సూపర్ స్టార్ కోసం తల్లిదండ్రుల ముందే సవాల్!
భారత క్రికెట్ స్టార్ సంజు శాంసన్ జీవితంలో ఓ అద్భుతమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.;
భారత క్రికెట్ స్టార్ సంజు శాంసన్ జీవితంలో ఓ అద్భుతమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదొక సాధారణ క్రికెటర్ కథ మాత్రమే కాదు. ఒక చిన్ననాటి కల ఎలా నిజమైందో చెప్పే అద్భుతమైన ప్రయాణం. టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజు శాంసన్ దేశంలోని కోట్లాది మందిలాగే సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వీరాభిమాని. అయితే ఆ అభిమానం కేవలం ఈలలు వేయడానికో? గోల చేయడానికో పరిమితం కాలేదు. అది ఒక గొప్ప `సవాల్`గా మారింది. సంజు శాంసన్ ఏడవ తరగతి చదువుతున్న సమయంలో రజనీకాంత్ సినిమా విడుదలైంది.
ఆ సినిమా క్రేజ్ తట్టుకోలేక సంజు స్కూల్ పరీక్షకు డుమ్మా కొట్టి మరీ సినిమాకు వెళ్లాడు. విషయం ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు. చదువును పక్కన పెట్టి సినిమాకు వెళ్లడంపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఆ కోపంలోనే సంజు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. `నేను సినిమా చూడటమే కాదు. ఒకరోజు అదే సూపర్ స్టార్ ఇంటికి వెళ్లి ఆయన్ని కలుస్తాను` అని తన తల్లిదండ్రుల ముందే పెద్ద సవాల్ విసిరాడు. ఏడవ తరగతి పిల్లాడు అంతటి సూపర్ స్టార్‌ను కలుస్తానని చెప్పడం అప్పట్లో అందరికీ అతిశయోక్తిగా అనిపించి ఉండవచ్చు.
కానీ సంజు శాంసన్ మనసులో ఆ మాట బలంగా నాటుకుపోయింది. ఆ రోజు నుంచి తన కల కోసం, క్రికెట్ కెరీర్ కోసం కష్టపడటం మొదలుపెట్టాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా , టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా ఎదిగిన వైనం తెలిసిందే. అలాగని తన చిన్ననాటి ఆ ఛాలెంజ్‌ను మాత్రం మర్చిపోలేదు. కాలం గిర్రున తిరిగింది. సరిగ్గా 21 ఏళ్ల తర్వాత ఆ అద్భుతం జరిగింది. సంజు శాంసన్ క్రికెట్ రంగంలో సాధించిన విజయాలను చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా ఆయన్ని తన నివాసానికి ఆహ్వానించారు. చెన్నైలోని రజనీకాంత్ నివాసానికి వెళ్లిన సంజు, అక్కడ సూపర్ స్టార్‌తో గంటకు పైగా సమయాన్ని గడిపారు.
తన చిన్నతనంలో తండ్రికి విసిరిన సవాల్‌ను రజనీకాంత్ అంటే తనకున్న ఇష్టాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు ఎవరి సినిమా కోసం పరీక్షలు ఎగ్గొట్టాడో? అదే వ్యక్తి పక్కన కూర్చుని ముచ్చటించడం సంజు జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ భేటీకి సంబంధించిన విషయాలను సంజు శాంసన్ ఓ ఇంటర్వ్యూలో పంచుకోవడంతో బయటకు వచ్చాయి. `నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్నతో చెప్పాను. ఒకరోజు నేను రజనీ సార్‌ను కలుస్తానని. ఈరోజు ఆ కల నిజమైంది` అని ఆయన పేర్కొన్నాడు. కేవలం సంజు మాత్రమే కాదు. రజనీకాంత్ కూడా సంజు బ్యాటింగ్ శైలిని మెచ్చుకోవడం విశేషం. పట్టుదల ఉంటే ఎంతటి అసాధ్యమైన కలనైనా సుసాధ్యం చేసుకోవచ్చని సంజు శాంసన్ నిరూపించారు.
సంజు శాంసన్ కథ నవతరానికి ఓ స్ఫూర్తి. ఒక సామాన్య అభిమానిగా మొదలై తన ప్రతిభతో సూపర్ స్టార్ మెప్పు పొంది ఆయన ఇంటికే అతిథిగా వెళ్లడం అంటే సామాన్యమైన విషయం కాదు. తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టు కుంటూనే? తన ఆరాధ్య దైవాన్ని కలిసిన సంజు శాంసన్ ప్రయాణం. `కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి` అన్న మాటకు నిలువెత్తు సాక్ష్యం. రజనీకాంత్ - సంజు శాంసన్ ల అరుదైన భేటీ నెట్టింట అందర్నీ ఆకట్టుకుంటుంది.