హిట్స్ ఇచ్చారు.. ఇప్పుడు పెద్ద సినిమా ఎక్కడ?

ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. టాలెంట్ తగ్గిందనే మాట కూడా లేదు. కానీ ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే పెద్ద ఆల్బమ్, స్టార్ హీరో సినిమా మాత్రం వీళ్ల దగ్గరకు తరచుగా రావడం లేదు.

Update: 2026-08-26 06:46 GMT

తెలుగు సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ల లెక్క గత కొన్నేళ్లలో బాగా మారిపోయింది. ఒకప్పుడు మిక్కీ జె మేయర్, అనూప్ రూబెన్స్, గోపీ సుందర్ పేర్లు వరుసగా వినిపించేవి. సినిమాకు ముందు పాటలతోనే మంచి బజ్ తీసుకొచ్చిన ఆల్బమ్స్ వీళ్ల ఖాతాలో ఉన్నాయి. ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. టాలెంట్ తగ్గిందనే మాట కూడా లేదు. కానీ ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే పెద్ద ఆల్బమ్, స్టార్ హీరో సినిమా మాత్రం వీళ్ల దగ్గరకు తరచుగా రావడం లేదు.

మిక్కీ జె మేయర్‌కు హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, లీడర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహానటి వరకు ప్రత్యేకమైన మెలోడీ బ్రాండ్ ఉంది. ఇప్పుడు కూడా ఆయన ఖాళీగా లేరు. 2025లో హిట్ 3 చేశాడు. ఈ ఏడాది అనగనగా ఒక రాజు, సతీ లీలావతి, చాంపియన్ వచ్చాయి. ప్రభుత్వం కూడా కొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి, అందులో సెల్ఫిష్ కూడా లైనప్‌లో ఉంది. పని ఉంది.. కానీ మళ్లీ మిక్కీ ఆల్బమ్ కోసమే సినిమా పాటలు వెతికే ఫేజ్ రావాల్సి ఉంది.

అనూప్ రూబెన్స్ పరిస్థితి కూడా దగ్గర దగ్గరగా అదే. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, మనం, సోగ్గాడే చిన్ని నాయనా, హలో ఆల్బమ్స్ ఇప్పటికీ ప్లేలిస్టుల్లో కనిపిస్తాయి. ప్రస్తుతం కూడా ఆయనకు ప్రాజెక్టులు ఉన్నాయి. మహేంద్రగిరి వారాహి సెప్టెంబర్‌లో వస్తోంది. కొన్ని చిన్న సినిమాలతో పాటు 2027 సంక్రాంతికి శర్వానంద్, శ్రీను వైట్ల జార్జ్ క్రిష్ కూడా అనూప్ చేతిలోనే ఉంది. అంటే అవకాశాలు ఆగలేదు. కానీ ఒకప్పుడు వచ్చినట్టుగా వరుస మ్యూజికల్ హిట్స్ మాత్రం మిస్ అవుతున్నాయి.

గోపీ సుందర్ తెలుగులో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, గీత గోవిందం, మజిలీ లాంటి సినిమాలతో మంచి ఫామ్ చూశాడు. ముఖ్యంగా గీత గోవిందంలో ఇంకేం ఇంకేం కావాలే ఒక్క పాటే ఆల్బమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. 2024లో ఫ్యామిలీ స్టార్ చేశాడు. 2025లో పరదా కూడా వచ్చింది. ఇప్పుడు ఎక్కువ పని మలయాళంలోనే కనిపిస్తోంది. తెలుగులో ఒకప్పుడు ఉన్నంత పెద్ద బ్యానర్ సినిమాలు మాత్రం చేతిలో కనిపించడం లేదు.

మహతి స్వర సాగర్‌ను కూడా ఈ లెక్కలో మర్చిపోలేం. ఛలోలో చూసి చూడంగానే, భీష్మలో సింగిల్స్ యాంథమ్, వాటే బ్యూటీ, మాచర్ల నియోజకవర్గంలో రా రా రెడ్డి లాంటి పాటలు పెద్దగా వెళ్లాయి. తర్వాత భోళా శంకర్, ప్రతినిధి 2 వరకు సినిమాలు చేశాడు. ఇప్పుడు చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఒక మంచి స్టార్ సినిమా, సరైన ఆల్బమ్ పడితే మళ్లీ ముందుకు వచ్చే వయసు, టాలెంట్ రెండూ ఉన్నాయి.

ఇప్పుడు సినిమాలో పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాన్ ఇండియా సౌండ్ ఎక్కువయ్యింది. ఆ రేసులో కొందరి పేర్లు వెనక్కి వెళ్లాయి. కానీ ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ మళ్లీ చార్ట్‌బస్టర్ కొట్టలేరా అంటే అలా చెప్పడానికి కారణమే లేదు. ఒక్క సరైన సినిమా పడితే ఈ లిస్ట్‌లో ఎవరి పేరు అయినా మళ్లీ టాప్ లోకి రావచ్చు.

Tags:    

Similar News