విజయ్‌ను వెయ్యిసార్లయినా అడుగుతా.. రష్మిక గట్టి కౌంటర్!

విజయ్ దేవరకొండ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడారు. పెళ్లి చేసుకుందామని రష్మిక తనను చాలాసార్లు అడిగేదని సరదాగా చెప్పారు.

Update: 2026-10-26 10:17 GMT

విజయ్ దేవరకొండ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడారు. పెళ్లి చేసుకుందామని రష్మిక తనను చాలాసార్లు అడిగేదని సరదాగా చెప్పారు. అయితే ఆ మాటలను పట్టుకుని కొందరు నెటిజన్లు రష్మికపై రకరకాల కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విజయ్‌ను పెళ్లి కోసం ఆమె ఒత్తిడి చేసిందనేలా వీడియోలు కూడా వచ్చాయి. దీంతో ఇప్పటివరకు ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోని రష్మిక, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా తొమ్మిది స్లైడ్లతో సమాధానం ఇచ్చారు.

కొన్ని వీడియోలు అసలు ఇంటర్వ్యూ సందర్భాన్ని కూడా మార్చేశాయని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ మధ్య జరిగిన సంభాషణను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని రష్మిక చెప్పారు. ఎన్నిసార్లు అడిగాను, ఏడాది మొత్తం అడుగుతూనే ఉన్నానా అనేది అసలు విషయం కాదన్నారు. తనకు కావాల్సిన జీవితం మీద ముందే క్లారిటీ ఉందని, విజయ్ మాత్రం పెళ్లికి సంబంధించిన ప్రాక్టికల్ విషయాలను ఆలోచించేందుకు సమయం తీసుకున్నారని వివరించారు.

అందువల్ల ఇద్దరి మధ్య ప్రేమలో ఎలాంటి మార్పు రాలేదని స్పష్టం చేశారు. తాను మనసుతో నిర్ణయాలు తీసుకుంటే విజయ్ ఆచితూచి ఆలోచించే వ్యక్తి అని చెప్పారు. పెళ్లి అంటే మోకాళ్లపై కూర్చుని ఉంగరం ఇవ్వడం మాత్రమే కాదని రష్మిక అభిప్రాయపడ్డారు. కలిసి భవిష్యత్తును నిర్మించుకోవడమే తమకు ముఖ్యమని చెప్పారు. విజయ్‌ను అంతగా ప్రేమిస్తున్నానని బహిరంగంగా చెప్పుకోవడాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారని ప్రస్తావించారు.

పెళ్లయ్యాక కూడా ఆయనతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందని, వంద కాదు వెయ్యిసార్లయినా అదే మాట చెబుతానని రాశారు. అది తన ప్రేమను వ్యక్తం చేసే విధానమన్నారు. జీవితాంతం ఆయనతోనే ఉండాలనేది తన కోరికట. తనకు సలహాలు ఇస్తూ రీల్స్ చేస్తున్న మహిళలకూ రష్మిక సమాధానం ఇచ్చారు. గతంలో కష్టమైన రోజులు ఎదురైనప్పుడు ఆ సలహాలు ఇచ్చేవాళ్లు ఎవరూ పక్కన లేరని చెప్పారు.

గాయం అయినప్పుడు, నెలనెలా శారీరక నొప్పులు వచ్చినప్పుడు, అర్ధరాత్రి ఆందోళనతో నిద్రలేచినప్పుడు విజయ్ తనకు అండగా ఉన్నాడని వివరించారు. అందుకే తన రిలేషన్‌షిప్ గురించి బయటివాళ్లు చెప్పే మాటలతో నిర్ణయం మార్చుకోనన్నారు. తన విజయాలను కూడా విజయ్ తనకంటే ఎక్కువగా సెలబ్రేట్ చేస్తాడని చెప్పుకొచ్చారు. తనను విమర్శించడం ఒకటైతే, తన కుటుంబాన్ని ఇందులోకి లాగడం మరో విషయమని రష్మిక మండిపడ్డారు.

కుటుంబ సభ్యుల గురించి తెలియకుండానే కామెంట్స్ చేయడం ఫెమినిజం కాదని, ఆ పేరుతో ఇతరులను వేధించడం తప్పని చెప్పారు. ఎవరి జీవిత భాగస్వామిని వాళ్లు ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని, తాను కూడా సొంత నిర్ణయమే తీసుకున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. ప్రతి వ్యక్తి నిర్ణయాన్ని గౌరవించాలన్నారు.

కన్నడ నెటిజన్లను ఉద్దేశించి కూడా రష్మిక ప్రత్యేకంగా రాశారు. పదేళ్ల తర్వాత కూడా తన గురించి అంతగా పట్టించుకుంటున్నారంటూ స్పెషల్ గా హైలెట్ చేయడం విశేషం. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే ఎడిటెడ్ వీడియోలు, తన వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు తిరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నోట్ చివర్లో విజయ్ తనను వీపుపై మోస్తున్న సరదా వీడియోను జోడించారు. వీడియోలో ఇద్దరూ ఇంట్లో నవ్వుతూ కనిపించారు.



Tags:    

Similar News