రాకెట్లు కాల్చడం సంస్కృతి కాదు!
| బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇంట్లో దీపావళి రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ టపాసు రాకెట్ బాల్కనీలోని సోఫాపై పడటంతో మంటలు చెలరేగాయి. పెంపుడు కుక్కలు అరవడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వివేక్, తర్వాత తన సోషల్ మీడియా పోస్టును తొలగించి, ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు.
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి నివాసంలో దీపావళి వేడుకల వేళ ఊహించని అగ్నిప్రమాదం సంభవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీపావళి రాత్రి కాల్చిన ఓ టపాసు రాకెట్ నేరుగా ఆయన ఇంటి బాల్కనీలోకి దూసుకురావడంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన నుంచి అగ్ని హోత్రి కుటుంబం తృటిలో తప్పించుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వివేక్ అగ్ని హోత్రి బాల్కనీలో ఉంచిన సోఫాపైకి బయట నుంచి రాకెట్ దూసుకురావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో పెంపుడు కుక్కలు సమయానికి గమనించి పెద్దగా అరవడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారని వివేక్ అగ్నిహోత్రి తెలిపారు.
అలాగే సోఫా ఫైర్-రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్‌తో తయారై ఉండటంతో మంటలు వేగంగా ఇంట్లోకి వ్యాపించలేదని..లేదంటే ఊహించని పెద్ద ప్రమాదం జరిగేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అగ్నిహోత్రి ఘటనకు కారణమైన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. దీపావళి పండుగ సంబరాల పేరుతో ఇతరుల ప్రాణాలను, ఆస్తులను ప్రమాదంలో పడేయడం సరికాదని హితవు పలికారు. `ఎవరైనా పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ దారితప్పే రాకెట్లు కాల్చడం మన సాంస్కృతిక గర్వకారణం కాదు. అవి కేవలం ప్రమాదకరమైన మంటల ముప్పు మాత్రమే. అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టడానికి మన గొప్ప సంస్కృతి ఎప్పుడూ అనుమతించదు` అంటూ ముంబై మేయర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
`ప్రజలకు విజ్ఞప్తులు చేస్తే సరిపోదు. బాణాసంచా నిబంధనలను ఉల్లంఘించే వారిపై భద్రతా చర్యలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వివేక్ డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వివేక్ ఈ వ్యాఖ్యలను ఉద్దేశ పూర్వకంగానే చేసినట్లు ఉందని నెటి జనులు పోస్టులు పెట్టారు. దీపావళి రోజున ఇలాంటి చిన్న చిన్న ఘటనలు సహజమని వాటిని పట్టుకుని రాద్దాంతం చేయడం సరికాదని హితవు పలికారు. దీంతో కాసేపటికి వివేక్ ఆ పోస్టును డిలీట్ చేసారు.
దీంతో ఆయన మరోసారి సోషల్ మీడియాలోకి వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. `నా మునుపటి ట్వీట్‌ను తొలగిస్తున్నాను. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు. ఆ సమయంలో నాకు తోచింది చెప్పాను. ఎవర్నీ కావాలని టార్గెట్ చేసి వ్యాఖ్యానించలేద`న్నారు. ఇక వివేక్ అగ్నిహోత్రి సినిమాల విషయానికి వస్తే? `బెంగాల్ ఫైల్స్` తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. బెంగాల్ ఫైల్స్ గత ఏడాది రిలీజ్ అయింది. కానీ దీనికి ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో తదుపరి హిట్ కంటెంట్ తోనే రావాలని కథపై కసరత్తు చేస్తున్నారు.