ఎట్టకేలకు సాధించిన మంత్రి లోకేశ్.. కార్యకర్త కోసం చట్ట సవరణ, చంద్రయ్య కొడుకుకి ఉద్యోగం
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రాజకీయ హింసలో బాధితుడికి ఉద్యోగం ఇస్తూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రాజకీయ హింసలో బాధితుడికి ఉద్యోగం ఇస్తూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఇచ్చింది. గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ చేతుల మీదుగా వీరాంజనేయులు ఈ ఆర్డర్ కాపీని వీరాంజనేయులు గురువారం అందుకున్నారు. రాజకీయ హింసలొ బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం అనేది ఏపీ చరిత్రలోనే ఇది తొలిసారి. ఇందుకోసం ప్రత్యేకంగా కేబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో చట్టం చేసేలా మంత్రి లోకేశ్ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను మండలిలో వైసీపీ తిరస్కరించినా, ప్రభుత్వం తన విశేషాధికారంతో చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు.
టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు ఉద్యోగం ఇవ్వడంపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ చర్యను విపక్షం వైసీపీ తప్పుపడుతుండగా, అధికార పార్టీ శ్రేణులు మాత్రం స్వాగతిస్తున్నాయి. పార్టీని నమ్ముకున్నవారికి తగిన న్యాయం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. చట్టపరంగా ఎన్నో చిక్కులతో కూడుకున్న వ్యవహారంలో ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా పావులు కదిపి అన్ని అవాంతరాలను అధిగమించి వీరాంజనేయులుకు ఉద్యోగం ఇచ్చిందని అంటున్నారు. కేవలం ఉద్యోగంతోనే సరిపెట్టకుండా, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ప్రభుత్వం, పార్టీ పలు విధాలుగా అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
2022లో హత్య
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన తోట చంద్రయ్య (42) తెలుగుదేశం పార్టీలో అత్యంత చురుకైన నాయకుడిగా పనిచేసేవారు. ఈ క్రమంలోనే 2022 జనవరి 13 (భోగి పండుగ ముందు రోజు) తెల్లవారుజామున చంద్రయ్య తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రత్యర్థులు అడ్డుకుని హతమార్చారని పోలీసులు కేసు నమోదు చేశారు. నడిరోడ్డుపై కత్తులు, రాళ్లతో దారుణంగా దాడి చేశారని, చంద్రయ్యను హతమార్చే ముందు తాము చెప్పినట్లు నినాదాలు చేస్తే ప్రాణాలతో వదిలేస్తామని బెదిరించినప్పటికీ, ఆయన లొంగలేదని చెబుతున్నారు. ప్రాణం పోతున్నా సరే... "జై టీడీపీ.. జై చంద్రబాబు" అంటూనే కన్నుమూశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
పార్టీ కోసం, ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్త కుటుంబాన్ని రోడ్డున పడేయకూడదని మంత్రి లోకేశ్ భావించారు. తోట చంద్రయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి తీరాలని లోకేశ్ గట్టిగా సంకల్పించారు. దీని కోసం ఏపీ కేబినెట్ ప్రత్యేకంగా తీర్మానం చేయడమే కాకుండా, 1994 నాటి పబ్లిక్ సర్వీసెస్ నియామకాల చట్టానికి ప్రత్యేక సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించేలా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రాజకీయ హింస కారణంగా జీవనాధారం కోల్పోయిన కుటుంబాలకు సామాజిక న్యాయం చేయడమే ఈ చట్ట సవరణ ముఖ్య ఉద్దేశమని అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రకటించారు.