నిర్మాతలతో వార్ పీక్స్: ఏషియన్ నారంగ్ వాట్సాప్ డీపీ చూశారా?
ఈ ఉద్రిక్తతలకు తాజా నిదర్శనం ఏషియన్ సునీల్ నారంగ్ వాట్సాప్ డీపీ (WhatsApp DP). ఆయన తన ప్రస్తుత ఆలోచనలు, మనస్థితిని ప్రతిబింబిస్తూ పెట్టిన కొటేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
టాలీవుడ్‌లో ఎగ్జిబిటర్లు - నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు పరాకాష్టకు చేరుకుంది. ఒకరిపై ఒకరు సూటిపోటి మాటలతో విమర్శలు గుప్పించుకుంటూ.. పరిశ్రమ వాతావరణాన్ని యుద్ధ భూమిలా వేడెక్కిస్తున్నారు. ప్రస్తుతం సాగుతున్న ఈ పోరాటం కేవలం పరిశ్రమ విధానపరమైన సమస్యలా కాకుండా.. వ్యక్తిగత కక్షల వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తోంది. పర్సంటేజీ విధానాన్ని కోరుతున్న ఎగ్జిబిటర్లు, అద్దె విధానమే ముద్దంటున్న నిర్మాతలు `నువ్వా-నేనా` అన్నట్లుగా తలపడుతున్నారు.
ఈ ఉద్రిక్తతలకు తాజా నిదర్శనం ఏషియన్ సునీల్ నారంగ్ వాట్సాప్ డీపీ (WhatsApp DP). ఆయన తన ప్రస్తుత ఆలోచనలు, మనస్థితిని ప్రతిబింబిస్తూ పెట్టిన కొటేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ``ఒక విషయం గుర్తుపెట్టుకో.. ఫైటింగ్ మొదట నువ్వే మొదలు పెట్టకు.. ఒకవేళ వారు నిన్ను బలవంతం చేస్తే మాత్రం పూర్తిగా నాశనం చేయ్! అని నాన్నగారు నేర్పించారు`` అని ఆయన డీపీలో రాసుకొచ్చారు. తన వ్యతిరేక వర్గంపై ఆయన ఎంత సీరియస్‌గా ఉన్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. నారంగ్ ఈ పోరును మరో స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారని ఈ డీపీ స్పష్టం చేస్తోంది.
తెలంగాణలో పర్సంటేజీ విధానాన్ని గట్టిగా సమర్థిస్తున్న ఎగ్జిబిటర్ల వెనుక సునీల్ నారంగ్, శిరీష్ రెడ్డి, దిల్ రాజు వంటి అగ్ర శక్తులు ఉండగా, మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్-నవీన్ ఎర్నేని, సితార నాగవంశీ, సాహు గారపాటి వంటి నిర్మాతలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది వర్గ పోరు కాదని పైకి చెబుతున్నా కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఒకరి వ్యూహాలను మరొకరు తిప్పికొడుతూ ఆధిపత్య పోరును ప్రదర్శిస్తున్నారు.
ముఖ్యంగా నారంగ్ వర్సెస్ నాగవంశీ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం సెన్సేషన్ సృష్టిస్తోంది. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టీప్లెక్స్‌లు కడుతూ సింగిల్ స్క్రీన్లను నాశనం చేస్తున్నారని నాగవంశీ ఆరోపించగా.. తాను 33 సింగిల్ స్క్రీన్లను పోషిస్తున్నానని నారంగ్ ధీటుగా సమాధానమిచ్చారు. దిల్ రాజుకు ఉన్న హక్కు నారంగ్‌కు లేదని మైత్రి రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు మంటలకు మరింత ఆజ్యం పోశాయి. ఈ విమర్శలు ప్రతి విమర్శలతో టాలీవుడ్ రెండు ముక్కలైనట్లు కనిపిస్తోంది.
తన తండ్రి నేర్పిన `అంతం చేయ్` అనే ఫార్ములాను నారంగ్ ఇప్పుడు అక్షరాలా అమలు చేయబోతున్నారా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. ఇప్పటికే ఈ వివాదం వల్ల `పెద్ది` వంటి పెద్ద సినిమాల విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ అదృశ్య యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది? ఇండస్ట్రీ పెద్దలు దీనిని చక్కదిద్దుతారా లేక ఈ పోరులో ఒక పక్షం పూర్తిగా బలహీనపడే వరకు కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.