పవన్ 'ఉస్తాద్' వచ్చేదెప్పుడు? ఏది నిజం?
అదే సమయంలో ఇటీవల నిర్మాత రవిశంకర్.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని 2026 ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నామని ఓ సినిమా ఈవెంట్ లో వెల్లడించారు.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఉస్తాద్ భగత్ సింగ్ తో వచ్చే ఏడాది వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ రాశీ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు.
అశుతోష్ రాణా, గౌతమి, నవాబ్ షా, పంకజ్ త్రిపాఠి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఆ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అయితే ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాటిని ఇంకా పెంచేందుకు మేకర్స్ కూడా సిద్ధమవుతున్నారు. త్వరలోనే క్రేజీ అప్డేట్స్ ఇవ్వనున్నారు.
అదే సమయంలో ఇటీవల నిర్మాత రవిశంకర్.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని 2026 ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నామని ఓ సినిమా ఈవెంట్ లో వెల్లడించారు. రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ.. త్వరలో అధికారికంగా అప్డేట్ ఇస్తామని చెప్పారు. ఆ విషయం ఇప్పటికే వైరల్ గా మారగా.. సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని గంటలుగా మరో చర్చ జరుగుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్.. ఏప్రిల్ లో కాదు.. మార్చిలోనే వస్తుందని ప్రచారం జరుగుతోంది. అది కూడా మార్చి 19న లేదా 26న గ్రాండ్ విడుదల అవ్వనుందని వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. టాక్ మాత్రం వినిపిస్తోంది. అయితే ఆ రెండు డేట్స్ ఇప్పటికే ఫిల్ అయిపోయాయి. పలు సినిమాలు కర్చీఫులు వేశాయి.
మార్చి 19వ తేదీన స్టార్ హీరో యష్ టాక్సిక్ రిలీజ్ కానుండగా.. 26వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది విడుదల అవ్వనుంది. ఆ రోజు నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ కూడా వస్తుందని ఇప్పటికే ప్రకటించగా.. పోస్ట్ పోన్ అవుతుందని అంటున్నారు. పెద్ది మాత్రం కచ్చితంగా మార్చి 26వ తేదీన విడుదల అవుతున్నట్లు అర్థమవుతుంది.
దీంతో ఉస్తాద్ భగత్ సింగ్.. ఆ తేదీల్లో వస్తే బాక్సాఫీస్ వద్ద క్లాష్ ఖాయం. టాక్సిక్ పక్కన పెడితే.. పెద్దికి పోటీగా అస్సలు రాదు. అందుకే వస్తున్న వార్తల్లో అసలు క్లారిటీ లేదు. కాబట్టి.. ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్రకటిస్తేనే ఊహాగానాలకు చెక్ పడుతుంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.