జగన్ మావిగాన్ కి పోటీగా తిరుపతి డిమాండ్

ఏపీకి కొత్త రాజధానిగా తిరుపతిని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిని అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్రా ప్రజలు ఎవరూ స్వాగతించడం లేదని ఆయన అన్నారు.;

Update: 2026-04-15 03:49 GMT

అమరావతి రాజధాని ఆంధ్రులకే కాదు ప్రపంచానికే రాజధాని అని కూటమి అంటోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఇది కలల రాజధాని అని దేవతల రాజధాని అని కూడా చెప్పారు. అమరావతి అద్భుతమైన రాజధానిగా తయారవుతుందని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఈ మధ్యనే అసెంబ్లీలో అమరావతి రాజధాని చట్టబద్ధత మీద తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది ఆ మీదట కేంద్రం కూడా దానిని విభజన చట్టంలో సవరణ చేయడం రాష్త్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిపోయాయి. అమరావతి విషయంలో ఎంతో ధీమాగా నమ్మకంగా కూటమి ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ కూడా దానికి పార్లమెంట్ లో మద్దతు ఇస్తే అదే పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మాత్రం అమరావతి రాజధానిగా వద్దు అని కొత్త నినాదం వినిపిస్తున్నారు.

ఏపీకి అప్పులే తప్ప :

ఏపీకి కొత్త రాజధానిగా తిరుపతిని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిని అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్రా ప్రజలు ఎవరూ స్వాగతించడం లేదని ఆయన అన్నారు. అంతే కాదు అమరావతి కాదు చంద్రావతి అని అంతా అంటున్నారు అని సెటైర్లు వేశారు. అమరావతిని లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం అసాధ్యం అన్నారు. పైగా ఎన్నో అప్పులు చేసి రాజధానిని అక్కడ పెట్టాలనుకోవడం ద్వారా రాష్ట్రానికి అప్పులూ నష్టాలే తప్ప లాభం ఉండదని స్పష్టం చేసారు.

అన్ని భూములు ఎందుకు :

అమరావతికి అన్ని లక్షల ఎకరాలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు ఒక రాజధాని నిర్మాణానికి వేయి ఎకరాలు చాలు అని అన్నారు రాజధాని అంటే ప్రభుత్వ భవనాలు నిర్మాణం తప్ప ఏమీ అవసరం లేదని అన్నారు. పైగా ఇపుడున్న డిజిటల్ యుగంలో పాలన ఎంతో స్పీడ్ గా ఎక్కడ నుంచి ఎక్కడైనా సాగిపోతోందని అలనటి చోట భారీ స్థాయిలో అమరావతి పేరుతో రాజధాని ఎందుకు అని ఆయన అంటున్నారు

తిరుపతి రాజధానిగా :

ఇపుడున్న పరిస్థ్తితుల్లో అమరావతి రాజధాని నిర్మాణం తగదని అన్నారు. అందుకే అన్ని ప్రాంతాలు మెచ్చే నచ్చే తిరుపతిని రాజధానిగా ప్రకటించాలని చింతా మోహన్ కోరారు. తిరుపతి రాజధాని అయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని అన్నారు. కేంద్ర మాజీ మంత్రిగా చింతా మోహన్ అమరావతి రాజధానిని చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. తాను ఎన్నో సార్లు అమరావతి వెళ్ళాను అని దేవతలు ఎవరూ తనకు అక్కడ కనిపించలేదని ఆయన గతంలో మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు.

కొత్త చర్చకు తెర లేపారు :

ఇపుడు అమరావతి అంటే ఇతర ప్రాంతాలకు ఇష్టం లేదని అంటున్నారు. తిరుపతి రాజధాని అంటున్నారు. ఇలా కొత్త చర్చకు ఆయన తెర లేపారు. మరి దీని మీద ప్రభుత్వం అయితే స్పందించేది ఉంటుందా అన్నది చూడాలి. అయితే ఇపుడు రాజధానుల ఎంపిక కోసం డిబేట్ కాదని అంటున్నారు. ఆ ఎపిసోడ్ ముగిసిందని కూడా అంతా గుర్తు చేస్తున్నారు. జగన్ మావిగాన్ అన్నా చింతా మోహన్ తిరుపతి అన్నా ఎవరి ఆలోచనలు వారు చెప్పడమే తప్ప ఉపయోగం ఏదీ ఉండదని అంటున్నారు. ఎందుకంటే చట్టబద్ధతతో కూడిన రాజధానిగా అమరావతి ఉంది. దానిని మార్పు చేయడం అంటే కష్టం అన్నది తెలిసిందే.

Tags:    

Similar News