90 మంది ఓకే.. మరో 37 మంది ఎమ్మెల్యేలే.. చంద్రబాబు లెక్క ఇదీ.. !
మొత్తం 134 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో ఇంకా 37 మంది వెనుకబడి ఉన్నారన్నది చంద్రబాబు చెబుతున్న మాట.;
టిడిపి ఎమ్మెల్యేల విషయంలో సీఎం చంద్రబాబు మరోసారి సమీక్షించారు. ప్రజలతో కనెక్టు అయ్యే నాయకులు.. ఇంకా సొంత వ్యవహారాలు చూసుకునే నేతలపైన ఆయన సుదీర్ఘంగా పార్టీ నాయకులతో చర్చించారు. ఇప్పటివరకు చాలా మార్పు కనిపించిందని చంద్రబాబు అభిప్రాయ పడినట్టు తెలిసింది. అయితే ఇప్పటికి మరో 37 మంది ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. నిజానికి గడిచిన ఆరు మాసాల నుంచి పార్టీ అధినేతగా చంద్రబాబు ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి రావడం సమీక్షించటం నేతలతో ముఖాముఖి నిర్వహించటం అదేవిధంగా వన్ టు వన్ చర్చల ద్వారా సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారం మార్గాలను కూడా చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చాలావరకు నియోజకవర్గాల్లో పరిస్థితి సరిదిద్దే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ ఇంకా 37 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదన్నది తాజాగా చంద్రబాబుకు అందిన సమాచారం. దీనిపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఈ విషయంపై ఆరా తీయడంతో పాటు వారి వివరాలను మరింత లోతుగా తెలుసుకోవాలని కూడా ఆదేశించారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విషయంలో ఎటువంటి రాజీ పడాల్సిన అవసరం లేదని ప్రతి నాయకుడు ప్రజల మధ్య ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు.
మొత్తం 134 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో ఇంకా 37 మంది వెనుకబడి ఉన్నారన్నది చంద్రబాబు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో వారందరికీ రాబోయే రోజుల్లో గట్టిగా చెప్పడంతో పాటు వచ్చే ఎన్నికల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంటాం అన్న దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. మరోవైపు జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయకపోవడం పై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఈ ప్రక్రియ ముందుకు సాగకు పోవడంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.
తను ఎంతో బాధ్యతగా పార్టీని నిర్వహిస్తున్నానని, కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది వ్యక్తులు చేస్తున్న వ్యవహారంతో పార్టీ ఇబ్బంది పడుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా కమిటీలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా పార్టీని నడిపించాలని కూడా చంద్రబాబు తేల్చి చెప్పారు. మొత్తంగా 37 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ మిగిలిన 90 మందికి పైగా ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేయటం విశేషం.