కంగన రీ-ఎంట్రీ వెనుక ఉన్న అసలు కథేంటి?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కంగనా రనౌత్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రత్యక్ష తెలుగు చిత్రంలో నటించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కంగనా రనౌత్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రత్యక్ష తెలుగు చిత్రంలో నటించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ అమ్మడు వైవిధ్యమైన టాలీవుడ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సారి ఓ విభిన్నమైన జోనర్‌ను ఎంచుకుని సౌత్ ఆడియన్స్‌ను భయపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హారర్ థ్రిల్లర్ జోనర్‌కు సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రయోగాత్మక దర్శకుడు రవిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
`అవును`, `అనసూయ` వంటి చిత్రాలతో థ్రిల్లర్ చిత్రాల మేకింగ్‌లో తనదైన ముద్ర వేసుకున్న రవిబాబు.. కంగనా రనౌత్ కోసమే ఓ పవర్ఫుల్ హారర్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో కంగన పోషించే పాత్ర కథకు ప్రధాన బలంగా నిలవనుందని బోగట్టా. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే? ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రహస్యంగా ఎలాంటి హడావుడి లేకుండా శరవేగంగా జరుగుతోందని గుసగు సలు వినిపిస్తున్నాయి.
విషయం లీక్ అవ్వకుండా సస్పెన్స్‌ను మైంటైన్ చేస్తూ మేకర్స్ చిత్రీకరణను శర వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. గతంలో కంగనా రనౌత్ టాలీవుడ్లో నటించిన చిత్రం `ఏక్ నిరంజన్`. 2009లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కథానాయికగా నటించారు. అటుపై `తలైవి`, `చంద్రముఖి 2` వంటి పాన్-ఇండియా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించినా? అవి తమిళ డబ్బింగ్ చిత్రాలుగానే వచ్చాయి. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ వ్యవధి తర్వాత నేరుగా తెలుగు సినిమాలో నటించడం ఇదే తొలిసారి.
విలక్షణ నటనకు మారుపేరైన కంగనా రనౌత్ హారర్ , మైండ్ థ్రిల్లర్ జోనర్లను హ్యాండిల్ చేయడంలో సిద్ధహస్తుడైన రవిబాబు కాంబినేషన్ కుదరడం సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకోవడంలో కంగనా చూపించే శ్రద్ధ తెలిసిందే. అలాంటి నటిని రవిబాబు హారర్ ఫ్రేమ్‌లో ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికర చర్చగా మారింది. మరి ఈ ప్రచారమంతా నిజమా? అన్నది కూడా కన్పమ్ అవ్వాలి.