ప్రభాస్ 'రాజా సాబ్'.. ఆ లుక్ ఎక్కడ బాసూ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో నటించిన ఆ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా కనిపించారు.;
సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. గురువారం అర్ధరాత్రి ప్రీమియర్ షోలతో థియేటర్లలో సందడి మొదలైంది. శుక్రవారం ఉదయం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా సినిమా రిలీజైంది. హారర్ ఫాంటసీ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఆ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా, భారీ అంచనాల మధ్య థియేటర్స్ లోకి వచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో నటించిన ఆ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా కనిపించారు. రిలీజ్ కు ముందు మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్లు, టీజర్లు, పోస్టర్లతో సినిమా మీద భారీ హైప్ ఏర్పడింది. ముఖ్యంగా ప్రభాస్ కు సంబంధించిన విభిన్న గెటప్ లు మూవీపై అందరిలో ఆసక్తి మరింత పెంచాయి. అయితే థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
కొంత మంది ప్రేక్షకులు సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉందని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ప్రమోషన్లలో చూపించిన అంశాలు ఫైనల్ కట్ లో పూర్తిగా కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రమోషన్లలో హైలైట్ చేసిన ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ లుక్ సినిమాలో కనిపించకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఆ లుక్ సినిమా కథలో కీలకంగా ఉంటుందని అభిమానులు భావించగా, థియేట్రికల్ వెర్షన్ లో లేకపోవడంతో నిరాశ వ్యక్తమవుతోంది. అయితే రీసెంట్ గా రాజా సాబ్ మూవీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి రన్ సమయంలో సినిమాకు సుమారు ఐదు నిమిషాల అదనపు ఫుటేజ్ ను యాడ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
దీంతో ఆ ఎక్స్ ట్రా సీన్స్ లోనే ప్రభాస్ కు సంబంధించిన మిస్సింగ్ లుక్ ఉంటుందేమోనని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. అయితే ఆ ఫుటేజ్ ను ఎప్పుడు, ఎలా చేర్చాలనే నిర్ణయం పూర్తిగా ప్రొడక్షన్ సంస్థ చేతుల్లోనే ఉంది. ఆ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే చాలా మంది అభిమానులు.. డార్లింగ్ ఓల్డ్ మ్యాన్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు.
మొత్తానికి ది రాజా సాబ్ భారీ అంచనాల మధ్య విడుదలై మిక్స్ డ్ టాక్ తో ముందుకు సాగుతోంది. సంక్రాంతి సెలవులు కావడంతో భారీ కలెక్షన్లపై నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. అదనపు ఫుటేజ్ చేర్చితే.. మళ్లీ అభిమానులు కచ్చితంగా థియేటర్స్ కు వెళ్లి చూస్తారు. దీంతో ఎక్స్ ట్రా ఫుటేజ్ ను ఎప్పుడు యాడ్ చేస్తారో.. ఆ లుక్ ఎలా అలరిస్తుందో అంతా వేచి చూడాలి.