న‌చ్చ‌లేదని చెప్పిన వారికి థాంక్స్.. `టాక్సిక్` ఫ‌లితంపై యశ్

తన ప్రసంగంలో యశ్ మాట్లాడుతూ... ప్రేక్షకులు తన చిత్రంపై ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నా.. థియేటర్లకు వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

Update: 2026-10-20 04:55 GMT

మెగాస్టార్ చిరంజీవి ఎల్ల‌పుడూ ఒక విష‌యం చెబుతారు. ఏదైనా ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు గెలుపోట‌ములు అనేవి స‌హ‌జం. అయితే చేసే ప‌నిపై వంద‌శాతం ప్రాణం పెట్టి ప‌ని చేయ‌డ‌మే ముఖ్యం. ఫ‌లితం ఎలా వ‌స్తుంది? అనేది వ‌దిలేయ‌మ‌ని చాలా సంద‌ర్భాల‌లో త‌న అభిమానుల‌కు చిరు చెప్పారు. వ‌చ్చిన ఫ‌లితాన్ని స్వీక‌రించ‌డ‌మే మ‌హా ప్ర‌సాదంగా భావించాలి.

ఇప్పుడు ఇంచుమించు ఇదే విష‌యాన్ని కేజీఎఫ్ స్టార్ య‌ష్ కూడా అనుస‌రిస్తున్నారు. హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన `రామాయణం` తెలుగు ప్రీరిలీజ్ వేడుకలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన ఇటీవలి చిత్రం `టాక్సిక్` బాక్సాఫీస్ ఫలితంపై పరోక్షంగా స్పందించారు. కేజీఎఫ్ సంచ‌ల‌న విజ‌యం త‌ర్వాత వ‌చ్చిన టాక్సిక్ పై నిజంగానే బోలెడన్ని అంచ‌నాలున్నాయి. కానీ ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. టాక్సిక్ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి. ఈ ఫ‌లితం చూసాక య‌ష్ పై చాలా విమ‌ర్శ‌లొచ్చాయి. ఈ నేపథ్యంలో మొదటిసారిగా ఒక బహిరంగ వేదికపై టాక్సిక్ ఫ‌లితం గురించి మాట్లాడిన యశ్.. ఈ సినిమాను ఆదరించిన వారితో పాటు నచ్చలేదని చెప్పిన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

తన ప్రసంగంలో యశ్ మాట్లాడుతూ... ప్రేక్షకులు తన చిత్రంపై ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నా.. థియేటర్లకు వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సినిమా నిర్మాణం అనేది ఒక రోజుతో ముగిసేది కాదని.. అదొక సుదీర్ఘమైన ప్రయాణమని అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు తమపై ఉంచిన నమ్మకానికి ప్రాణం పెట్టి పనిచేస్తూ.. ఒక నికార్స‌యిన ప్రయత్నంతో వారిని అలరించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. టాక్సిక్ పై అడ‌పాద‌డ‌పా య‌ష్ మాట్లాడుతున్నా.. ఫ‌లితాన్ని అంగీక‌రిస్తూ మాట్లాడ‌టం ఇదే మొద‌టిసారి. ప్ర‌స్తుతం అత‌డి మాట‌లు వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి

అంతేకాదు తాను ఏం ఆలోచించినా సుదీర్ఘ కాల ప్ర‌యాణం స‌జావుగా సాగ‌డంపైనే దృష్టి సారిస్తున్నాన‌ని య‌ష్ వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. గెలుపోట‌ములు, జ‌యాప‌జ‌యాలు స‌హ‌జం. వాటి గురించి ఎక్కువ‌గా క‌ల‌త చెంద‌న‌ని స్ప‌ష్ఠంగానే చెప్పాడు య‌ష్‌. చేయాల్సిన శ్ర‌మ‌ను చేసాక ఫ‌లితం రాక‌పోయినా దానికి నిరాశ‌ప‌డ‌కుండా త‌న త‌దుప‌రి సినిమాల‌పై దృష్టి సారించ‌డం య‌ష్ విధానం. ఇది క‌చ్ఛితంగా మెగాస్టార్ సూచ‌న‌ను అనుస‌రించ‌డ‌మే. విజ‌య‌వంతం అయిన చాలా మంది చేస్తున్న‌ది ఇదే. ఓట‌మికి కుంగిపోవ‌డం.. గెలిచిన‌ప్పుడు పొంగిపోవ‌డం .. ఇవి రెండూ స‌రికాద‌ని పెద్ద‌లు సూచిస్తుంటారు.

టాక్సిక్ ఫ‌లితంతో సంబంధం లేకుండా యశ్ ఇటీవ‌ల‌ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ `రామాయణం` వైపు దృష్టి సారించారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రాక్ష‌స చ‌క్ర‌వ‌ర్తి రావణుడి పాత్రలో నటించడంతో పాటు స‌హ‌నిర్మాత‌గాను వ్యవహరిస్తున్నారు. ఈ దృశ్యకావ్యం మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Tags:    

Similar News