రియాలిటీ చెడకుండానే విజువల్ మాయాజాలం
2026 చివరి నాటికి మొత్తం పనులు పూర్తి చేసి, అదే ఏడాది చివరి నాటికి ప్రమోషన్స్ పరంగా మరింత వేగం పెంచాలనేది ప్లాన్.;
భారతదేశంలో నెవ్వర్ బిఫోర్ అని చెప్పుకునేలా ఒక భారీ చిత్రం 2027లో విడుదలకు వస్తుంది. ఇది వార్నర్ బ్రదర్స్ సినిమాలాగా, కామెరూన్ సినిమాలాగా ఆశ్చర్యపరుస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇది ఏ సినిమానో ఈపాటికే అర్థమై ఉంటుంది. కచ్ఛితంగా అది ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి. సూపర్ స్టార్ మహేష్ - ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాని ఇండియానా జోన్స్ లైన్స్ లో అత్యంత భారీగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కోసం దాదాపు 900కోట్ల మేర బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అడవులు, కొండలు కోనల్లో ఈ సినిమా కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తూ దర్శకధీరుడు అంచనాల్ని మరింత ఎక్కువగా పెంచారు.
ఇప్పుడు ఎంపిక చేసుకున్న కాన్వాసు, బడ్జెట్ దృష్ట్యా కూడా ఈ సినిమా రాజమౌళి తెరకెక్కించిన అన్ని ఇతర చిత్రాల కంటే అత్యంత భారీతనంతో కళ్లు మిరుమిట్లు గొలిపే ట్రీట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజమౌళి అనుయాయుడు అయిన దర్శకరచయిత దేవకట్టా ఓ మాట చెప్పారు. ఇది ఈగ, బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ లను మించి విజువల్ మాయాజాలంతో కట్టి పడేస్తుందని, కాన్వాస్ మరో లెవల్ లో ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, విజువల్ గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ తో తెరకెక్కించినా ఎక్కడా వాస్తవికత చెడకుండా లాజిక్స్ మిస్ కాకుండా ఉంటుందని దేవకట్టా చెప్పారు. అంతేకాదు సన్నివేశాల్లో ఎమోషన్ కూడా ఎక్కడా డ్రాప్ అవ్వదని అన్నారు.
మొత్తానికి వారణాసి గురించి దేవకట్టా చెబుతున్న విషయాలు మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈసారి బడ్జెట్, స్కేల్ దృష్ట్యా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు.
తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం జక్కన్న ఏ స్థాయిలో హార్డ్ వర్క్ చేస్తున్నారో ఇటీవల టైటిల్ గ్లింప్స్ వేడుకలో వీక్షించాం. ఈ సినిమా స్పాన్, విజువల్స్ చూసిన తర్వాత గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ పరంగా హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోదని కూడా ఒక అంచనా ఏర్పడింది. మొదటి గ్లింప్స్ చూసిన తర్వాత ఈ సినిమాకి భారీ VFX అవసరమని అందరూ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా కథలో స్పాన్ అలాంటిది. ఇందులో విభిన్న ప్రపంచాలను, భిన్నమైన కాలమానాలను చూపించబోతున్నారు. రాజమౌళి ఎంపిక చేసుకున్న కాన్వాస్ ని పరిశీలిస్తే, ఈ సినిమా 2027 వేసవిలో విడుదల కావడం చాలా సవాళ్లతో కూడుకున్న పని అని కూడా నిపుణులు భావిస్తున్నారు.
కానీ రాజమౌళి టీమ్ 2027 వేసవిలో విడుదల గురించి చాలా నమ్మకంగా ఉన్నారని చెబుతున్నారు. డెడ్ లైన్ ని రీచ్ అయ్యేందుకు చిత్ర బృందం ఐదు VFX బృందాలతో సమాంతరంగా పనిచేస్తోంది. ఒక VFX బృందం ఒక టైమ్ పీరియడ్- ఆ టైమ్ పీరియడ్ లో ప్రపంచాన్ని సృష్టించేందుకు పని చేస్తుంటే, మిగతా నాలుగు టీమ్ లు కూడా నాలుగు విభిన్నమైన టైమ్ ఫ్రేమ్ లలోని విజువల్ ప్రపంచాలను క్రియేట్ చేయడానికి వర్క్ చేస్తున్నాయి. కాబట్టి అన్ని కాలాదులకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు ఏకకాలంలో సమాంతరంగా జరుగుతాయి. రాజమౌళి నిరంతరం గ్రాఫిక్స్ పని ఎలా సాగుతోందో ఔట్ పుట్ ఎలా ఉందో పర్యవేక్షిస్తున్నారు. జక్కన్న సాంకేతిక బృందం నిరంతరం షూటింగ్ సమయంలోనే కంటెంట్‌ను వీఎఫ్ఎక్స్ టీమ్ కి పంపుతోందని కూడా తెలుస్తోంది.
2026 చివరి నాటికి మొత్తం పనులు పూర్తి చేసి, అదే ఏడాది చివరి నాటికి ప్రమోషన్స్ పరంగా మరింత వేగం పెంచాలనేది ప్లాన్. ప్రతిదానికి ప్రణాళిక సిద్ధంగా ఉంది. 2027 మార్చి నాటికి ఈ భారీ చిత్రాన్ని విడుదలకు తేవాలనే పంతంతో జక్కన్న పని చేస్తున్నారు. అందుకే అతడి శ్రమను దగ్గరగా చూసాక దేవకట్టా, వారణాసి చిత్రాన్ని ఆకాశానికెత్తేసారని అర్థం చేసుకోవచ్చు. దేవకట్టా ప్రకారం.. రియాలిటీని చూస్తున్నట్టుగా థియేటర్ లో ఆడియెన్ సినిమాని ఆస్వాధించగలిగితే, వీఎఫ్ ఎక్స్ మాయాజాలం , ఎమోషన్స్ వర్కవుటైతే ఇది ఇండియన్ వెర్షన్ అవతార్ లా భారీ వసూళ్లను నమోదు చేస్తుందని కూడా భావించవచ్చు.
ఆస్కార్ విన్నింగ్ సినిమా తీసిన డైరెక్టర్ గా రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలను కూడా తెచ్చిన ఘనత జక్కన్నకే చెందుతుంది. భారతదేశంలో ఇప్పటివరకూ ఏ ఇతర దర్శకుడికి సాధ్యం కానిది కూడా తనకు మాత్రమే సాధ్యమేనని నిరూపించాడు. అందుకే వారణాసి చిత్రంపై ఇప్పుడు అత్యంత భారీ అంచనాలేర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ఇంటర్నెట్ లో చాలా రికార్డులను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.