్చారు? ఇక్కడ ఏమైనా రెక్కీ నిర్వహించారా? అన్న విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఆటోనగర్ శివార్లలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని అద్దెకు తీసుకున్న మావోయిస్టులు.. ఇక్కడ కూలి పనుల కోసం వచ్చినట్లు వాచ్ మన్ కి చెప్పి అద్దెకు తిగినట్లు చెబుతున్నారు.

అయితే వారు ఎన్నాళ్ల క్రితం ఇక్కడికి వచ్చారు? ముందుగా ఎవరు వచ్చారు? అనేది విచారణలో తెలియాల్సివుంది. అయితే ఆటోనగర్ లో చాలా మంది పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరాది వారు సైతం ఈ ప్రాంతంలో ఎక్కువగానే ఉన్నారు. దీంతో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నావారే మావోయిస్టులా..? ఇంకా ఎవరైనా నగరంలో తలదాల్చుకున్నారా? అనేది ఆందోళన రేకెత్తిస్తోంది. కాగా, పట్టుబడిన వారిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారనే సమాచారంతో మావోయిస్టుల చరిత్ర ముగిసిన అధ్యాయంగా ప్రచారం జరుగుతోంది.

ఈ అరెస్టుతో మొత్తం కేంద్ర కమిటీ నామరూపల్లేకుండా పోయిందని అంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్నవారికి దిశానిర్దేశం చేసిన వారు లేనట్లేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మావోయిస్టు టాప్ లీడర్లలో కొద్ది మంది పొలిట్ బ్యూరో సభ్యులే మిగిలి ఉండొచ్చని, తాజా పరిణామాల తర్వాత వారి ఆచూకీ తెలుసుకోవడం కూడా పోలీసులకు పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News