అంబానీ ఇంట పెళ్లికి రిటర్న్ గిప్టుల కోసం కరీంనగర్ కు ప్రత్యేక ఆర్డర్!

దేశంలోనే అరుదైన కళల్లో ఒకటిగా చెప్పే కరీంనగర్ ఫిలిగ్రీగా చెబుతుంటారు.

Update: 2024-05-23 04:54 GMT

దేశీయంగా కుబేరుడు.. ఆ మాటకు వస్తే ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా పేరున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి జరుగుతున్న సంగతి తెలిసిందే. గడిచిన కొన్ని నెలలుగా ముకేశ్ - నీతూ దంపతుల చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి సంబందించిన ప్రత్యేక కార్యక్రమాలు ఒకటి చొప్పున ఒకటి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అసలుసిసలైన పెళ్లి ఘట్టానికి తెర లేచింది. ఈ పెళ్లి సందర్భంగా కరీంనగర్ కు చెందిన ఫిలిగ్రీ ఉత్పత్తులను భారీగా ఆర్డర్ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దేశంలోనే అరుదైన కళల్లో ఒకటిగా చెప్పే కరీంనగర్ ఫిలిగ్రీగా చెబుతుంటారు. వెండి తీగతో కరీంనగర్ కళాకారులు ఆవిష్కరించే అద్భుత ఉత్పత్తులకు దేశంలోనే కాదు విదేశాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. తాజాగా అంబానీ దంపతులు తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేళ.. వీటిని ఆర్డర్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. మొత్తం 400 రకాల వస్తువులకు ఆర్డర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

తమ కుమారుడి పెళ్లికి వచ్చే అతిధులకు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని చేనేత హస్త కళారూపాల్ని రిటర్న్ గిప్టులుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తులు 400 అందించాలని కోరినట్లుగా కరీంనగర్ ఫిలిగ్రీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎర్రోజు అశోక్ పేర్కొన్నారు. జులైలో జరిగే ఈ పెళ్లికి జ్యూయలరీ బాక్సులు.. పర్సులు.. ట్రేలు.. ఫ్రూట్ బౌల్స్ తదితర వస్తువులను ఆర్డర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో..మరోసారి కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తుల మీద దేశ వ్యాప్తంగా చర్చకు తెర తీసిందని చెప్పాలి.

Tags:    

Similar News