​మా మధ్య ఈగోలు లేవు.. రంభ ఊర్వశి మేనక హీరోయిన్ల ముచ్చట్లు!

హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రాచీ సింగ్ Tupaki.com కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Update: 2026-08-26 12:35 GMT

అల్లరి నరేష్ హీరోగా చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ రంభ ఊర్వశి మేనక సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రాబోతోంది. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రాచీ సింగ్ Tupaki.com కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు షూటింగ్ సమయంలో జరిగిన ఎన్నో సరదా విషయాలను వాళ్లు పంచుకున్నారు.

తన కెరీర్ ప్రయాణం గురించి రాశి సింగ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ తనను ఎంతగానో ఆదరించిందని, తెలుగు ప్రేక్షకుల ప్రేమ వల్ల తానొక తెలుగమ్మాయిలా మారిపోయానని చెప్పారు. టైటిల్ లోనే తమ పాత్రల పేర్లు ఉండటం హీరోయిన్లుగా తమకు దక్కిన చాలా పెద్ద విషయమని ఆమె పేర్కొన్నారు. గతంలో ఇదే ప్రొడక్షన్ లో ఒక సినిమా మిస్సయినా, మళ్లీ కాల్ చేసి ఈ చిత్రంలో రంభ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు కథ విని ఎంతగానో నచ్చి వెంటనే ఒప్పుకున్నానని రాశి వివరించారు.

అల్లరి నరేష్ తో పనిచేసిన అనుభవం గురించి ప్రాచీ సింగ్ మాట్లాడారు. నరేష్ గారు సెట్ లో ఎంతో కూల్ గా ఉంటారని, టేక్ కు ముందు చాలా సైలెంట్ గా తన కుర్చీలో కూర్చుని ఉంటారని చెప్పారు. ఎప్పుడైతే యాక్షన్ అంటారో, వెంటనే తన అనుభవాన్ని పక్కనపెట్టి ఒక కొత్త నటుడిలా ఫుల్ ఎనర్జీతో క్యారెక్టర్ లోకి మారిపోతారని, కట్ చెప్పగానే మళ్లీ ప్రశాంతంగా మారిపోతారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో ఆయన నటించిన నాంది చూసి ఫిదా అయ్యానని, ఇప్పుడు ఆయనతో ఫుల్ ఫన్ సినిమాలో నటించడం చాలా నేర్చుకునేలా చేసిందని అన్నారు.

విష్ణుప్రియ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం రావడం వెనుక పూర్వీకుల ఆశీస్సులు ఉన్నాయని నమ్ముతున్నట్లు చెప్పారు. గతంలో టెలివిజన్ లో పని చేస్తున్నప్పుడు పెద్ద దర్శకులు పిలిచి మెచ్చుకునేవారని, కానీ ఎవరూ క్యారెక్టర్లు ఇవ్వలేదని గుర్తుచేసుకున్నారు. పదేళ్ల క్రితం టీవీ షోలో నరేష్ గారు గెస్ట్ గా వచ్చినప్పుడు ఆయన ముందు డాన్స్ చేశానని, ఇప్పుడు ఏకంగా ఆయన పక్కనే సినిమా టైటిల్ సాంగ్ లో డాన్స్ చేయడం ఒక సర్కిల్ లా అనిపించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

అలాగే ఒకే సినిమాలో ముగ్గురు అమ్మాయిలు ఉంటే ఈగోలు వస్తాయనే ప్రచారాన్ని వీళ్లు కొట్టిపారేశారు. అబ్బాయిల మధ్యే ఎక్కువ గొడవలు ఉంటాయని, తమ మధ్య ఎలాంటి సమస్యలు రాలేదని సరదాగా కౌంటర్లు వేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి స్పందిస్తూ.. రీల్స్ చూసి న్యూస్ ఛానెళ్లు అనవసరమైన డిబేట్లు పెట్టడం కరెక్ట్ కాదని, ప్రజలకు ఉపయోగపడే విషయాలను చూపించాలని విష్ణుప్రియ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నెగెటివ్ కామెంట్లను పట్టించుకోవడం ఎప్పుడో మానేశామని చెప్పారు.

చివరిగా తమ భవిష్యత్తు ప్రణాళికల గురించి చెబుతూ.. పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న మంచి పాత్రలు, లేదా అదిరిపోయే డాన్స్ నంబర్స్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తామని హీరోయిన్లు తెలిపారు. ఇక అల్లరి నరేష్ మార్క్ ఫన్ తో పాటు అప్సరసల గందరగోళంతో తెరకెక్కిన రంభ ఊర్వశి మేనక సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వస్తుందని తెలిపారు. అలాగే ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని ఈ ముగ్గురు భామలు వివరణ ఇచ్చారు.


Full View


Tags:    

Similar News