డూప్‌కి రూ.2.5 కోట్ల రెమ్యూనరేషన్.. హీరో ఏం చేస్తాడు?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు డూప్‌లు, బాడీ డబుల్, స్టార్ హీరోయిన్స్‌కి డూప్‌లు బాడీ డబుల్ అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో వస్తుంది.
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు డూప్‌లు, బాడీ డబుల్, స్టార్ హీరోయిన్స్‌కి డూప్‌లు బాడీ డబుల్ అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో వస్తుంది. ప్రతి హీరోకు ఒకప్పుడు ఇద్దరు ముగ్గురు డూప్‌లు ఉండేవారు. అప్పట్లో హీరోలు ఒకేసారి నాలుగు అయిదు సినిమాలు చేస్తూ ఉండేవారు. దాంతో కొన్ని సార్లు హీరో లేకుండా డూప్స్ తో రెండు మూడు రోజుల షూట్ చేసేవారు అని టాక్. హీరో బ్యాక్ నుంచి కనిపించే సీన్స్, యాక్షన్ సీన్స్‌లో పై నుంచి దూకే సీన్స్, ఇంకా చాలా కష్టమైన సీన్స్‌కు డూప్‌లను వినియోగించే వారు. దాదాపు అందరు హీరోల సినిమాల్లోనూ డూప్స్ అనేవారు ఉంటారు. అయితే సినిమా మొత్తం డూప్స్ తో తీయడం మాత్రం సాధ్యం కాదు. సినిమాలో హీరో 90 నుంచి 95 శాతం కనిపిస్తే డూప్ కేవలం అయిదు నుంచి పది శాతం మాత్రమే కనిపిస్తాడు. కానీ ఇటీవల ఒక స్టార్ హీరో సినిమా గురించి, ఆయన డూప్ గురించి పుకార్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సినిమాలో హీరో గారి కంటే డూప్ ఎక్కువ సమయం స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుంది అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
పాన్ ఇండియా స్టార్ హీరో...
పాన్ ఇండియా స్టార్ హీరో ఒక సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆ సినిమా ఏవో కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుందట. దాంతో పాటు హీరో ఆరోగ్య పరిస్థితులు అనుకూలించక పోవడంతో షూటింగ్ వాయిదా వేస్తూ వస్తున్నారట. ఇటీవలే షూటింగ్ పునః ప్రారంభం అయింది. తీరా సినిమా సెట్‌కి వెళ్లి చూస్తే అక్కడ హీరో గారు లేరట, అక్కడ హీరో గారి డూప్ ఉన్నాడట. ఆ డూప్ తో సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. డూప్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందని అంటున్నారు. ఆ హీరో గారు ఏవో కారణాల వల్ల రాలేకపోవడం, మరో వైపు విడుదల తేదీ ప్రకటించాల్సి రావడంతో దర్శకుడు చేసేది లేక అవసరం లేని షాట్స్ ను సైతం డూప్‌తోనే చేస్తున్నాడని చెబుతున్నారు. సాధారణంగా ఒక హీరో డూప్ షూటింగ్‌కు వస్తే రోజుకు అయిదు వేల నుంచి పది వేలు, లేదా పాతిక వేల రూపాయల వరకు ఉంటుంది. కానీ ఈ పాన్ ఇండియా హీరో డూప్ కి ఏకంగా రూ.2.5 కోట్ల పారితోషికం అనే టాక్ వినిపిస్తుంది.
భారీ పారితోషికంతో సినిమా మొత్తం...
ఆ హీరో డూప్ ను రోజుల వారిగా తీసుకోకుండా మొత్తం షూట్ పూర్తి అయ్యే వరకు అందుబాటులో ఉండాలని, అందుకు గాను ఏకంగా రెండున్నర కోట్ల పారితోషికంను ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తం పారితోషికంను హీరో తన పారితోషికం నుంచి ఇచ్చేందుకు కూడా ఒప్పుకున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. డూప్ కి అంత పారితోషికం అంటే ఆయన సినిమా కోసం ఎన్ని వర్కింగ్ డేస్ ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా అత్యంత కీలకమైన సీన్స్ లోనూ ఆ డూప్ ను పెట్టి లాగిస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెరిగిన టెక్నాలజీతో మొత్తం డూప్‌తో చేసి, చివరకు ఏఐ ని ఉపయోగించి హీరో గారి ఫేస్ పెట్టినా ఆశ్చర్యం లేదని కొందరు జోకులు వేసుకుంటున్నారు. హీరో గారి డూప్ అంత కష్టపడుతుంటే మరి ఆ హీరో గారు ఏం చేస్తున్నారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో స్టార్ హీరో ఫోటోలు..
మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయం ఏ హీరో గురించి, ఏ సినిమా గురించి అనే విషయం పక్కన పెడితే రాబోయే రోజుల్లో హీరోల డూప్‌లతో సినిమాలను పూర్తిగా చేస్తారా ఏంటి అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొందరు హీరోలు కష్టపడి రక్తాలు చిందిస్తూ, వర్కౌట్స్ చేస్తూ కండలు పెంచుతూ ఉంటే, కొందరు మాత్రం పెద్దగా కష్టపడకుండా సింపుల్‌గా తమ డూప్స్ ను ఉపయోగించుకుని సినిమాలు చేసేస్తున్నారు. వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు ఇలా తమ డూప్‌లతో సినిమాలను కానిచ్చేయండి అంటూ దర్శక నిర్మాతలకు చెప్పేస్తున్నారట. దర్శక నిర్మాతలు చేసేది లేక డూప్‌తో కానిచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ వార్తను కొందరు కొట్టి పారేస్తున్నారు. డూప్ పారితోషికం రూ.2.5 కోట్ల వార్తలో ఎంత నిజం ఉందనే విషయం తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.