ఎయిరిండియా విమాన ప్రమాదం.. దర్యాప్తులో కీలక అప్ డేట్!
అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై జరుగుతోన్న దర్యాప్తులో తాజాగా పురోగతి కనిపించింది.;
జూన్ 12 న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ విమానం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో అంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గత గురువారం జరిగిన ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ క్రమంలో దర్యాప్తులో కీలక పురోగతి చోటు చేసుకుంది.
అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై జరుగుతోన్న దర్యాప్తులో తాజాగా పురోగతి కనిపించింది. దీనికి సంబంధించిన కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. దర్యాప్తు అధికారులు కాక్ పిట్ వాయిస్ రికార్డర్ బ్లాక్ బాక్స్ దొరికిందని నిర్ధారించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా.. విమానంలో ఉన్న 241 మందితో సహా 270 మందికి పైగా మృతి చెందిన ఈ ఘోరమైన ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తించడంలో ఈ కాక్ పిట్ వాయిస్ రికార్డర్ బ్లాక్ బాక్స్ కీలకంగా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. అంతకముందు ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్.డి.ఆర్) మాత్రమే కనుగొనబడిందని నిర్ధారించారు.
ఇలా దర్యాప్తులో కీలక భూమిక పోషించనున్నట్లు చెబుతున్న బ్లాక్ బాక్స్ లు స్వాధీనం చేసుకున్న విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రాకు అధికారులు తెలియపరిచారు. ఈ క్రమంలో ఆయన అహ్మదాబాద్ లోని ఎయిరిండియా విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించి.. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నవారిని పరామర్శించారు.
కాగా... అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం మేఘనినగర్ ప్రాంతంలోని మెడికల్ కాలేజీ క్యాంపస్ లో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. దీంతో.. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఒక్క ప్రయాణికుడు మాత్రం సజీవంగా బయటపడ్డారు.
ఈ విమానం ప్రమాదానికి గల కారణాలను ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోంది. ఈ సమయంలో వారికి కాక్ పిట్ వాయిస్ రికార్డర్ దొరకడంతో.. ఇందులో పైలట్ల సంభాషణలు, రేడియో కమ్యునికేషన్స్, అలారమ్ సౌండ్స్ ఉంటాయని యూఎస్ నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డు వెల్లడించింది.