శ్రియా హ్యూమానిటీకి సోషల్ మీడియాలో ఫుల్ మార్క్స్!

సెలబ్రిటీలను అభిమానులు తెరపై మాత్రమే కాదు.. నిజ జీవితంలో వారు ఎలా ప్రవర్తిస్తారో కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తుంటారు.

Update: 2026-07-17 08:01 GMT

సెలబ్రిటీలను అభిమానులు తెరపై మాత్రమే కాదు.. నిజ జీవితంలో వారు ఎలా ప్రవర్తిస్తారో కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తుంటారు. కొన్నిసార్లు వాళ్లు చేసే చిన్న చిన్న ప‌నులే చాలా పెద్ద మెసేజ్‌ను ఇస్తాయి. తాజాగా నటి శ్రియా శరణ్ ఓ చిన్నారి ప‌ట్ల చూపించిన ఆప్యాయత కూడా అలాంటి అరుదైన క్షణంగానే నిలుస్తుంది. గ్లామర్‌కు మాత్రమే కాకుండా, మంచి మనసుకు కూడా శ్రియా మరోసారి నిదర్శనంగా నిలిచారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

రీసెంట్ గా ఓ సంద‌ర్భంగా శ్రియా శరణ్ మీడియా కెమెరాల కోసం ఫోటోలకు పోజులిస్తూ ఉండగా, చేతిలో ఐస్‌క్రీమ్ పట్టుకుని ఉన్న ఓ చిన్నారి ఆమెను చూసి ఉత్సాహంగా ముందుకు వచ్చింది. అయితే ఆ హడావుడిలో పాప చేతిలోని ఐస్‌క్రీమ్ కింద పడిపోయింది. ఎంతో ఇష్టంగా తింటున్న ఐస్‌క్రీమ్ ఒక్కసారిగా జారిపోవడంతో చిన్నారి నిరాశకు గురై ఏడవడం మొద‌లుపెట్టింది. అక్కడ ఉన్నవారంతా ఆ దృశ్యాన్ని గమనిస్తున్న సమయంలో శ్రియా మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యారు. చిన్నారి దగ్గరకు వెళ్లిన శ్రియా, ఆమెను ప్రేమగా ఎత్తుకుని ఓదార్చారు. చిన్నారితో ముచ్చటిస్తూ, నవ్వించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపట్లోనే చిన్నారి ఏడుపు ఆగి ముఖంపై చిరునవ్వు కనిపించింది. ఆ క్షణాన్ని అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చాలామంది తమ పనుల్లోనే నిమగ్నమై ఉంటారు. కానీ చిన్నారి ఎమోష‌న్ ను అర్థం చేసుకుని వెంటనే రియాక్ట్ అయిన శ్రియా తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నిజమైన స్టార్ అంటే ఇలాగే ఉండాలని కొంద‌రు కామెంట్స్ చేస్తుంటే, పిల్లల మనసును గెలుచుకోవడం అందరికీ సాధ్యం కాద‌ని మ‌రికొంద‌రు, శ్రియాకు చాలా గొప్ప హ్యూమానిటీ ఉందంటూ ఇంకొంద‌రు కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వీడియోలో శ్రియ ఎలాంటి హడావిడి, హంగామా లేకుండా చాలా నేచుర‌ల్ గా క‌నిపించ‌గా, చిన్నారి ఏడుపు చూడ‌గానే ఆమె రియాక్ట్ అయిన విధానం ఎంతో స‌హ‌జంగా ఉంది. నేటి సోషల్ మీడియా కాలంలో సెలబ్రిటీల ప్రతి కదలిక క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే వైరల్ కావడానికి పెద్ద స్టంట్‌లు అవసరం లేదని, మనసుతో చేసిన చిన్న మంచి పని కూడా లక్షల మంది హృదయాలను తాకుతుందని శ్రియా శరణ్ మరోసారి నిరూపించారు. ఒక చిన్నారి ముఖంలో మళ్లీ చిరునవ్వు పూయించిన ఆ క్షణం.. అభిమానుల హృదయాల్లో మాత్రం శ్రియాపై గౌరవాన్ని మరింత పెంచింది.




Tags:    

Similar News