రామ్ చరణ్ పాటలో లేని తప్పు శివాజీ మాటల్లోనే ఉందా?
ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలనుకుంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు ప్రవర్తిస్తున్నారని, అందరూ ఒకేసారి దాడి చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.;
నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదంలోకి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై స్పందిస్తూ ఆయన ఇండస్ట్రీలో ప్రశ్నిస్తున్న విధానాలపై తీరుపై కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాలోని ఒక పాటను ఉదాహరణగా చూపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా ఆ సినిమాలో వచ్చిన 'చికిరి చికిరి' అనే సూపర్ హిట్ పాటను శేఖర్ బాషా ప్రస్తావించారు. ఆ పాట లిరిక్స్ లో స్పష్టంగా "నీ సరుకు సామాను చూసి వెనకే వస్తా" అనే పదాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఒక పెద్ద హీరో సినిమాలో, స్త్రీని వర్ణిస్తూ 'సామాన్లు' అనే పదం పాటలో వచ్చినప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, పైగా ఆ పాటను అందరూ ఎంజాయ్ చేశారని, చాలామంది ఆ పాటలకు రీల్స్ కూడా చేశారని ఆయన పాయింట్ లాగారు.
అప్పుడు పాటలో ఆ పదం తప్పు కానప్పుడు, ఇవాళ దాకా దాని గురించి ఒక్కరు కూడా ఎందుకు నెగటివ్ గా కామెంట్ చేయలేదని శేఖర్ బాషా నిలదీశారు. రామ్ చరణ్ పాటలో ఉంటే తప్పు లేదు కానీ, శివాజీ ఆవేదనతో అంటే తప్పా? అని ప్రశ్నించారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలనుకుంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు ప్రవర్తిస్తున్నారని, అందరూ ఒకేసారి దాడి చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
శివాజీ వాడిన ఆ రెండు పదాలు కచ్చితంగా అభ్యంతరకరమేనని, భాష విషయంలో తప్పు జరిగిందని బాషా అంగీకరించారు. దానికి మహా అయితే ఒక క్షమాపణ చెప్పాలని, అది శివాజీ ఇప్పటికే చెప్పారని అన్నారు. అంతమాత్రాన ఆయన ఇచ్చిన మెసేజ్ మొత్తాన్ని తప్పుబట్టాల్సిన పనిలేదని, ఆయన ఉద్దేశాన్ని క్లియర్ కట్ గా చూడాలని కోరారు.
సమాజంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆవేదనతోనే శివాజీ మాట్లాడారని, సినిమా వాళ్లను చూసి జనం ఫాలో అవుతారు కాబట్టి బాధ్యతగా ఉండాలనేది ఆయన పాయింట్ అని శేఖర్ బాషా సమర్థించారు. కేవలం ఆ రెండు బూతు పదాలను పట్టుకుని వేలాడకుండా, ఆయన ఆవేదన వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు.
మరోవైపు శివాజీ కూడా తన ప్రెస్ మీట్ లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తాను లులు మాల్ లో నిధి అగర్వాల్ పడ్డ ఇబ్బంది చూసి చలించిపోయానని, ఆ ఎమోషన్ లోనే మాటలు దొర్లాయని వివరణ ఇచ్చారు. ఆ రెండు పదాలకు బేషరతుగా క్షమాపణలు చెబుతూనే, తన ఆవేదన మాత్రం నిజమని తేల్చి చెప్పారు.