సౌత్ హీరోయిన్లకు కలిసిరాని బాలీవుడ్!
గ్లామర్, నటన పరంగా తిరుగులేని ప్రతిభ ఉన్నా, బాలీవుడ్ బాక్సాఫీస్ సమీకరణాలు సౌత్ హీరోయిన్లకు తరచూ సవాళ్లను విసురుతూనే ఉన్నాయి.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకుని, కోట్ల మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న కథానాయికలు బాలీవుడ్ వైపు చూపు సారించడం దశాబ్దాలుగా జరుగుతున్నదే. టాలీవుడ్, కోలీవుడ్‌లలో అగ్ర హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్లు అందుకున్న భామలు, హిందీ చిత్రసీమలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇక్కడ ఎంతటి స్టార్ హోదా అనుభవించినా? ఉత్తరాది మార్కెట్ అందరికీ అంత సులభంగా కలిసిరావడం లేదు. గ్లామర్, నటన పరంగా తిరుగులేని ప్రతిభ ఉన్నా, బాలీవుడ్ బాక్సాఫీస్ సమీకరణాలు సౌత్ హీరోయిన్లకు తరచూ సవాళ్లను విసురుతూనే ఉన్నాయి.
ప్రస్తుత తరం దక్షిణాది నాయికలలో బాలీవుడ్ మార్కెట్‌ను విజయవంతంగా చేజిక్కించుకున్న ఏకైక నటిగా రష్మిక మందన కనిపిస్తోంది. `పుష్ప` చిత్రంతో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైన కన్నడ బ్యూటీ నేరుగా హిందీలో చేసిన ప్రయత్నాల్లో మంచి విజయాలను అందుకుంది. `యానిమల్` సినిమా సాధించిన భారీ వసూళ్లు బాలీవుడ్‌లో ఆమె స్థానాన్ని సుస్థిరం చేశాయి. కమర్షియల్ సక్సెస్‌తో పాటు వరుసగా హిందీలో క్రేజీ ప్రాజెక్ట్‌లను దక్కించుకుంటూ దూసుకుపోతున్న రష్మిక మినహా మిగిలిన సౌత్ స్టార్ హీరోయిన్ల ప్రయాణం మాత్రం అక్కడ ఒడిదుడుకులతో సాగుతోంది.
తెలుగులో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న పూజా హెగ్డే, `సీతా రామం` సినిమాతో సౌత్ ప్రేక్షకులకు ఆరాధ్య దేవతగా మారిన మృణాల్ ఠాకూర్ ఇద్దరూ బాలీవుడ్‌పై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇద్దరి కలయికలో ప్రతిష్టాత్మకంగా ఇటీవలే విడుదలైన హిందీ చిత్రం `హే జవానితో ఇష్క్ హోనాహే` బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో బరిలోకి దిగింది. సౌత్‌లో మంచి మార్కెట్ ఉన్న ఇద్దరు భామలు స్క్రీన్‌ను పంచుకున్నా? ఉత్తరాది ఆడియన్స్‌ను ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ట్రేడ్ వర్గాల అంచనాలను అందుకోవడంలో ఈ ప్రాజెక్ట్ వెనుకబడిందనే చెప్పాలి.
బాలీవుడ్ నుంచే తన కెరీర్ ప్రారంభించినప్పటికీ మృణాల్ ఠాకూర్‌కు స్టార్ ఇమేజ్ , నటిగా గుర్తింపు తెచ్చింది మాత్రం టాలీవుడ్ చిత్రాలే. ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాప్ లీగ్‌లోకి వెళ్లిన బ్యూటీ తిరిగి బాలీవుడ్‌లో జెండా పాతాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే ఆమె నటించిన తాజా సీక్వెల్ చిత్రం `సన్ ఆఫ్ సర్దార్ 2` కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అటు కంటెంట్ పరంగా, ఇటు వసూళ్ల పరంగా సినిమా నిరాశపరచడం మృణాల్ హిందీ కెరీర్ గ్రాఫ్‌కు కొంత బ్రేక్ వేసినట్లయింది.
మరోవైపు టాలీవుడ్, కోలీవుడ్ లలో గ్లామర్ డాల్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ కెరీర్ ప్రారంభంలో నటించిన `మున్నా మైకేల్` ఆమెకు బాలీవుడ్‌లో ఆశించిన బ్రేక్ ఇవ్వలేకపోయింది. అలాగే `తంగలాన్` వంటి చిత్రాలతో మెప్పించిన మాళవిక మోహనన్ హిందీలో చేసిన `యుద్ధ` చిత్రం కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. సౌత్‌లో మహానటిగా జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్, బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూ చేసిన `బేబీ జాన్` చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నమోదయ్యాయి. కానీ దురదృష్టవశాత్తూ ఈ చిత్రం కూడా ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేక చతికిలపడింది.
దక్షిణాదిలో స్టార్ డైరెక్టర్లు, టాప్ ప్రొడక్షన్ హౌస్‌లతో పనిచేసే ఈ హీరోయిన్లు బాలీవుడ్‌కు వెళ్లేసరికి కథల ఎంపికలో తడబడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సౌత్ సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్, వారికి లభించే పబ్లిసిటీ హైప్ హిందీ సినిమాల్లో కనిపించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కేవలం బాలీవుడ్ ప్రాజెక్ట్ అనే క్రేజ్‌తో సరైన కథ, కథనం లేని చిత్రాలను ఎంచుకోవడం వల్లే ఈ పరాజయాలు ఎదురవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో కూడా సౌత్ హీరోయిన్లకు హిందీలో సోలో మార్కెట్ ..సరైన సక్సెస్ రేట్ దక్కకపోవడం గమనార్హం.