రణబాలి సెన్సార్ టాక్.. ఓ క్లారిటీ వచ్చేసింది

ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సెప్టెంబర్ చివర్లో విడుదల చేసిన 'రణబాలి' టీజర్‌లో హింస ఎక్కువగా ఉండటంతో పూర్తి సినిమాకు 'A' సర్టిఫికెట్ వస్తుందని అప్పట్లో కామెంట్స్ వచ్చాయి.

Update: 2026-10-13 07:15 GMT

కొన్ని సినిమాల ట్రైలర్లు చూసినప్పుడు అవి థియేటర్లలో ఎంత సీరియస్ గా ఉంటాయో అనే అంచనాలు రావడం కామన్. విజయ్ దేవరకొండ 'రణబాలి' విషయంలోనూ అదే జరిగింది. బ్రిటిషర్ల దారుణాలు, కరువు పరిస్థితులు, హీరో పోరాటం.. ప్రమోషనల్ వీడియోల్లో ఇవన్నీ చాలా రా వైల్డ్ టోన్‌లో చూపించారు. దాంతో సినిమా పెద్దవాళ్లకే పరిమితమవుతుందేమో అనే సందేహం వచ్చింది. కానీ ఇప్పుడు సెన్సార్ దగ్గర నుంచి వచ్చిన టాక్ ఆ అంచనాను కొంత మార్చేలా ఉంది.

ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సెప్టెంబర్ చివర్లో విడుదల చేసిన 'రణబాలి' టీజర్‌లో హింస ఎక్కువగా ఉండటంతో పూర్తి సినిమాకు 'A' సర్టిఫికెట్ వస్తుందని అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు పూర్తి సినిమాకు 'యూ/ఏ' సర్టిఫికెట్ వచ్చిందని, ఎలాంటి కట్స్ సూచించలేదని సమాచారం. టీజర్ చూసి అంచనా వేసిన దానికి భిన్నంగా ఇప్పుడు సెన్సార్ టాక్ వినిపిస్తోంది.

దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ముందే ఓ విషయం వెల్లడించారు. సినిమా సిద్ధమైన తర్వాత కొందరికి చూపించగా కొన్ని హింసాత్మక సన్నివేశాలు మరీ ఇబ్బందిగా ఉన్నాయని ఫీడ్‌బ్యాక్ వచ్చిందట. తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్స్ మీద కూడా వాటి ప్రభావం పడుతుందని భావించి డోస్ తగ్గించినట్లు చెప్పారు. విజయ్ కూడా అప్పటి అసలు సంఘటనలు సినిమాలో చూపించిన దానికంటే ఘోరంగా ఉండేవని, కథకు అవసరమైనంత హింసనే ఉంచామని వివరించారు.

రాహుల్ చెప్పిన కథ నేపథ్యం కూడా ఈ సెన్సార్ టాక్‌కు మరో కోణం. 'రణబాలి'ని జరిగిన చరిత్రను ఉన్నది ఉన్నట్లు చూపించే సినిమాగా కాకుండా, చరిత్రకు ఫిక్షన్ జోడించిన కథగా రూపొందించారు. బ్రిటిషర్ల పాలనలో కరువు ఎదుర్కొన్న ప్రజల జీవితాలతో పాటు రణబాలి, జయమ్మ పాత్రల బంధానికి కూడా సినిమాలో చోటుంది. ట్రైలర్‌లో ఎక్కువగా పోరాటాన్ని చూపించినా ఎమోషనల్ సీన్స్ కూడా కథలో హైలెట్ చేయనున్నట్లు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.

ఇక అక్టోబర్ 15న విడుదలవుతున్న రజనీకాంత్ 'జైలర్ 2'కు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మరుసటి రోజే 'రణబాలి' థియేటర్లకు వస్తోంది. మరోవైపు తన సినిమాలకు టికెట్ రేట్ల పెంపు వద్దని విజయ్ ఇటీవల ప్రకటించారు. సాధారణ టికెట్ ధరలతోనే 'రణబాలి'ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం చిత్రబృందం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లోనూ ప్రమోషన్లు కొనసాగిస్తోంది.

Tags:    

Similar News