మూడు షిఫ్టుల పని.. కుటుంబానికి దూరంగా స్టార్ హీరో కష్టం!
నేను చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించాను. 2014లో నేను కథానాయకుడిని అయ్యాను.;
నేను చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించాను. 2014లో నేను కథానాయకుడిని అయ్యాను. ఆ తర్వాత మెజారిటీ సినిమాలు లీడ్ పాత్రల్లో చేసినా కానీ సహాయక పాత్రల్లో, విలన్ గా కూడా నటించాను అని తెలిపారు టొవినో థామస్. అతడు నటించిన తాజా చిత్రం `పల్లిచట్టంబి` విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడారు. తన కెరీర్ ప్రయాణం.. తక్కువ సమయంలోనే 55 సినిమాలు పూర్తి చేయడం వెనుక ఉన్న కష్టాన్ని ఇంటర్వ్యూలో చాలా హృద్యంగా వివరించారు.
టొవినో థామస్ మాట్లాడుతూ.. తన కుమార్తెకు మూడు ఏళ్లు వచ్చే వరకు తాను ఆమెతో గడిపిన సమయం చాలా తక్కువని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పని మీద ఉన్న మక్కువతో.. కెరీర్ తొలినాళ్లలో రోజుకు మూడు షిఫ్టుల చొప్పున విరామం లేకుండా పని చేశానని చెప్పారు. ఒక సినిమా సెట్ నుండి మరో సెట్‌కు వెళ్తూ.. నిద్ర కూడా సరిగ్గా లేకుండా కష్టపడటం వల్లే ఇన్ని సినిమాలు చేయడం సాధ్యమైందని ఆయన వివరించారు. తన ఎదుగుదల కోసం తన వ్యక్తిగత జీవితాన్ని.. ముఖ్యంగా తన కుమార్తె బాల్యాన్ని కొంత మిస్ అయ్యానని ఆయన గుర్తుచేసుకున్నారు.
తెలుగు హీరోలు తక్కువ సినిమాలు చేయడానికి.. తాను ఎక్కువ సినిమాలు చేయడానికి గల వ్యత్యాసాన్ని వివరిస్తూ.. తాను కేవలం హీరో ఇమేజ్ కోసమే పాకులాడలేదని స్పష్టం చేశారు. కెరీర్ ఆరంభం నుండి వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. హీరోగా నటిస్తూనే కథలో బలం ఉంటే సహాయక పాత్రల్లో నటించడానికి.. అవసరమైతే విలన్‌గా కనిపించడానికి కూడా తాను ఎప్పుడూ వెనుకాడలేదని టొవినో తెలిపారు.
మలయాళ ఇండస్ట్రీ పనితీరు:
మలయాళ చిత్ర పరిశ్రమలో సినిమాలు చాలా వేగంగా పూర్తవుతాయి. అందుకే నటులకు ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశం దొరుకుతుంది. తాను ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అందుకే 15 ఏళ్లలో 55 సినిమాలు అనే మైలురాయిని చేరుకోగలిగానని టొవినో థామస్ తెలిపారు.2016 నుంచి 2026 మధ్య లీడ్ పాత్రలు ఎక్కువగా చేసానని తెలిపారు. ఈ క్రమంలో ఆయన పడ్డ కష్టం, వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుత సినిమాలు:
టొవినో నటించిన `పల్లిచట్టంబి` ఏప్రిల్ లో విడుదలకు రానుంది. ఈ సినిమా విషయానికి వస్తే.. ఇది 1950-60ల నాటి పోస్ట్ -ఇండిపెండెన్స్ కేరళ నేపథ్యంలో సాగే కథ. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో తెరకెక్కింది. అప్పట్లో సమాజంలో ఉన్న అణచివేత.. భూస్వామ్య వ్యవస్థ.. మూఢనమ్మకాలపై పోరాడే ఒక ధైర్యవంతుడి కథను తెరపై చూపిస్తున్నారు. టొవినో థామస్ సరసన కాయదు లోహర్ నటించారు. విజయరాఘవన్, బాబురాజ్ తదితరులు నటించారు.
ఈ భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాను ఏప్రిల్ 9న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో టొవినో మరో మైలురాయిని అందుకుంటారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. పల్లి చట్టంబి తో పాటు టొవినో అతిరథి అనే మరో చిత్రంలోను నటిస్తూ బిజీగా ఉన్నారు.