లంక‌కు నిప్పంటించి చుక్క‌లు చూపించే ఆంజ‌నేయుడు ఎక్క‌డ‌?

నితీష్ తివారీ రామాయ‌ణం ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో అన్ని ముఖ్య‌ పాత్ర‌లు క‌నిపించాయి కానీ, అత్యంత కీల‌క‌మైన ఆంజ‌నేయ స్వామి పాత్ర (స‌న్నీడియోల్ పోషించారు) క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Update: 2026-07-31 07:54 GMT

నితీష్ తివారీ రామాయ‌ణం ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో అన్ని ముఖ్య‌ పాత్ర‌లు క‌నిపించాయి కానీ, అత్యంత కీల‌క‌మైన ఆంజ‌నేయ స్వామి పాత్ర (స‌న్నీడియోల్ పోషించారు) క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అలాగే మండోద‌రిగా న‌టించిన కాజ‌ల్ కూడా ఈ ట్రైల‌ర్ లో మిస్స‌యింది. ఎందుకు ఈ ముఖ్యమైన పాత్ర‌లు మిస్స‌య్యాయి? అన్న డిబేట్ సోష‌ల్ మీడియాలో హోరెత్తుతోంది.

మోస్ట్ అవైటెడ్ నితీష్ తివారీ దృశ్య కావ్యం `రామాయణం: పార్ట్-1` ట్రైలర్ ఇంట‌ర్నెట్ లో సునామీ స్పీడ్ తో దూసుకెళ్లింది. గ్రాండ్ విజువల్స్, రాముడిగా రణ్‌బీర్ కపూర్ ప్రశాంత రూపం, రావణుడిగా యష్ అద్భుత ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ ట్రైలర్‌ను చూసిన ప్రతి ఒక్కరి మనసులోనూ ఒకటే ప్రశ్న మెదులుతోంది. రావణ లంకకు నిప్పంటించి చుక్కలు చూపించే ఆంజనేయుడు ఎక్కడ?. రామాయణంలో అత్యంత కీలకమైన.. కోట్లాది మంది భక్తులు ఆరాధించే ఆంజనేయ స్వామి పాత్రలో నటిస్తున్న సన్నీ డియోల్ తో పాటు మండోదరిగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ కూడా ఈ ట్రైలర్‌లో మిస్ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఈ `మిస్సింగ్` వెనుక ఒక బలమైన వ్యూహం దాగి ఉంది. నితీష్ తివారీ ఈ పురాణేతిహాస‌ కథను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. మొదటి భాగం అయోధ్యా నగరం, శ్రీరాముని వనవాసం, సీతాపహరణం, రావణాసురుడి ప్రాబల్యాన్ని ఎలివేట్ చేస్తూ సాగుతుంది. రామాయణ ఇతిహాసం ప్రకారం హనుమంతుని ఆగమనం శ్రీరాముడి వనవాసం, సీతాపహరణం తర్వాతే జరుగుతుంది. కాబట్టి కథా క్రమానికి అనుగుణంగా రాముడు, సీత, లక్ష్మణుడు, రావణాసురుడి పాత్రలను మొదటి భాగానికి ప్రధానంగా చూపుతూ... హనుమంతుడి పాత్రను రెండవ భాగం కోసం లేదా పార్ట్-1 ముగింపు కోసం దాచిపెట్టడం సినిమాటిక్‌గా సరైన నిర్ణయం.

హనుమంతుడి పాత్రకు ప్రపంచవ్యాప్తంగా అపారమైన భక్తి ప్రవృత్తులు ఉన్నాయి. సన్నీడియోల్‌ను హనుమంతుడిగా చూపించడం అనేది ఒక అతిపెద్ద ఈవెంట్ లాంటిది. ఒకే ట్రైలర్‌లో శ్రీరాముడు, రావణుడితో పాటు హనుమంతుడిని కూడా చూపించేస్తే దేని ప్రాధాన్యత దానికి దక్కకపోయే ప్రమాదం ఉంది. అందుకే సోషల్ మీడియాలో కూడా అభిమానులు దీనిపై ఆసక్తికర డిబేట్ న‌డిపిస్తున్నారు. హనుమంతుడి ఎంట్రీ అనేది పార్ట్-1 ముగింపులో వచ్చే అత్యంత ఉత్కంఠభరిత ఘట్టం కావాలి! అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇది పార్ట్-2 పై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుందని విశ్లేషిస్తున్నారు.

ఈ ఊహాగానాలకు నటుడు సన్నీ డియోల్... దర్శకుడు నితీష్ తివారీ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సన్నీ డియోల్ మాట్లాడుతూ.. తాను ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవలే ప్రారంభించానని... ఇంకా చేయాల్సింది చాలా ఉందని అన్నారు. ఆంజనేయ స్వామి పాత్ర పోషించడం ఒక గొప్ప బాధ్యత అని డియోల్ వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల విదేశాల‌లో కామిక్ కాన్ వేడుక‌లో ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. పార్ట్ 2 కోసం ఆత్రంగా ఎదురు చూసే ట్విస్టుతో మొద‌టి భాగం క్లైమాక్స్ ముగుస్తుంద‌ని, ఉత్కంఠ‌ను పెంచే ముగింపును చూస్తార‌ని త‌లిపారు. దీనినిబట్టి హనుమంతుడి ఎంట్రీయే ఆ పెద్ద సర్‌ప్రైజ్ అని స్పష్టమవుతోంది.

ఏది ఏమైనా.. మేకర్స్ ఇప్పటివరకు సన్నీడియోల్ ఆంజనేయ స్వామి లుక్‌ను అధికారికంగా బయటకు వదలకుండా అత్యంత గోప్యంగా ఉంచారు. కథ ప్రకారమే సాగితే `రామాయణం: పార్ట్-1` చివరిలో ఆంజనేయుడి పాత్రకు సంబంధించిన చిన్న గ్లింప్స్ లభించే అవకాశముంది. ఇక రెండవ భాగంలో హనుమంతుడు ప్రధాన పాత్ర పోషించనున్నారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్, రవి దూబే (లక్ష్మణుడు) లతో పాటు లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్న ఈ పార్ట్-1 ఈ ఏడాది నవంబర్ 8న థియేటర్లలోకి రానుండగా.. పార్ట్-2 దివాళి 2027లో విడుదల కానుంది.

Tags:    

Similar News