ఆమె స్వర వీణ...సంగీత విదుషీమణీ

ఎస్ జానకి ఇక లేరు అన్న వార్త ప్రతీ సినీ సంగీత అభిమానికి తీవ్రమైన విషాదం అంటే అతిశయోక్తి కాదు.

Update: 2026-07-11 18:44 GMT

ఎస్ జానకి ఇక లేరు అన్న వార్త ప్రతీ సినీ సంగీత అభిమానికి తీవ్రమైన విషాదం అంటే అతిశయోక్తి కాదు. ఆమె ఆరు దశాబ్దాలకు పైగా తన సంగీతంతో కొన్ని తరాలను విశేషంగా అలరించారు. ఆమె గొంతులో జాలువారిన పాటలు వేలాది వేలు. అవి వినే వారికి వీనుల విందులు. రెండేళ్ళ పసిపాప నుంచి తొంబై ఏళ్ళ వృద్ధురాలి వరకూ ఆమె గొంతు మార్చి పడగల నైపుణ్యం కలిగిన విదుషీమణి. బహు భాషలలో అలవోకగా పాటలు ఆలపించి అందరినీ ఆకట్టుకున్న కంఠం ఆమె సొంతం.

నరవరా అన్నా నరుడా అని పిలిచినా :

నర్తనశాలలో నరవరా కురువరా అని పాడినా భైరవద్వీపంలో నరుడా ఓ నరుడా అని ఆలపించినా ఆ స్వరంలో అదే గమ్మత్తు. వీణ వేణువు అయిన సరిగమ విన్నావా అని ఆమె ఆలపించినపుడు ఆ గొంతు వీణగా మారుమోగిన తీరునే అంతా ఆస్వాదించారు. వయసు పెరిగినా గొంతు మాత్రం పసిదే. అందులో పసిడి తావి అలా అద్దుతూనే తరాలను మురిపించారు. ఇక్కడ మురిపించే మువ్వలు అనే అనువాద చిత్రం గురించి చెప్పుకోవాలి. నీ లీల పాడెద దేవా అంటూ ఎస్ జానకి పాడిన తీరుకు అంతా మంత్ర ముగ్దులు కావాల్సిందే. ఒకటా రెండా వేయా పది వేలా అక్షరాలా యాభై వేల పాటలకు దగ్గరగా సకల భాషలలో ఆమె పాడి అశేషమైన శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నారు.

నవ్య తరంలో మెరిసి మురిసి :

ఎస్ జానకి సంగీత ప్రయాణం చూస్తే ఆమె 1957లో ఎమ్మెల్యే చిత్రంలో ఏకంగా అలనాటి దిగ్గజ సంగీత దర్శకుడు ఘంటసాలతో కలసి నీ ఆశ అడియాశ అంటూ తొలి పాట ఆలపించారు. అప్పటికే తెలుగు సినీ సీమలో లీల, సుశీల, జిక్కి తదితర గాయనీమణులు ఉన్నారు. వారితో కలసి ఆమె పాటలను పాడుతూ ముందుకు సాగారు. సినిమాలలో హీరోయిన్లకు లీల లేదా సుశీల స్వరాలు అందించేవారు. ఇతర పాత్రలకు ఎస్ జానకి గొంతు అరువిచ్చేవారు. ఇదంతా 70 దశకం వరకూ సాగుతూ వచ్చింది. ఇక ఆ తరువాత నవ్య తరం మొదలైంది. కన్నె వయసు మూవీలో ఎస్ జానకి ఏ దివిలో విరిసిన పారిజాతమో అంటూ పాడిన పాటతో ఆమె ప్రతిభా ప్రావీణ్యాలు మరింతగా లోకానికి తెలిసాయి. ఆ తరువాత పదహారేళ్ళ వయసు మూవీలో సిరిమల్లె పూవా అంటూ ఆమె పాడిన పాట శ్రోతలను ఈ రోజుకీ వెంటాడుతూనే ఉంటుంది అంటే అందులో ఆశ్చర్యం లేదు.

సిరిమల్లె పువ్వల్లె నవ్వుతూ :

1976లో వచ్చిన జ్యోతి సినిమాలో సిరిమల్లె పువ్వల్లె నవ్వు అన్న పాటలో సంగీతానికి సరిసమానంగా ఆమె నవ్వులతో లయబద్ధంగా ఆలపించిన తీరు అమోఘం. అద్భుతం. ఆ పాట ఈ రోజుకీ ఎవర్ గ్రీన్ హిట్ గానే నిలిచింది. అలాగే అభిలాష మూవీలో నవ్వింది మల్లె చెండు పాటలో కూడా ఎస్ జానకి పాట మొత్తం తన నవ్వులతో అలరించిన తీరు అమోఘం. ఇక సినీ సీమలో వచ్చిన మార్పులు శ్రోతల అభిరుచులలో కొత్తదనం నేపధ్యంలో ఎస్ జానకి ముందు వరసలోకి వచ్చారు. ఎమ్మెస్ విశ్వనాధన్ అలాగే ఇళయరాజా, రమేష్ నాయుడు, సత్యం, రాజన్ నాగేంద్ర వంటి వారికి ఆమె ఫస్ట్ చాయిస్. బెస్ట్ చాయిస్ కూడా. వీరి కాబోలో ఆమె ఎన్నో పాటలు ఆలపించి వాటికి శాశ్వత ముద్ర వేసారు. ఎస్పీబీ ఇళయరాజా ఎస్ జానకి కాంబోలో వచ్చిన వేల పాటలు అయితే ఇక చెప్పనవసరం లేదు. అవి ఈ రోజుకీ మారుమోగుతూనే ఉంటాయి. అంతే కాదు బాలచందర్, భారతీరాజా, కె విశ్వనాధ్ వంటి దిగ్దర్శకులకు కూడా ఆమె ఫస్ట్ చాయిస్ అని చెప్పాలి. 1980 దశకం అంతా ఎస్ జానకి తనదే అన్నట్లుగా శాసించారు. తన స్వర మధురిమలతో శ్వాసించారు.

బాలూని ప్రోత్సహించి :

నెల్లూరులో జరిగిన సంగీత పోటీలకు జడ్జీగా వెళ్ళిన ఎస్ జానకి ఆ పోటీలో పాల్గొన్న ఎస్పీ బాలుని సినీ రంగానికి రమ్మని ప్రోత్సహించారు. ఆ తరువాత వారిద్దరి కాంబో తెలుగు సినీఎ సంగీతంలో సువర్ణ అధ్యాయంగా నిలిచింది అన్నది తెలిసిందే. ఎస్పీబీ యాభై దాకా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహిస్తే అందులో దాదాపుగా ప్రతీ సినిమాలో పాటలు అన్నీ ఎస్ జానకి చేతనే పాడించారు అంటే ఎస్పీబీకి ఆమె అంటే ఎంతటి అభిమానమో గురుభావమో అర్ధం అవుతుంది.

రుమాలు పట్టుకుంటేనే :

ఎస్ జానకికి ఒక అలవాటు ఉంది. ఆమె చేతిలో రుమాలు ఉంటేనే గొంతులో పాట పలుకుతుంది. ఇంతటి సంగీత స్రష్టకు రుమాలు లేకపోతే పాట రాదా అనుకోవచ్చు. అది ఆమె అలవాటు. రికార్డింగ్ థియేటర్ లో అయినా అలాగే బయట ఆర్కేస్ట్రాలలో అయినా ఆమె చేతిలో రుమాలు ఉండాల్సిందే. రెండవ చేతితోనే మైక్ అందుకుని ఆమె అద్భుతంగా ఆలపిస్తారు. అదేంటో ఆ రుమాలుకు ఆమె గొంతులో సరిగమల స్వరాలకు మధ్య అనుబంధం ఏమిటో ఎవరూ చెప్పలేరు.

భారత రత్నకు అర్హురాలు :

సినీ సంగీత ప్రపంచంలో లతా మంగేష్కర్ కి భారత రత్న అవార్డు లభించింది. దక్షిణాది కళాకారులకు అవార్డుల విషయంలో అన్యాయం జరిగింది అన్న భావన ఉంది. నిజంగా ఎస్ జానకి విషయం తీసుకుంటే ఈ అభిప్రాయం మరింతగా బలపడుతుంది. ఆమె దశాబ్దాల పాటు సినీ సంగీతానికి చేసిన కృషికి తగినట్లుగా పౌర పురస్కారాలు ఆమెను వరించలేదనే చెప్పాలి. భారత రత్నకు ఆమె అన్ని విధాలుగా అర్హురాలు. కానీ ఆమెకు పద్మభూషణ్ అవార్డు కూడా దశాబ్దాల ఆలస్యంగా వచ్చింది. ఆమె అయితే దానిని సున్నితంగా తిరక్సరించడం ఇక్కడ విశేషం. ఏది ఏమైనా ఎస్ జానకి దివి నుంచి భువికి వెళ్ళినా ఆమె తన సుస్వరంతో ఆలపించిన ఎన్నో వేల పాటలను మనకు వదిలిపెట్టి వెళ్ళారు. వాటిని వింటున్నపుడు అందులో ఎస్ జానకి సజీవంగా ఉంటారు, సదా చిరంజీవిగానూ ఉంటారు.

Tags:    

Similar News