యాక్షన్ లోకి జనసేన జాయినింగ్స్ కమిటీ.. మాజీ ఎమ్మెల్యే ఆమంచితో చర్చలు?
ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, ఆయనకు క్షేత్రస్థాయిలో గట్టి పట్టు ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
జనసేన జాయినింగ్స్ కమిటీ యాక్షన్ లోకి దిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం ఢిల్లీలో పార్టీ సమావేశం నిర్వహించిన సందర్భంగా జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీ నియమించారు. ఇందులో పార్టీకి చెందిన 14 మంది కీలక నాయకులు ఉన్నారు. జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరిచే ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలతో చర్చించే బాధ్యత ఈ 14 మందికి అప్పగించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక కమిటీ ఏర్పాటు చేసిన వారం రోజుల్లోనే బాపట్ల జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరనున్నారని ప్రచారం మొదలైంది. దీంతో జాయినింగ్స్ కమిటీ యాక్షన్ లోకి దిగిందా? అంటూ చర్చ జరుగుతోంది.
బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం తటస్థంగా వ్యవహరిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఆయన వైసీపీలో ఉండేవారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ నిరాకరించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరి సుమారు 40 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఆ విధంగా నియోజకవర్గంలో తన పట్టు నిరూపించుకున్నారని చెబుతున్నారు. ఇక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆమంచి తాజాగా రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరనున్నారని జరుగుతున్న ప్రచారం ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.
ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, ఆయనకు క్షేత్రస్థాయిలో గట్టి పట్టు ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినప్పటి నుండి, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి తన సత్తా చాటుకోవడం వరకు ఆమంచి గ్రాఫ్ ఎప్పుడూ ఒక రేంజ్ లో ఉండేదని అంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి 40 వేలకు పైగా ఓట్లు సాధించడం, ఆయన వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేసిందని అంటున్నారు. ఇలాంటి బలమైన నేత జనసేనలో చేరడం, అటు పార్టీకి, ఇటు ఆమంచికి కొత్త ఊపును ఇస్తుందనేది రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ చేరిక నిజమైతే, ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, గిద్దలూరులో ఆమంచి స్వాములు వంటి బలమైన నేతలు జనసేనలో ఉండగా, చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ తోడైతే బాపట్ల–ప్రకాశం జిల్లాల్లో జనసేన ఒక తిరుగులేని శక్తిగా అవతరించే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక ఈ ప్రచారంతో జనసేన చేరికల కమిటీ తన లక్ష్యాల మేరకు, క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను పార్టీలోకి ఆహ్వానించే వ్యూహంపై ఫోకస్ చేసిందనే ప్రచారం ఉత్కంఠ రేపుతోంది. రాబోయే రోజుల్లో ఆమంచి అధికారికంగా పార్టీ కండువా కప్పుకుంటే, జిల్లా రాజకీయాల్లో అది సంచలన నిర్ణయం కానుందని అంటున్నారు.