కూటమితో ఫైటింగ్ కి వైసీపీ రెడీగా ఉందా ?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త ఏడాదిలో జరుగుతాయి. నిజానికి ఈపాటికే మున్సిపాలిటీలు కార్పోరేషన్ల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చి ఉండాలి.;
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త ఏడాదిలో జరుగుతాయి. నిజానికి ఈపాటికే మున్సిపాలిటీలు కార్పోరేషన్ల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చి ఉండాలి. కానీ 2026 మార్చి దాకా వాటి పదవీ కాలం ఉంది ముందే ఎందుకు జరపాలి అన్న పార్టీలో కీలక నేతల ఆలోచనల మేరకు ఆగారు అని అంటున్నారు ఇక మార్చిలో బడ్జెట్ తరువాత స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తారు అని అంటున్నారు. ఈ మేరకు కూటమి అయితే పూర్తి సన్నద్ధంగా ఉంది అని అంటున్నారు.
మంచి తరుణంలో :
లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూటమి ప్రభుత్వం తన ఏర్పాట్లలో తాను ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు అంటే దగ్గర దగ్గర రెండేళ్ళకు కూటమి ప్రభుత్వం చేరువ అవుతుంది. దాంతో ప్రజలలో తమ మీద మంచి అభిప్రాయం ఉంది అని 2024 ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు వారి మద్దతు అభిమానం అదే మాదిరిగా ప్రజల మనసులో ఉందని చాటి చెప్పడానికి స్థానిక ఎన్నికలు కంటే మించిన సాధనం అయితే కూటమికి వేరొకటి లేదు. పైగా మూడు పార్టీలు కలసి ఉన్నాయి. చేతిలో అధికారం ఉంది. ఇంత మంచి వాతావరణాన్ని ఉపయోగించుకోవడమే కూటమి కర్తవ్యం అని అంటున్నారు.
కసరత్తు ముమ్మరం :
ఇక ఏపీలో ఉన్న మొత్తం ఇరవై ఆరు జిల్లాలలో రాజకీయ పరిస్థితులను స్థానికంగా ఉన్న లెక్కలను ఇప్పటి నుంచే కూటమి పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. ప్రజలకు తాము చేసిన మంచిని ఒక వైపు బలంగా ప్రచారం చేసుకుంటూనే సంస్థాగతంగా ఉన్న చిన్న లోపాలను సవరించుకునే పనిలో పడ్డాయి. ఇక అధికారుల బదిలీలు కీలక స్థానలలో కీలక సిబ్బందిని నియమించుకోవడం వంటివి ఇప్పటి నుంచే జరిగిపోతోంది అని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలని కూటమి పెద్దలు పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ తో కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. ఈసారి సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నది కూటమి నినాదంగా ఉందని అంటున్నారు.
వైసీపీ శిబిరంలో :
ఇక ఏకైక విపక్షంగా ఏపీలో ఉన్న వైసీపీ అయితే స్థానిక ఎన్నికల కోసం ఏ మేరకు సన్నద్ధంగా ఉంది అన్నది ఇంకా చూడాల్సి ఉంది అని అంటున్నారు. పార్టీ అధినాయకత్వం అయితే కమిటీలను బూత్ లెవెల్ దాకా వేయాలని ఆదేశించింది. నియోజకర్గం స్థాయి దాకా హైకమాండ్ పార్టీ నియామకాలు ప్పూర్తి చేసింది. మండల వార్డు బూత్ లెవెల్ దాకా కార్యవర్గాలు చేసి పార్టీని జోరెత్తించాలని అధినాయకత్వం పదే పదే చెబుతూ వస్తోంది. డిసెంబర్ నాటికి ఇవన్నీ పూర్తి కావాలని డెడ్ లైన్ పెట్టింది. ఇదంతా స్థానిక ఎన్నికల కోసమే అని అంటున్నారు.
తట్టుకోవాల్సిందే :
చేతిలో అధికారం మూడు పార్టీలు అంతా కలసి మూకుమ్మడిగా లోకల్ ఫైట్ కి దిగితే తట్టుకోగలమా అన్నది వైసీపీ దిగువ స్థాయిలో వినిపిస్తున్న ప్రశ్నగా ఉందిట. అంతే కాదు స్థానిక ఎన్నికలు అంటే డబ్బు ఖర్చు అధికంగా ఉంటుందని అంటున్నారు. ఎంత ఖర్చు చేసినా అధికారం చేతిలో ఉన్న పార్టీల వైపే సహజంగా జనాల మొగ్గు ఉంటుంది. అంతే కాదు ప్రభుత్వంలో ఉన్న వారు ఎపుడూ విజయాన్నే కోరుకుంటారు తప్ప కోరి ఓటమి తెచ్చుకోరు. పైగా జనాలలో తమ పట్ల సానుకూలత పీక్స్ లో ఉందని చాటి చెప్పుకోవడానికి చూస్తారు. అందుకే కూటమి ముందు ఆ దూకుడు ముందు ఎంతవరకూ నిలిచి నిలువరించగలమన్నది వైసీపీ దిగువ స్థాయిలో చర్చగా ఉందిట. అయితే హైకమాండ్ ఏ విధమైన దిశా నిర్దేశం చేస్తుంది అన్నది ఇంకా చూడాల్సి ఉంది అని అంటున్నారు మొత్తం మీద చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో ఒక మినీ సమరానికి 2026 వస్తూనే తెర తీయనుంది.