బ్యాంకాక్‌లో పాకిస్తాన్ లియోరిని సృష్టించడం కోసం
రణ్‌వీర్ సింగ్ `ధురంధర్` 400కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి 500కోట్ల వసూళ్ల దిశగా సాగిపోతోంది.;
రణ్‌వీర్ సింగ్ `ధురంధర్` 400కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి 500కోట్ల వసూళ్ల దిశగా సాగిపోతోంది. ఈ సినిమా సృష్టిస్తున్న వసూళ్ల ప్రభంజనం ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. థియేటర్లలో రణ్ వీర్, అక్షయ్ ఖన్నా సహా నటీనటుల ప్రదర్శనలకు అద్భుత స్పందన వస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ రాజకీయాలు, మాఫియా, తీవ్ర వాద లింకుల గురించిన బలమైన కథనం ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అత్యంత దుర్భేధ్యమైన శత్రు దేశంలోకి ప్రవేశించిన ఇండియన్ స్పై ఎలాంటి ఆపరేషన్ చేసాడనేదానిని దర్శకుడు విధ్వంశకరంగా చూపించిన తీరుకు ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ సినిమా కథాంశం ముఖ్యంగా పాకిస్తాన్ కరాచీకి సమీప నగరం లియారీలో సాగుతుంది. ఈ పట్టణం అంతా ఇరుకు సందులు, రోడ్లు, చిన్న భవంతులతో అస్తవ్యస్థంగా ఉంటుంది. అలాంటి చోట గల్లీ మాఫియా అరాచకాలు ఎలా ఉంటాయో తెరపై అసాధారణంగా చూపించారు. ముఖ్యంగా లియారీ ప్రాంతంలో రెహ్మాన్ డెకైత్ అనే అత్యంత క్రూరమైన గ్యాంగ్ స్టర్ ఎలాంటి అరాచకాలు సృష్టించాడో తెరపై చూపించారు ఆదిత్యాధర్. రెమ్మాన్ డెకైత్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇప్పుడు తెరవెనక ఈ సినిమా కోసం దురంధర్ టీమ్ ఎంతగా శ్రమించిందో ప్రజలు ముచ్చటించుకుంటున్నారు. ముఖ్యంగా లియోరి సిటీని భారతదేశంలో కాకుండా, విదేశాలలో నిర్మించారు. దీనికోసం ముంబై, చండీఘర్, బ్యాంకాక్ సహా పలు చోట్ల లొకేషన్లను వెతికారు. కానీ చివరికి బ్యాంకాక్ అనుకూలమైన ప్రదేశంగా నిర్ణయించుకున్నారు. జూలై సమయంలో ముంబైలో సెట్లు వేసే పరిస్థితి లేదు. భారీ వర్షాల కారణంగా వాతావరణం సహకరించే పరిస్థితి లేదు. దీంతో బ్యాంకాక్ కు షెడ్యూల్ షిఫ్టయింది.
బ్యాంకాక్ లో లియోరి నగర సెట్ వేసేందుకు ఆరు ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. అక్కడ 500 మంది కార్మికులతో కేవలం 20 రోజుల్లో లియారి పట్టణాన్ని పునఃసృష్టించారు. అయితే అచ్చం పాకిస్తాన్ లియోరీని తలపించే నగరాన్ని నిర్మించేందుకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. కరాచీలోని అత్యంత కష్టతరమైన, జనసాంద్రత కలిగిన పొరుగు ప్రాంతాలలో ఒకటైన లియారిని నిర్మించడానికి బ్యాంకాక్‌లో స్థానిక కూలీలను తీసుకోవాల్సి వచ్చింది. రోజుకు దాదాపు 500 మంది కార్మికులు పని చేసారు. సెట్ నిర్మాణానికి ప్రొడక్షన్ డిజైనర్ సైనీ ఎస్ జోహ్రే నాయకత్వం వహించారు. పాకిస్తాన్ లేదా ఇండియా వెలుపల ఈ సెట్ ని నిర్మించేందుకు 500 మందిని విమానంలో తీసుకెళ్లలేము కాబట్టి స్థానిక కళాకారులతో కలిసి పనిచేయాల్సి వచ్చిందని జోహ్రే తెలిపారు. క్రియేటివిటీ పరంగా కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. సెట్ నిర్మాణానికి అవసరమయ్యే అన్ని వసతులను అందించారు. షెడ్యూల్ పరిమితులు, స్థలం పరంగా పరిమితులు లేకుండా ఈ సెట్ ని నిర్మించే అవకాశం కల్పించారని సెట్ డిజైనర్ వెల్లడించారు.
500 మంది కార్మికులు రేయింబవళ్లు దీనికోసం శ్రమించారు. దాదాపు 300-400 మంది థాయ్ కార్మికులు, 100 మంది సొంత కార్మికుల టీమ్ తో ఈ సెట్ నిర్మాణం పూర్తి చేసారు. ఫలితంగా లియోరి ఇరుకైన దారులు, లేయర్డ్ నిర్మాణాలు, ఇసుకతో కూడిన అల్లికలను కూడా అక్కడ పునఃసృష్టించారు. భారీ యాక్షన్, గూఢచర్య సన్నివేశాలకు అవసరమైన లియోరీ నగరాన్ని సృష్టించేందుకు టీమ్ చాలా శ్రమించింది.
థాయిలాండ్ లో లియోరి నగరాన్ని నిర్మించగా, దానికి సంబంధితంగా ముంబైలో మరో పెద్ద సెట్‌ను నిర్మించారు. మాధ్ ద్వీపంలో భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా 4- ఎకరాల సెట్‌ను నిర్మించారు. ఈ సెట్ లో భారీ పేలుడు సన్నివేశాలు, ఛేజ్ లు యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించారు. దర్శకనిర్మాతలు వర్కర్స్ భద్రత, సన్నివేశాల విజువలైజేషన్ విషయంలో రాజీ పడకుండా పెద్ద ఎత్తున చిత్రీకరించడానికి అన్నివిధాలా సహకారం అందింది.
ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా, సంజయ్ దత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. రెండవ వారంలో హౌస్‌ఫుల్ షోలతో నడుస్తున్న ధురంధర్ భారతదేశంలో అత్యంత భారీ వసూళ్ల చిత్రాలలో ఒకటిగా దూసుకుపోతోంది. రణ్ వీర్ సింగ్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంగా దురంధర్ రికార్డులకెక్కుతోంది.