వంటల వడ్డింపుల్లో ముఖేష్ అంబానీ బిజీ... వీడియో వైరల్!
అవును... అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమం జాం నగర్ లోని రిలయన్స్ టౌన్స్ షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో మొదలైన సంగతి తెలిసిందే.
భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు మొదలైపోయాయి. మార్చిలో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమం పూర్తయిన అనంతరం జూన్ లో వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం జాం నగర్ లో జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. ఇందులో భాగంగా... ముకేష్ అంబానీ ఆహార పదార్ధాలు వడ్డిస్తూ కనిపించారు.
అవును... అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమం జాం నగర్ లోని రిలయన్స్ టౌన్స్ షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో మొదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ వేడుకకు హాజరైన జోగ్వాడ్ గ్రామ ప్రజలకు కుటుంబ సభ్యులతో కలిసి ముకేష్ అంబానీ స్వయంగా సంప్రదాయ గుజరాతీ ఆహార పదార్ధాలను వడ్డించారు. సుమారు 51 వేల మంది స్థానికులకు భోజనాలు వడ్డించనున్న ఈ కార్యక్రమంలో రాధిక అమ్మమ్మ, తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.
ఈ అన్నదాన సేవ కార్యక్రమం రాబోయే కొన్ని రోజులపాటు కొనసాగుతుంది. స్థానికుల ఆశీర్వాదం పొందడానికి అంబానీ కుటుంబం ఈ అన్న సేవను నిర్వహించింది! ఈ క్రమంలో... ఈ భోజనాల అనంతరం హాజరైన గ్రామస్థులు.. సాంప్రదాయ జానపద సంగీతంతో మైమరచిపోయారు. ఈ కార్యక్రమంలో... ప్రఖ్యాత గుజరాతీ గాయకుడు కీర్తిదాన్ గాధ్వీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారూ!
వాస్తవానికి ఈ అన్నసేవ సాంప్రదాయం అంబానీ ఫ్యామిలీలో ఎప్పటినుంచో ఉంది. ప్రధానంగా కుటుంబంలోని శుభకార్యాల సమయంలో అంబానీ కుటుంబం ఈ అన్నసేవను అందిస్తుంటుంది. ఇందులో భాగంగానే కరోనా సమయంలో నీతా అంబానీ నాయకత్వంలో, రిలయన్స్ ఫౌండేషన్ అతిపెద్ద ఆహార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ క్రమంలో కుటుంబ సంప్రదాయాన్ని పాటిస్తూ అనంత్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో ముందుగా గ్రామస్థులకు భోజన కార్యక్రమం నిర్వహించారు.
కాగా... మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ప్రపంచ కుభేరులు, అతిరధ మహారధులతో పాటు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు దేశవిదేశాల నుంచి హాజరుకానున్నారు. ఈ సమయలో అతిథుల కోసం ముఖేష్ అంబానీ దంపతులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2500 రకలా వంటకాలనూ ఏర్పాటు చేస్తున్నారు.