ఏపీ లిక్కర్ కేసూ.. ఢిల్లీ లిక్కర్ స్కాంలా మారుతుందా?
ఇక తాము అసలు కొత్త డిస్టిలరీలకే అనుమతులు ఇవ్వలేదని.. అవన్నీ టీడీపీ హయాంలో, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినవేనని వైసీసీ అంటోంది.;
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం ఢిల్లీ మద్యం కేసులో ఆ రాష్ట్ర మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, తెలంగాణ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తదితరులపై కేసులు కొట్టివేయడం. 2021-22 మధ్య జరిగినదిగా చెబుతున్న ఈ కుంభకోణంలో కేజ్రీ, సిసోడియా, కవిత సహా చాలామంది జైలుకు వెళ్లారు. తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. దాదాపు ఏడాదిన్నర కిందటే ఈ కేసులోని నిందితులు అందరికీ బెయిల్ వచ్చేసింది. తాజాగా సరైన ఆధారాలు లేవంటూ నిందితులు అందరిపై కేసును కొట్టివేస్తూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. అంతేకాక, దర్యాప్తులో లోపాలు ఉన్నాయంటూ సీబీఐని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ తీర్పుపై దర్యాప్తు సంస్థ.. హైకోర్టుకు వెళ్లినా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
అక్కడ ఇక్కడ అధికారం పోయింది
మద్యం స్కాం పర్యవసానాలతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం విమర్శల పాలైంది. ఖజానాకు రూ.2,200 కోట్ల నష్టం జరిగిందనే ఆరోపణలు రావడంతో పాటు.. మొత్తం కుంభకోణం విలువ రూ.1,100 కోట్లుగా దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ అభియోగాలు మోపాయి. అప్పట్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు సౌత్ గ్రూప్ లోని వారికి రూ.100 కోట్ల ముడుపులు దక్కాయని పేర్కొన్నాయి.
అనంతరం కేజ్రీ సహా కీలక నేతలు జైలు పాలవడంతో ఎన్నికల్లో ఓటమిపాలైంది. ఇప్పుడు ఆప్ నేతలు అందరికీ విముక్తి లభించినా.. తమకు కీలకమైన ఢిల్లీలో అధికారం లేని పరిస్థితి. ఇక ఢిల్లీ మద్యం స్కాం జరిగినట్లుగా చెబుతున్న సమయంలో... ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2024లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయి.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే.. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్)ను కూడా ఏర్పాటు చేసింది.
రూ.3,500 కోట్లు అంటూ..
ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విలువ రూ.3,500 కోట్లు అంటూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీనికి ఉదాహరణగా.. నెలకు రూ.60 కోట్ల చొప్పున వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలం (60 నెలలు) లో రూ.3,5000 కోట్లు అని ఉజ్జాయింపు లెక్కలు వేసింది. అయితే, వైసీపీ పవర్ లోకి వచ్చాక దాదాపు ఆరు నెలలకు కొత్త మద్యం విధానం అమలు చేశారు. అంటే, రూ.3,500 కోట్లలో రూ.360 కోట్లు ఇక్కడే తక్కువ పడుతోంది.
ఇక తాము అసలు కొత్త డిస్టిలరీలకే అనుమతులు ఇవ్వలేదని.. అవన్నీ టీడీపీ హయాంలో, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినవేనని వైసీసీ అంటోంది. పైగా తాము బెల్ట్ షాప్ లను పూర్తిగా ఎత్తివేశామని, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలను నిర్వహించామని, అమ్మకాల వేళలను కుదించామని బలంగా వాదిస్తోంది. తమపై కక్షసాధింపునకే మద్యం విధానంపై కేసులు పెట్టారని, ఇవి అక్రమ కేసులు అని అంటోంది. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వైసీపీ కీలక నేతలను, వారి ప్రభుత్వంలో ముఖ్య అధికారులను అరెస్టులు చేసింది. వీరిలో చాలామందికి బెయిల్ వచ్చింది.
అక్కడిలాగానేనా?
ఢిల్లీ మద్యం కేసులో నిందితులపై అభియోగాలను కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఏపీ మద్యం కేసులో ఏం జరుగుతుంది? అన్నది చూడాల్సి ఉంది. మరోవైపు మూడు రోజుల కిందటే... వైసీపీ హయాంలో బెవరేజస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డితో పాటు ముప్పిడి అవినాష్ రెడ్డిలను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మున్ముందు ఏపీ లిక్కర్ కేసు పేలుతుందా? ముఖ్య నాయకుల అరెస్టు వరకు కూడా వెళ్తుందా? లేక ఢిల్లీ కేసు తరహాలో మారుతుందా? అన్నది చూడాలి.