విమాన ప్రమాద దర్యాప్తులో దీనిదే కీలక పాత్ర.. ఏమిటీ ‘గోల్డెన్‌ చాసిస్‌’?

ఈ విమాన ప్రమాద దర్యాప్తులో అమెరికా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఓ పరికరం కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. దాని పేరు గోల్డెన్‌ చాసిస్‌!;

Update: 2025-07-13 18:30 GMT

దేశం మొత్తాన్ని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ప్రమాద ఘటన దర్యాప్తులో తాజాగా కీలక అప్ డేట్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఎయిరిండియా ఏఐ 171 బోయింగ్ విమాన ప్రమాదంపై దర్యాప్తు జరుపుతోన్న ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ విమాన ప్రమాద దర్యాప్తులో అమెరికా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఓ పరికరం కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. దాని పేరు గోల్డెన్‌ చాసిస్‌! డేటా సేకరణలో ఇది అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్ బాక్స్ లోని డేటాను డౌన్ లోడ్ చేయడంలో ఈ అమెరికా స్పెషల్ పరికరమే కీలక భూమిక పోషించిందని చెబుతున్నారు.

అవును... ప్రమాదానికి గురైన బోయింగ్‌ 787-8 డ్రీమ్‌ లైనర్‌ కు సంబంధించిన బ్లాక్‌ బాక్స్‌ ను అధికారులు వేగంగానే కనుగొన్నప్పటికీ.. దాని నుంచి డేటాను డౌన్‌ లోడ్‌ చేయడం కత్తిమీద సాముగా మారిందనే కథనాలు తెరపైకి వచ్చాయి. ఇదే సమయంలో... ఈ బ్లాక్ బాక్స్ ను విదేశాలకు తరలిస్తున్నారని.. అక్కడ అందులోని డేటాను డౌన్ లోడ్ చేస్తారని కథనాలొచ్చాయి.

అందుకు కారణం... ప్రమాద సమయంలో వెలువడిన తీవ్రమైన వేడి కారణంగా అది దెబ్బతిని ఉందని.. దీంతో ఏఏఐబీ సంప్రదాయ ల్యాబ్‌ లో దీని నుంచి డేటా డౌన్‌ లోడ్‌ సాధ్యం కాలేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే యునైటెడ్‌ స్టేట్స్‌ నేషనల్‌ ట్రాన్స్‌ పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు వినియోగించే ఈ 'గోల్డెన్‌ చాసిస్‌' అనే ప్రత్యేక పరికరాన్ని భారత్ కు రప్పించారు.

ఇది తీవ్రగా దెబ్బతిన్న ఫ్లైట్‌ రికార్డర్స్‌ నుంచి డేటాను డౌన్ లోడ్ చేసే సమయంలో.. వాటి క్రాష్‌ ప్రొటెక్షన్‌ మాడ్యూల్‌ ను తొలగించి, ఈ గోల్డెన్‌ చాసిస్‌ పై దానిని అమరుస్తారు. దీంతో ఫ్లైట్‌, కాక్‌ పీట్‌ వాయిస్‌ డేటాను డౌన్‌ లోడ్‌ చేసుకోవడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. తాజా దర్యాప్తులో కూడా గోల్డెన్‌ చాసిస్‌, కేబుల్స్‌ ను అమెరికా నుంచి ప్రత్యేకంగా తెప్పించి వాడారు.

కాగా... తాజాగా ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో... రెండు ఇంజిన్లకు సెకను వ్యవధిలో ఇంధన సరఫరా నిలిచిపోవడంవల్లే అహ్మదాబాద్‌ లో ఎయిరిండియాకు చెందిన ఏఐ171 విమానం కూలిపోయిందని తేల్చిన సంగతి తెలిసిందే. ఈ క్ర్మంలో.. ఇంధన సరఫరాను ఎందుకు ఆపావని ఒక పైలట్‌ ప్రశ్నించగా.. తాను ఆపలేదని మరో పైలట్‌ సమాధానమివ్వడం కాక్‌ పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్) లో నమోదైందని తెలిపింది.

Tags:    

Similar News