ఉత్తరాంధ్రలో జనసేనకు జెడ్పీ పీఠ ముడి !
| ఉత్తరాంధ్రలో జనసేనకు రెండు జెడ్పీ చైర్మన్ పదవులు కేటాయిస్తారన్న ప్రచారం నేపథ్యంలో పొత్తుల సర్దుబాటుపై ఉత్కంఠ నెలకొంది. అల్లూరి జిల్లా పీఠాన్ని వైసీపీ గెలుచుకోవడంతో జనసేనకు ఒక అవకాశం తగ్గింది. శ్రీకాకుళం, అనకాపల్లి స్థానాలను జనసేన ఆశిస్తుండగా, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో టీడీపీ నేతలు తమకే పదవులు కావాలని పట్టుబడుతున్నట్లు కథనం పేర్కొంది. విశాఖలో సర్దుబాటుకు అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
ఉత్తరాంధ్రాలో ఆరు జెడ్పీ పీఠాలు ఉన్నాయి. అంటే ఆరు కొత్త జిల్లాల నుంచి అన్న మాట. ఇందులో ముందుగా అనుకున్నట్లుగా రెండు పీఠాలు జనసేనకు ఇస్తారు అన్న ప్రచారం అయితే సాగుతూ వచ్చింది. అందులో ఒకటి అల్లూరి జిల్లా జెడ్పీ చైర్మన్ పోస్టు. మొదటి నుంచి కూడా జనసేన ఈ జిల్లా మీద ఫోకస్ పెడుతూ వచ్చింది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ జిల్లాలో తరచూ పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ గిరిజనుల మనసు చూరగొనే ప్రయత్నం చేశారు. దాంతో అల్లూరి జిల్లా పరిషత్తు చైర్మన్ పదవిని తామే గెలుచుకుంటామనుకుంది. పొత్తు ధర్మంలో దానిని విడిచి పెట్టేందుకు టీడీపీ కూడా అంగీకరించింది అన్న ప్రచారం సాగింది. తీరా చూస్తే అల్లూరి జిల్లాలో జెడ్పీ పీఠం చేజారింది. వైసీపీ ఇక్కడ విజయం సాధించింది.
అయిదింట చోటెక్కడ :
ఇక చూస్తే పొత్తుల ప్రకారం ఉత్తరాంధ్రలో జనసేనకు ఆరింట రెండు జెడ్పీ పీఠాలు ఇస్తారు అని ప్రచారం సాగింది. తీరా చూస్తే ఇపుడు అయిదింటిలో రెండు సర్దుబాటు చేయాల్సి ఉంది అని అంటున్నారు. దాంతో జనసేనకు శ్రీకాకుళం జిల్లాలో ఒకటి ఇస్తారని అంటున్నారు. రెండవది ఎక్కడ అన్నదే ఇపుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. అన్ని చోట్లా చూస్తే టీడీపీనే అత్యధిక సీట్లు సాధించి ఉంది. శ్రీకాకుళంలో కూడా టీడీపీ 22 జెడ్పీటీసీలు గెలుచుకుంది. అక్కడ తమకే జెడ్పీ చైర్మన్ పదవి ఉండాలని తమ్ముళ్ళు పట్టుబడుతున్నారు. ఇప్పటికే మేయర్ పదవిని జనసేనకు ఇచ్చారని రెండవ జిల్లా పదవి కూడా ఇచ్చేస్తే ఇక టీడీపీకి మిగిలేది ఏముందని వారు మొదటి నుంచి అంటున్నారు. మరి శ్రీకాకుళం కాకపోతే ఎక్కడా అన్నది కూడా చర్చగా ఉంది.
విజయనగరంలో కుదరదు :
విజయనగరం జిల్లా విషయం తీసుకుంటే అక్కడ చిన్న శ్రీను కుమార్తెకు జెడ్పీ పీఠం ఖరారు చేశారు అని అంటున్నారు. ఒక వేళ అలా కాకపోయినా సీనియర్ నేతల వారసులు గెలిచి మరీ ముందు వరసలోకి వచ్చారు. దాంతో ఈ జిల్లాలో వైసీపీ దూకుడుకు చెక్ పెట్టిన టీడీపీ తమకే ఈ చైర్మన్ గిరీని ఉంచుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా జెడ్పీ పీఠం కూటమికే వచ్చింది. కానీ ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ సోదరుడు కుమారుడు ప్రదీప్ చంద్రకు చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో ఆయన జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. పైగా వైసీపీకి బలమైన ఈ ప్రాంతాన్ని టీడీపీకి అనుకూలంగా చేస్తూ వచ్చారు. 2024 లో టికెట్ కూడా ఆయనకు దక్కలేదు. ఇపుడు ఆయనకే ఈ పదవి ఇస్తారని అంటున్నారు.
ఆ రెండు జిల్లాలలోనే :
ఇక చూస్తే విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా మిగిలాయి. ఇందులో అనకాపల్లి జిల్లాతో పాటు శ్రీకాకుళం జనసేన కోరుకుంటోంది. అయితే అనకాపల్లిలో ఉన్న టీడీపీ తమ్ముళ్లు అంతా తమకే ఈ పదవి కావాలని పట్టుబడుతున్నారు. విశాఖ జిల్లా పరిషత్ నాలుగు మండలాలతో అతి చిన్న జిల్లా. ఇందులో మూడు టీడీపీ జెడ్పీటీసీలు గెలుచుకుంది. ఒకటి జనసేన గెలిచింది. ఇక్కడ కుదిరితే కుదరవచ్చు. కానీ విశాఖ జిల్లా కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో తమకే తొలి ప్రాధాన్యత అని తమ్ముళ్ళు అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఉత్తరాంధ్రాలో జనసేనకు రెండు జెడ్పీ పీఠాలు ఎలా సర్దుబాటు చేస్తారు అన్నది మాత్రం అతి పెద్ద చర్చగా ఉంది అని అంటున్నారు.