ఆలస్యం అయినా.. వంగా పర్ఫెక్ట్ క్లారిటీ

ఈ మాటలో సందీప్‌కు ఉన్న కాన్ఫిడెన్స్ కంటే, తన సినిమా మెటీరియల్‌పై అతనికి ఉన్న నమ్మకమే ఎక్కువగా కనిపిస్తుంది.

Update: 2026-09-01 05:38 GMT

సినిమా రిలీజ్ దగ్గర పడితే ఎన్ని ప్రమోషన్స్ చేయాలి, బిజినెస్ ఎలా క్లోజ్ అవుతుంది అనే టెన్షన్ టీమ్‌లో ఉంటుంది. కానీ సందీప్ రెడ్డి వంగా మాత్రం మొదటి సినిమా నుంచే ఈ విషయంలో ఒకే క్లారిటీతో వెళ్లాడట. ‘అర్జున్ రెడ్డి’ టైమ్‌లో ప్రణయ్ వంగా రిలీజ్ గురించి కంగారు పడుతుంటే, నువ్వేం వర్రీ కావద్దు.. ఒక్క పోస్టర్, ఒక టీజర్, ఒక ట్రైలర్ సరిగ్గా వదిలితే బిజినెస్ అయిపోతుందని సందీప్ చెప్పాడని ఇటీవల గుర్తు చేసుకున్నారు.

ఈ మాటలో సందీప్‌కు ఉన్న కాన్ఫిడెన్స్ కంటే, తన సినిమా మెటీరియల్‌పై అతనికి ఉన్న నమ్మకమే ఎక్కువగా కనిపిస్తుంది. నెలల ముందు నుంచే ప్రతి వారం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ హైప్‌ను పట్టుకోవాలనే పద్ధతి కాకుండా, సరైన టైమ్‌లో సినిమా టోన్‌ను పట్టేసే కంటెంట్ బయటకు పంపాలనేది అతని స్టైల్. ‘అర్జున్ రెడ్డి’ నుంచి ‘యానిమల్’ వరకు ప్రమోషనల్ మెటీరియల్ విషయంలో కూడా ఇదే పద్ధతి కనిపించింది.

ఇప్పుడు ‘యానిమల్ పార్క్’ విషయంలో కూడా సందీప్ ఆలోచన మారలేదని ప్రణయ్ చెబుతున్నారు. సినిమా ఆలస్యం అవుతోందని, ఈపాటికే ‘పార్క్’ చేసేయాల్సిందని చాలామంది అంటుంటారట. దానికి సందీప్ మాత్రం పెద్దగా రియాక్ట్ కాడట. మళ్లీ ఒక టీజర్, ట్రైలర్‌ను ప్రాపర్‌గా షూట్ చేసి బయటకు వదిలితే జనాలు తిరిగి అదే సినిమా గురించి మాట్లాడతారనే నమ్మకంతో ఉంటాడని ప్రణయ్ చెప్పారు.

ఒక సినిమా గురించి కొంతకాలం మాట్లాడకపోయినా, తిరిగి మొదలుపెట్టే సమయంలో ఇచ్చే ఫస్ట్ ఇంపాక్ట్ సరిపోతుందని అతని లెక్క. అందుకే ‘పార్క్’ ఆలస్యం అవుతోందనే బయట మాటలతో అతను తొందరపడటం లేదని ప్రణయ్ చెప్పిన దాంట్లో అర్థం ఉంది. ముందు సినిమా రెడీ కావాలి, తర్వాత దాన్ని ఎలా చూపించాలో తనకు తెలుసనే ధైర్యం కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ సంగతులన్నీ ‘రోమంచికం’ ప్రమోషన్స్‌లో ప్రణయ్ మాటల్లో బయటకు వస్తున్నాయి. సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్‌పై ప్రణయ్ వంగా నిర్మించగా, సందీప్ రెడ్డి వంగా ప్రెజెంటర్‌గా ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘రోమంచికం’ సెప్టెంబర్ 3న థియేటర్లలోకి రానుంది. రిలీజ్‌కు ముందు ప్రణయ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూనే, సందీప్ ఆలోచించే విధానానికి సంబంధించిన ఇలాంటి చిన్న విషయాలను కూడా బయటపెడుతున్నారు.

Tags:    

Similar News