గోల్డ్ మెడల్ సాధించిన ప్రగతి.. 50 ఏళ్ల వయసులో ఎందరికో ఆదర్శం!
ముఖ్యంగా పబ్లిక్ లో తీన్మార్ స్టెప్పులతో అందరినీ అలరించిన ఈమె.. వెయిట్ లిఫ్టింగ్ తో అందరిని ఆశ్చర్యపరిచారు.;
ప్రముఖ సీనియర్ నటీమణి ప్రగతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు పలు చిత్రాలలో అమ్మ, అత్త , అక్క లాంటి పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కరోనా సమయంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్నారు ప్రగతి. ముఖ్యంగా పబ్లిక్ లో తీన్మార్ స్టెప్పులతో అందరినీ అలరించిన ఈమె.. వెయిట్ లిఫ్టింగ్ తో అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు ఏకంగా ఇదే వెయిట్ లిఫ్టింగ్ లో ఏకంగా గోల్డ్ మెడల్ సాధించి రికార్డు సృష్టించారు ప్రగతి.
అసలు విషయంలోకి వెళ్తే.. సినిమాలతో పాటు ఇటు క్రీడారంగంలో కూడా యాక్టివ్ గా ఉంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్ గా మారి నేషనల్ లెవెల్ పోటీలో పథకాలు సాధిస్తున్నారు. 2024లో సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ఏకంగా సిల్వర్ మెడల్ సాధించిన ప్రగతి.. ఇప్పుడు ఏకంగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. కేరళలో జరిగిన ' నేషనల్ మాస్టర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025' లో పాల్గొన్న ఈమె అక్కడ తన అద్భుతమైన పర్ఫామెన్స్ చూపించి.. ఏకంగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. దీంతో పాటు మరో రెండు విభాగాల్లో కూడా మెడల్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 విషయానికి వస్తే.. ఇందులో స్క్వేట్ 115 కిలోలు, బెంచ్ ప్రెస్ 50 కిలోలు, డెడ్ లిఫ్ట్ 122.5 కిలోల పోటీలలో ప్రగతి పాల్గొన్నారు. ఇందులో గోల్డ్ తో పాటు మరో రెండు మెడల్స్ లభించాయి. మొత్తం మూడు మెడల్స్ సాధించడంతో ఆమె ఎమోషనల్ అయిపోయారు. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు చాలా ఆనందంగా ఉంది అంటూ తాను సాధించిన విజయాన్ని అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
50 ఏళ్ల వయసులో పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించడం అంటే ఆమె కృషికి, పట్టుదలకు దాసోహం అవుతున్నారు. ప్రస్తుతం ఈమెపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అటు సినీ సెలబ్రిటీలు కూడా ఈమె సాధించిన ఘనతను మెచ్చుకుంటూ మీలాంటివారు ఎంతోమందికి ఆదర్శం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ప్రగతి అటు సినిమాలతో ఇటు ప్రొఫెషనల్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ లో సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు.
ప్రగతి సినిమాల విషయానికి వస్తే.. ప్రగతి సినిమాలలోకి రాకముందే కాలేజ్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటనలో కనిపించారు. దర్శకుడు కే భాగ్యరాజ ఈ ప్రకటన చూసి తన సినిమా 'వీట్ల విశేషంగా' సినిమాలో కథానాయికగా ఈమెకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు ఏడు తమిళ్ సినిమాలు, ఒక మలయాళం సినిమాలో నటించిన ఈమె తెలుగులో 'ఏమైంది ఈవేళ' సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించి ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు కూడా అందుకుంది. ఈమెది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన ఉలవపాడు అయినప్పటికీ.. సినిమాల కారణంగా చెన్నైలో స్థిరపడ్డారు.