రణబీర్ (X) రణవీర్: శ్రీరాముడిగా ఎవరు బెస్ట్?
అయితే రణబీర్ లుక్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.;
ఆ ఇద్దరూ ఎన్వీ తినేవాళ్లే.. కానీ పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తారు. దురంధర్ గా సంచలనాలు సృష్టించాడు రణ వీర్ సింగ్. అంతకుముందు యానిమల్ లో రణ్ విజయ్ అనే క్రూరుడి పాత్రలో రక్తి కట్టించాడు రణబీర్. నటులుగా ఇద్దరూ ఎవరికి వారే ప్రత్యేకం. అద్భుత ప్రతిభ ఉన్న స్టార్లు. ఒకవేళ శ్రీరాముడి వేషం వేస్తే ఆ ఇద్దరిలో ఎవరు బెస్ట్? అనే చర్చ వెబ్ లో వేడెక్కించేస్తోంది. పూర్తి వివరంలోకి వెళితే...
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది నితేష్ తివారీ దర్శకత్వంలోని `రామాయణం`. ఇటీవల ముంబైలో ఘనంగా విడుదలైన ఈ చిత్ర టీజర్‌లో రణబీర్ కపూర్ `శ్రీరాముడి` అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మృధువైన ఆహార్యం, ప్రశాంతమైన ముఖవర్చస్సుతో రణబీర్ రాముడి పాత్రకు ప్రాణం పోశారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. `యానిమల్` వంటి సినిమాలో రణ్‌విజయ్ అనే క్రూరమైన పాత్రలో నటించిన రణబీర్ ఇప్పుడు దానికి పూర్తి భిన్నమైన మర్యాద పురుషోత్తముడి పాత్రలో మెరవడం ఆయన నటనలోని వైవిధ్యాన్ని చాటిచెబుతోంది.
అయితే రణబీర్ లుక్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రణవీర్ సింగ్‌ను రాముడిగా ఊహిస్తూ రూపొందించిన AI (కృత్రిమ మేథస్సు) చిత్రాలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా `ధురంధర్` సినిమా భారీ విజయంతో జోరుమీదున్న రణవీర్.. ఒకవేళ రామాయణంలో నటిస్తే ఎలా ఉంటుందనే కుతూహలం అందరిలోనూ నెలకొంది. ఈ AI ఫోటోలలో రణవీర్ రూపం చాలా సహజంగా..ఆకర్షణీయంగా ఉండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
రణవీర్ సింగ్ ముఖంలో అమాయకత్వంతో పాటు ఒక రకమైన రాజసం, గాంభీర్యం ఉన్నాయని.. అవి రాముడి పాత్రకు చక్కగా సరిపోతాయని ఒక వర్గం అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆయన తన పాత్రల కోసం పడే కష్టం- డెడికేషన్ అందరికీ తెలిసిందే. రణబీర్ లాగే రణవీర్ కూడా పాత్ర కోసం ప్రాణం పెడతారని.. ఆ ఇద్దరూ అద్భుతమైన నటులని కొనియాడుతున్నారు. రణవీర్ రాముడిగా కనిపిస్తే ఆ సినిమా స్థాయి ఇంకా పెరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు.. రణవీర్ సింగ్ లో ఉన్న ఎనర్జీకి ఆయన రాముడి కంటే రావణుడి పాత్రకు లేదా ఇంద్రజిత్ వంటి పరాక్రమవంతుడైన యోధుడి పాత్రకు మరింత బాగా సెట్ అవుతారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. రణబీర్ కపూర్‌లోని సౌమ్యత రాముడికి సరిపోతుందని.. రణవీర్‌లోని అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్ ఇతర కీలక పాత్రలకు బాగుంటుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా.. ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య `శ్రీరాముడి` పాత్రపై జరుగుతున్న ఈ సోషల్ మీడియా వార్ వెబ్ ప్రపంచంలో వేడిని పెంచుతోంది.
మొత్తానికి నితేష్ తివారీ `రామాయణం` భారతీయ సినిమా కీర్తిని పెంచుతుందనే ఆశిస్తున్నారు. సుమారు 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మర్, ఎ.ఆర్. రెహమాన్ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ రాముడిగా ఇప్పటికే మెప్పించగా.. రణవీర్ AI ఇమేజినరీ ఫోటోలు కేవలం ఊహలే అయినా.. ఈ ఇద్దరు నటుల మధ్య పోటీ మాత్రం ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచుతోంది.