సిద్ధార్థ్-అదితి: వెండితెర జంట మధురమైన ప్రేమ కావ్యం
సిద్ధార్థ్ ప్రస్తుత జీవనశైలిని గమనిస్తే.. అతడి ప్రపంచమంతా భార్య అదితి చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.;
సిద్ధార్థ్ - అదితి రావు హైదరి.. ఈ ఇద్దరు నటుల మధ్య చిగురించిన ప్రేమ..ఆపై జరిగిన పెళ్లి టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు బాలీవుడ్ సర్కిల్స్ లోను హా*ట్ టాపిక్. పెళ్లి తర్వాత ఈ జంట తమ వైవాహిక జీవితంలోని ప్రతి క్షణాన్ని ఎంతో హుందాగా, అన్యోన్యంగా గడుపుతున్నారు. ముఖ్యంగా సిద్ధార్థ్ తన భార్యపై కురిపించే ప్రేమ, ఆమె పట్ల చూపే గౌరవం చూస్తుంటే అదితి తన భర్తను ఎంతో గొప్పగా ప్రభావితం చేసిందో అర్థమవుతుంది. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం కేవలం ఒక బంధం మాత్రమే కాదు... ఒకరిపై ఒకరికి ఉన్న అమితమైన గౌరవానికి ప్రతీకగా కనిపిస్తుంది.
సిద్ధార్థ్ ప్రస్తుత జీవనశైలిని గమనిస్తే.. అతడి ప్రపంచమంతా భార్య అదితి చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. సినిమా ఈవెంట్లలో కానీ.. ప్రైవేట్ ఇంటర్వ్యూలలో గానీ సిద్ధార్థ్ మాట్లాడే ప్రతి మాటలో అదితి ప్రస్తావన కచ్చితంగా ఉంటోంది. తన సంసార సాగరంలో సిద్ధార్థ్ ఎంతటి తృప్తిని పొందుతున్నారో అతడి ముఖంలోని ఆనందమే చెబుతుంది. ప్రేమను ఇస్తే అది రెట్టింపు అయి తిరిగి వస్తుందనే దానికి ఈ జంట ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. గౌరవించుకుంటూ సాగుతున్న వీరి ప్రయాణం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా అదితి రావు హైదరి షేర్ చేసిన శుభాకాంక్షల నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సిద్ధార్థ్‌ను ఎంతో ముద్దుగా `మ్యానికార్న్` అని పిలిచింది. ఈ వెరైటీ పిలుపు వెనుక వారి మధ్య ఉన్న ఏదో ఒక రహస్య అర్థం లేదా అంతులేని ప్రేమ దాగి ఉందని అభిమానులు భావిస్తున్నారు. తన జీవితంలోని అత్యంత ప్రియమైన వ్యక్తికి చక్కనమ్మ వినూత్న శుభాకాంక్షలు వారి మధ్య ఉన్న కెమిస్ట్రీని మరోసారి స్పష్టం చేశాయి.
అదితి తన భర్తను వర్ణించిన తీరు ఎంతో కవితాత్మకంగా ఉంది. సిద్ధార్థ్‌ను సూర్యుడితో పోలుస్తూ.. తన జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే శక్తి అని కొనియాడారు. ``నా సూర్యుడు.. నా నవ్వుల వెనుక ఉన్న కారణం నీవే`` అంటూ తను చేసిన పోస్ట్ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతోంది. ఈ సందర్భంగా షేర్ చేసిన కొన్ని అరుదైన ..అందమైన ఫోటోలు వీరి అన్యోన్యతకు అద్దం పడుతున్నాయి. వీరిద్దరి జంటను చూస్తుంటే వెండితెరపై కంటే నిజ జీవితంలోనే ఎక్కువ గ్లామరస్‌గా, సంతోషంగా కనిపిస్తున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
సిద్ధార్థ్-అదితి జంట సినీ ఇండస్ట్రీలో ఒక బెస్ట్ కపుల్‌గా తమ ముద్ర వేసుకుంటున్నారు. కేవలం గ్లామర్ ప్రపంచానికి పరిమితం కాకుండా.. సంప్రదాయబద్ధంగా ఒక పురాతన ఆలయంలో వివాహం చేసుకోవడం నుండి... నిత్యం ఒకరికొకరు తోడుగా ఉండటం వరకు వీరి ప్రయాణం స్ఫూర్తిదాయకం. సిద్ధార్థ్ పుట్టినరోజు నాడు అదితి కురిపించిన ఈ ప్రేమ ను చూస్తే వారి బంధం ఎంత బలమైనదో మరోసారి చాటి చెప్పింది. ప్రస్తుతం ఈ వైరల్ పోస్ట్ చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు సిద్ధార్థ్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ జంట ఇలాగే కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అదితీరావు ప్రస్తుతం `పరివారిక్ మనురాంజన్` అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే లయనెస్ అనే చిత్రంలోను నటిస్తూ బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ పరమ్ సుందరి తర్వాత వివాన్- ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే సిధ్ కి ఇటీవల అవకాశాలు తగ్గిన సంగతి తెలిసిందే.