వారసులుగా మారుతున్న యంగ్ డైరెక్టర్లు!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కాలానికి తగినట్లుగా కథలు చెప్పే విధానం, తెరకెక్కించే శైలి మారుతూ వస్తున్నాయి.

Update: 2026-08-16 17:30 GMT

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కాలానికి తగినట్లుగా కథలు చెప్పే విధానం, తెరకెక్కించే శైలి మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన సీనియర్ దిగ్గజ దర్శకులు ఇప్పుడు మారుతున్న ప్రేక్షకులకు తగ్గట్టుగా జోనర్లను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరికొందరు కొంత విరామం తీసుకుంటుంటే? వారి స్థానాలను భర్తీ చేయడానికి సరికొత్త ఆలోచనలతో యంగ్ డైరెక్టర్లు దూసుకొస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ పాత సీనియర్ల లెగసీని ముందుకు తీసుకువెళ్తున్న యువ దర్శకుల హవా సర్వత్రా చర్చనీయాంశమైంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సృష్టించిన ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం , హృదయానికి హత్తుకునే డైలాగ్స్ శైలిని నేడు వెంకీ అట్లూరి అద్భుతంగా కొనసాగిస్తున్నారు. కుటుంబ విలువలను, యువతకు నచ్చే ప్రేమకథలను బ్యాలెన్స్ చేస్తూ ఆయన తెరకెక్కిస్తున్న చిత్రాలు త్రివిక్రమ్ సినిమాలను తలపించేలా ఉంటున్నాయి. కథ చెప్పడంలో ఆప్యాయతను, సంభాషణల్లోని పదునును మిస్ కాకుండా వెంకీ అట్లూరి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూనే త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ డ్రామాలకు పర్ఫెక్ట్ వారసుడిగా నిలుస్తున్నారు.

తెలుగు తెరపై కామెడీకి సరికొత్త బ్రాండ్ సృష్టించిన దర్శకులలో శ్రీను వైట్ల పేరు ముందుంటుంది. ఆయన మార్కు ఎంటర్‌టైన్‌మెంట్, ప్రత్యేకమైన పాత్రల చిత్రణ ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ప్రస్తుతం ఆ బాధ్యతను అనిల్ రావిపూడి త‌న భుజాలపై వేసుకున్నారు. ఏమాత్రం బోర్ కొట్టించకుండా? అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్లను అందిస్తూ శ్రీను వైట్ల కామెడీ శైలికి నిజమైన వారసుడిగా అనిల్ రావిపూడి దూసుకుపోతున్నారు.

ఇక తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ప్రయోగాత్మక విజన్‌కు సింగితం శ్రీనివాసరావు పెట్టింది పేరు. ఏ జానర్ అయినా సరే? ఎవ్వరూ ఊహించని సరికొత్త సబ్జెక్టులను ఆయన తెరపై ఆవిష్కరించారు. ఆ అరుదైన విజన్‌కు, ఊహాజగతానికి నేడు నాగ్‌అశ్విన్ సరిగ్గా సరిపోయే రీప్లేస్‌మెంట్‌గా మారుతున్నారు. `మహానటి`తో మొదలుపెట్టి `కల్కి 2898 ఏడీ` వరకు ఆయన ఎంచుకుంటున్న కథలు, సృష్టించే భవిష్యత్తు లోకాలు సింగితం శ్రీనివాసరావు సినిమాలను తలపిస్తూ తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటుతున్నాయి.

ఈ మార్పు కేవలం వ్యక్తుల స్థానాల భర్తీ మాత్రమే కాదు. తెలుగు సినిమా కథాబలాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లే అడుగు. సీనియర్ దర్శకులు వేసిన బలమైన పునాదులపై యంగ్ డైరెక్టర్లు తమదైన ఆధునిక హంగులను అద్దుతంగా.. విజువల్స్ పరంగా టెక్నికల్ వాల్యూస్ పరంగా సినిమాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు. పాత తరపు అనుభవం, కొత్త తరపు జోష్ కలగలిసి టాలీవుడ్‌ను మరింత సుసంపన్నం చేస్తున్నాయి.

ప్రేక్షకుల అభిరుచి ఎప్పటికప్పుడు మారుతుంటుంది. దానికి తగినట్లుగానే దర్శకులు కూడా తమ శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సీనియర్ దర్శకులు ఒకవైపు కొత్త ప్రయోగాలు చేస్తుంటే? మరోవైపు యువ దర్శకులు ఆయా జానర్లలో తమకంటూ ప్రత్యేక ముద్ర వేయడం ఇండస్ట్రీకి ఆరోగ్యకరమైన పరిణామం. ఇది టాలీవుడ్‌లో ఎలాంటి కొరత లేకుండా నిరంతరం అద్భుతమైన చిత్రాలు రావడానికి ప్రధాన కారణమవుతోంది.

మొత్తానికి టాలీవుడ్ భవిష్యత్తు సురక్షితంగా ఉందనడానికి యంగ్ డైరెక్టర్ల ప్రయాణమే నిదర్శనం. సీనియర్ల అడుగుజాడల్లో నడుస్తూనే.. తమదైన ట్రెండ్‌ను సృష్టిస్తున్న యువ ప్రతిభావంతులు రాబోయే రోజుల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమను మరింత దిగ్విజ‌యంగా ముందుకు నడిపిస్తారు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News